Poonam Pandey: పూనమ్ పాండే ఎలా చనిపోయింది.. ఏంటి ఈ సర్వైకల్ క్యాన్సర్?

Poonam Pandey: పూనమ్ పాండే ఎలా చనిపోయింది.. ఏంటి ఈ సర్వైకల్ క్యాన్సర్?

మోడల్, వివాదాస్పద నటి పూనమ్ పాండే కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 32 ఏళ్ల చిన్న వయస్సులోనే అకాలమరణం చెందటం ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

నిరుపేద కుటుంబంలో జన్మించిన పాండే.. ఆ పేదరికాన్ని సవాల్ చేయడానికే ముంబై నగరానికి వచ్చింది. ఆలా అని ఆమె సినీ ప్రయాణం.. పూల పాన్పు కాదు.. ఎన్నో కష్టాలు. బాలీవుడ్‌ లో అవకాశాల కోసం ఎంతగానో ప్రయత్నించింది. చివరికి నషా అనే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే పూనమ్ పాండే తన నటన కంటే.. వివాదాస్పద ప్రకటనలతోనే తరచూ వార్తల్లో నిలిచేవారు. తన స్టైల్, బోల్డ్ లుక్స్‌తో అందరిని ఆకట్టుకునేవారు. రెండ్రోజుల ముందు వరకూ కూడా ఆమె అందరితో ఎంతో సందడిగా కనిపించారు. అలాంటి ఆమె ఉన్నట్టుండి గర్భాశయ కేన్సర్(Cervical Cancer)తో మరణించడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. 

అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి..? చికిత్స లేదా..? ఉంటే పూనమ్ పాండే ఎందుకు చికిత్స తీసుకోలేకపోయింది.. అని నెటిజెన్స్  నెట్టింట శోధిస్తున్నారు. 

భారతీయ మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్‌ది రెండో స్థానం. ప్రపంచ వ్యాప్తంగా ఏటా దాదాపు 6 లక్షల కేసులు నమోదవుతుండగా.. అందులో 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందునా ఈ క్యాన్సర్‌ ప్రాబల్యం మన దేశంలోనే ఎక్కువ. ప్రపంచ వ్యాప్తంగా ఈ క్యాన్సర్‌ బారిన పడుతున్న ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు మన దేశ మహిళే. ఇక ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్న వారిలో మూడో వంతు మంది భారతీయ మహిళలే.

సర్వైకర్ క్యాన్సర్ అంటే ఏంటి..?

మహిళల్లో గర్భాశయానికి దిగువున ఉండే సన్నటి ప్రదేశాన్ని సర్విక్స్ అంటారు. ఇది గర్భాశయాన్ని యోనితో కలిపి ఉంచుతుంది. ఆ ప్రాంతంలో వచ్చే క్యాన్సర్ ని సర్వైకల్ క్యాన్సర్ అంటారు. హ్యూమన్ పాపిలోమావైరస్(హెచ్‌పీవీ-HPV) ఈ క్యాన్సర్‌కు దారితీస్తుంది. ఈ క్యాన్సర్ బారిన పడ్డ తొలినాళ్లల్లో ఎటువంటి రోగ లక్షణాలు కనిపించవని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి ముదిరేకొద్దీ రక్తస్రావం మొదలవుతుందట. అలా అని ఇది ప్రమాదకరం అని చెప్పలేం. ఎంత ముందుగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స అందించవచ్చని చెప్తున్నారు.

పాప్‌స్మియర్‌ టెస్ట్

సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ టెస్ట్(పాప్‌స్మియర్‌) అనే పరీక్ష చేస్తారు. 21 ఏళ్లు నిండిన మహిళలతో పాటు, శృంగారంలో పాల్గొనడం ప్రారంభించి మూడేళ్లు దాటిన ప్రతి మహిళా ఈ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెప్తున్నారు. ప్రతి మూడు లేదా ఐదు ఏళ్లకు ఒకసారి ఈ టెస్టు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచిస్తున్నారు.

చికిత్స ఏంటి..?

సర్వైకల్ క్యాన్సర్‌కు సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటి పలు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు హెచ్‌పీవీ టీకా తప్పనిసరి తీసుకోవాలి. తాజా బడ్జెట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా సర్వైకల్ క్యాన్సర్‌‌కు సంబంధించి పలు సూచనలు చేశారు. ప్రతి మహిళా పాప్‌స్మియర్‌ పరీక్ష చేపించుకోవాలని సూచించారు. అలాగే, ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేలా 9 నుంచి 14 ఏళ్ల మధ్య బాలికలకు టీకా తీసుకోవాలని తెలిపారు.