సోన్‌భద్రలో ఏం జరిగింది..? ప్రియాంకా ఎందుకు వెళ్లారు?

సోన్‌భద్రలో ఏం జరిగింది..? ప్రియాంకా ఎందుకు వెళ్లారు?

యూపీలో రెండో అతిపెద్ద జిల్లా సోన్ భద్రలోని ఉంభా గ్రామంలో మొత్తం 300 కుటుంబాలున్నాయి. అందులో 150 గుర్జర్లవికాగా, 125 గోండు గిరిజనులవి. అక్కడి 38 ఎకరాల భూమిని చాలా ఏండ్ల నుంచి గిరిజనులే సాగుచేస్తున్నారు. కానీ ఆ భూమి తనదేనంటూ గ్రామపెద్ద యగ్యాదత్ వాదించేవాడు. భూమినిస్వాధీనం చేసుకో డానికి రకరకాల ప్రయత్నాలు చేసిన ఆయన, ఈ నెల 17న తన 200 మంది అనుచరులను వెంటబెట్టుకొచ్చి గిరిజనులపై దాడి చేశారు. కాల్పుల్లో 10 మంది చనిపోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఐదుగురు ఆఫీసర్ల సస్పెన్షన్

సోన్‌‌భద్ర గొడవల్లో చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌‌ చెప్పారు. శుక్రవారం లక్నోలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఈ కేసును సరిగా డీల్‌‌ చేయడంలో ఫెయిల్‌‌ అయ్యారన్న ఆరోపణలపై సబ్‌ కలెక్టర్‌‌తోపాటు నలుగురు పోలీసుల్ని సస్పెండ్‌ చేశామని, ప్రధాన నిందితుడు యాగ్య దత్‌‌తోపాటు మరో 29 మంది నిందితుల్ని అరెస్టుచేశామని తెలిపారు. ఘటనపై అడిషనల్‌‌ చీప్ సెక్రటరీ( రెవెన్యూ ) ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటుచేశామని, ఈ కమిటీ పది రోజుల్లో రిపోర్ట్‌‌ను అందజేస్తుందని అన్నారు.

ప్రియాంక గాంధీ నిరసన

ఉంభా గ్రామంలో గిరిజనుల హత్యలకు బీజేపీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. శుక్రవారం బాధిత కుటుంబాల్ని పరామర్శించడానికి వెళ్తున్న ఆమెను దారిమధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. సర్కారు తీరుకు నిరసనగా రోడ్డుపైనే బైఠాయించిన ప్రియాంక.. ఉంభా గ్రామంలోకి తనను అనుమతిం చేదాకా వెనక్కెళ్లనని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు ఆమెను బలవంతంగా ఓ గెస్ట్​హౌస్ కు తరలించారు. ప్రియాంక అడ్డగింతను
నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకుదిగారు. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లోని బీజేపీ ఆఫీసుల ముందు ధర్నాలు చేశారు. ప్రియాంక నిర్బంధం అక్రమమని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

22న సోన్ భద్రకు నేషనల్ ఎస్టీ కమిషన్

న్యూఢిల్లీ: యూపీలోని సోన్‌‌భద్రను నేషనల్‌‌ ఎస్టీ కమిషన్‌‌ ఈనెల 22న పర్యటించనుంది. పదిమంది గిరిజన రైతుల హత్యకు దారితీసిన సంఘటనపై విచారించనుంది. కమిషన్‌‌ చైర్మన్‌‌ నంద్‌ కుమార్‌‌సా యి ఆధ్వర్యం లోని టీం చనిపోయిన కుటుంబసభ్యులు, పోలీసులు, జిల్లా అధికారులను కలవనుంది. స్థానిక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఇప్పటికే యూపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌ ఆరోపించింది. గిరిజనుల సంక్షేమాన్ని రాష్ట్రాలు పట్టించుకోకపోవడం పట్ల నేషనల్‌‌ ఎస్టీ కమిషన్‌‌ చైర్మన్‌‌ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు.

‘‘ ఏళ్ల తరబడి తాము సాగుచేస్తున్న భూమిపై ఓనర్‌‌షిప్‌‌ పొందడానికి మామూలుగా గిరిజనులు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. భూమిని సాగుచేస్తున్నారు. గుర్తింపు కార్డులు కూడా వాళ్లకు రావడం చాలా కష్టం. కిందిస్థాయి అధికారులు కొర్రీలు పెట్టడం వల్లే ఈ పరిస్థితులు వస్తున్నాయి’’ అని నేషనల్‌‌ ఎస్టీ కమిషన్‌‌ చైర్మన్‌‌ నంద్‌ కుమార్‌‌సాయి చెప్పారు. ఉత్తరప్రదేశ్‌‌లో శాంతిభద్రతలు మెరుగుపడడానికి సీరియస్‌‌ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.