మీ కళ్లను కూల్ చేసుకోండిలా…

మీ కళ్లను కూల్ చేసుకోండిలా…

కీర దోసకాయ ప్యాక్​

ఒక దోసకాయ  తీసుకుని మిక్సీ పట్టాలి. అందులో కొన్ని నీళ్లు కలిపి జ్యూస్​లా చేయాలి. తర్వాత కొన్ని కాటన్​ క్లాత్​లు తీసుకుని జ్యూస్​లో ముంచాలి. ఆ మిశ్రమం క్లాత్​కి బాగా పట్టిన తర్వాత  క్లాత్​ బయటకు తీసి శాండ్‌విచ్​ బ్యాగులో పెట్టి ఫ్రిజ్​లో ఉంచాలి.  అవి ఐస్​లా గడ్డ కట్టిన తర్వాత బయటకు తీసి కళ్ల మీద పెట్టుకోవాలి. 20–25 నిమిషాల తర్వాత తీసేయాలి.  ఇలా చేయడం వల్ల కళ్ల  కింద నల్లటి చారలు పోతాయి. అలాగే దోసకాయలో నీటిశాతం, విటమిన్​–కె  సమృద్ధిగా
ఉండటం వల్ల కళ్లకు విశ్రాంతి  లభిస్తుంది.

దోసకాయ, ఆలూ

దోసకాయ, ఆలుగడ్డ రసం సమపాళ్లలో తీసుకోవాలి. శుభ్రమైన కాటన్​ క్లాత్​ని అందులో ముంచి  ఆ క్లాత్​ని కళ్లమీద కనుబొమ్మల కింద రాయాలి. ముఖమంతా కారకుండా కళ్లకు మాత్రమే ఆ రసం అంటేలా చూసుకోవాలి.

కీరదోస, ఆలూ

కీరదోస, ఆలుగడ్డలు కూడా కళ్ల సంరక్షణకు చాలా ఉపయోగపడతాయి.  ఇవి  కళ్లకు చల్లదనాన్ని ఇస్తాయి.  ఆలుగడ్డ, కీరదోస ముక్కలను గుండ్రంగా కట్​ చేసి కళ్ల మీద పెట్టుకొని 10 నిమిషాల తర్వాత తీసేయాలి. లేదంటే వీటిని పేస్ట్​ చేసి కళ్లకి ప్యాక్​లా వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కళ్లకు చల్లదనం లభిస్తుంది. త్వరగా మచ్చలు పోతాయి.

కలబంద, క్యారెట్​ మాస్క్​

ఒక గిన్నెలో  కోడిగుడ్డు తెల్లసొన, సన్నగా తురిమిన క్యారెట్​, ఒక టేబుల్​ స్పూన్​ కలబంద రసం వేసి పేస్ట్​లా కలపాలి.   ఆ మిశ్రమాన్ని కళ్లకింద రాసి 15 నుంచి 30 నిమిషాలు ఉంచుకుని చల్లటి నీళ్లతో కడిగేయాలి.

ఆల్మండ్​ నూనె

రాత్రి నిద్రపోయే ముందు ఆల్మండ్​ నూనెను  కళ్లకింద  వలయాలపై  రాసి మృదువుగా చేతివేళ్లతో మసాజ్​ చేయాలి.  ఇలా చేయడం వల్ల  నల్లటి వలయాలు పోతాయి. అయితే రాసుకునేటప్పుడు  కళ్లకు తగలకుండా జాగ్రత్తగా రాసుకోవాలి.

ఆలూ, పుదీనా

పొట్టు తీసిన ఆలుగడ్డ, పుదీనా కలిపి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమానికి  కొన్ని నీళ్లు  కలిపి జ్యూస్​లా చేయాలి. తర్వాత కాటన్​ క్లాత్​ తీసుకుని  ఆ మిశ్రమంలో ముంచాలి.  ఆ మిశ్రమం క్లాత్​కి బాగా పట్టిన తర్వాత  ​ బయటకు తీసి శాండ్​విచ్​ బ్యాగులో పెట్టి ఫ్రిజ్​లో ఉంచాలి.  అవి ఐస్​లా గడ్డ కట్టిన తర్వాత బయటకు తీసి కళ్ల మీద పెట్టుకోవాలి. 20–25
నిమిషాల తర్వాత తీసేయాలి.

కాఫీ పౌడర్​ ప్యాక్​

ఒక గిన్నెలో  కోడిగుడ్డు తెల్లసొన, రెండు టేబుల్​ స్పూన్ల కాఫీ పౌడర్​ తీసుకోవాలి.  ఆ మిశ్రమాన్ని ఒక నిమిషం పాటు బాగా కలపాలి.
తర్వాత ఆ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ రాయాలి.  రాసేటప్పుడు ఈ మిశ్రమం కళ్లలోకి
పోకుండా జాగ్రత్తపడాలి.