అనిల్​ అంబానీ ‘రెట్రోస్పెక్టివ్​’ వాదనపై ఏమంటారు? : బాంబే హైకోర్టు

అనిల్​ అంబానీ ‘రెట్రోస్పెక్టివ్​’ వాదనపై ఏమంటారు? : బాంబే హైకోర్టు
  • ఐటీశాఖను ఆదేశించిన బాంబే హైకోర్టు

ముంబై: పన్నుల ఎగవేతకు సంబంధించిన తనను నల్లధన చట్టం కింద ప్రాసిక్యూట్​ చేయడం వల్ల ‘రెట్రోస్పెక్టివ్​’ (వెనుకటి తేదీ నుంచి వర్తించడం) ప్రభావం ఉంటుందన్న రిలయన్స్​ అడాగ్​ చైర్మన్​ అనిల్​ అంబానీ వాదనపై స్పందించాలని బొంబాయి హైకోర్టు ఐటీ శాఖను ఆదేశించింది. తనకు ఐటీ శాఖ జారీ చేసిన షోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ అంబానీ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను విచారించిన జస్టిస్‌‌‌‌లు గౌతమ్ పటేల్, ఎస్‌‌‌‌జీ డిగేలతో కూడిన డివిజన్ బెంచ్, ఒక వ్యక్తి తన చేసిన పనికి భవిష్యత్​లో శిక్ష ఉంటుందనే  విషయం ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది.   హైకోర్టు ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి  వాయిదా వేసింది.  అప్పటి వరకు అంబానీపై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోవద్దని ఐటీ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ని ఆదేశిస్తూ 2022 సెప్టెంబర్ నాటి ఉత్తర్వులను పొడిగించింది.  

రెండు స్విస్ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ. 814 కోట్లకు పైగా వెల్లడించని నగదుకు సంబంధించి రూ. 420 కోట్ల పన్ను ఎగవేసినట్లు ఆరోపణలపై 2022 ఆగస్టు 8న అంబానీకి ఐటీ శాఖ నోటీసు జారీ చేసింది.  ఐటీ నోటీసు ప్రకారం, అంబానీని బ్లాక్ మనీ 2015 పన్ను చట్టంలోని సెక్షన్ 50,  51 కింద ప్రాసిక్యూట్ చేయవచ్చని ఐటీశాఖ వాదించింది. దీనికింద నేరం రుజువైతే గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష,  జరిమానా ఉంటుంది.  నిందితుడు  అంబానీ  "ఉద్దేశపూర్వకంగా" తన విదేశీ బ్యాంకు ఖాతా వివరాలను వెల్లడించలేదని,  "ఉద్దేశపూర్వకంగా" పన్ను ఎగవేతకు పాల్పడ్డాడని డిపార్ట్‌‌‌‌మెంట్ ఆరోపించింది. ఇందుకు అంబానీ స్పందిస్తూ   బ్లాక్ మనీ చట్టం 2015లో అమల్లోకి వచ్చిందని, తనవి 2006-–2007,  2010–-2011 అసెస్‌‌‌‌మెంట్ సంవత్సరాలకు చెందిన లావాదేవీలు అని తన పిటిషన్‌‌‌‌లో పేర్కొన్నారు.