మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో క్వాలిటీ, సేఫ్టీ ఏమైంది? : ఆర్‌‌ఎస్ ప్రవీణ్ కుమార్

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో  క్వాలిటీ, సేఫ్టీ ఏమైంది? : ఆర్‌‌ఎస్ ప్రవీణ్ కుమార్

కాగజ్‌ నగర్, వెలుగు: ఇంజినీర్ అవతారమెత్తి రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి గొప్పగా కట్టిన కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోవడంపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బ్యారేజీ నిర్మాణంలో కేవలం కమీషన్ల కోసం తప్ప అంతర్జాతీయ నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమ, మంగళవారాల్లో ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట మండలంలో పర్యటించి మాట్లాడారు. ప్రాజెక్టులో రీడిజైన్ పేరుతో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.లక్ష కోట్లు అప్పు తెచ్చి బ్యారేజీ కట్టామని గొప్పలు చెప్పుకున్నారన్నారు. బ్యారేజీ నిర్మించిన నాలుగేండ్లలోనే కుంగిపోవడానికి కారకులు ఇంజినీర్లా.. కేసీఆర్ బినామీ కాంట్రాక్టర్లా.. చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌‌కు 30 శాతం అడ్వాన్స్ కమీషన్ ఇచ్చిన బడా కాంట్రాక్టర్లు ప్రాజెక్టుల నిర్మాణాల్లో నాణ్యత పాటించలేదని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కల్వకుంట్ల కుటుంబం రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిందన్నారు.  

ఇథనాల్‌ ఫ్యాక్టరీని మూసివేయాలి..

ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా నారాయణ పేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు, ఎక్లాస్ పూర్, జిన్నారం గ్రామస్తులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తున్నామని ప్రవీణ్‌ కుమార్‌‌ అన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల గాలి, నీరు, అక్కడి పొలాలు కలుషితమై ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందన్నారు. ఆ ప్రాంత రైతులకు సాగు నీరందించే మన్నెవాగు కూడా పూర్తిగా కలుషితమవుతుందని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ, పర్యావరణ అనుమతుల్లేని కెమికల్ ఫ్యాక్టరీని మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేసీఆర్ ఎన్ని బంధులు పెట్టినా ప్రజలు నమ్మరని, ఈసారి బహుజన రాజ్యం రావడం ఖాయమని అన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో సిర్పూర్ టీ నియోజకవర్గం ఉందని, ఈ ఎన్నికల్లో ప్రజలు బీఎస్పీకి మద్దతుగా నిలవాలని కోరారు. తాను చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర మంగళవారంతో 300 రోజులకు చేరుకోవడంపై ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.