‘క్లౌడ్ బరస్ట్’ కృత్రిమమా ? సహజమా ?

‘క్లౌడ్ బరస్ట్’ కృత్రిమమా ? సహజమా ?

‘క్లౌడ్ బరస్ట్’ పై సీఎం కేసీఆర్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆ టాపిక్ పై హాట్ డిబేట్ జరుగుతోంది. ‘‘ క్లౌడ్ బరస్ట్ ద్వారా గోదావరి పరివాహక ప్రాంతంలో కృత్రిమంగా వరదలను సృష్టించారు. విదేశాలు కుట్ర పన్ని మన దేశంలోని పలు ప్రాంతాల్లో  క్లౌడ్ బరస్ట్ చేయిస్తున్నట్లు మాకు అస్పష్టమైన సమాచారం ఉంది’’ అని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వాడివేడి చర్చ జరుగుతోంది. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. ‘‘సీఎం హోదాలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నం. విదేశీ కుట్రపై కేసీఆర్ ఆధారాలిస్తే దర్యాప్తు చేయిస్తం’’ అని ప్రకటించారు. ఈనేపథ్యంలో హాట్ టాపిక్ గా మారిన ‘క్లౌడ్ బరస్ట్’ గురించి కొన్ని వివరాలివీ.. 

క్లౌడ్ బరస్ట్ అంటే ? 

క్లౌడ్ అంటే మేఘాలు. బరస్ట్ అంటే విస్ఫోటం. ఇక మొత్తంగా క్లౌడ్ బరస్ట్ అంటే మేఘాల విస్ఫోటం. ఇది జరిగితే ఉరుములు, పిడుగులతో ఊహించని స్థాయిలో భారీ వర్షాలు కురుస్తాయి. దాదాపు 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో గంటకు 10 సెంటీమీటర్ల (100 మి.మీ) వర్షపాతం నమోదవుతుంది. ఏదైనా ఒక నిర్దిష్ట ప్రాంతంలో రెండు గంటల వ్యవధిలోనే 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే క్లౌడ్ బరస్ట్ గా వ్యవహరిస్తారు. అయితే స్వల్ప సమయంలో సంభవించే అన్ని భారీ వర్షాలను, కుంభవృష్టిని క్లౌడ్ బరస్ట్ గా పరిగణించరు. 

46 ఏళ్లలో 30 క్లౌడ్ బరస్ట్ లు.. 

మనదేశంలో ఏటా వర్షాకాలం సమయంలో హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్, ఉత్తరాఖండ్ లలోని ఎత్తైన ప్రదేశాల్లో పలుచోట్ల క్లౌడ్ బరస్ట్ సంభవిస్తుంటుంది. మిగతా రాష్ట్రాల్లోనూ అడపాదడపా క్లౌడ్ బరస్ట్ సంభవించిన దాఖలాలు ఉన్నప్పటికీ.. పెద్దగా ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లలేదు. అయితే గతంలో హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్, ఉత్తరాఖండ్ లలో సంభవించిన క్లౌడ్ బరస్ట్ ల వల్ల భారీగా వరదలు వచ్చి, అధిక ప్రాణ నష్టం చోటుచేసుకుంది. మనదేశంలో 1970 నుంచి 2016 మధ్య కాలంలో 30 క్లౌడ్ బరస్ట్ లు చోటుచేసుకున్నాయని సమాచారం. క్లౌడ్ బరస్ట్ ను వాతావరణ శాఖ కూడా ముందస్తుగా అంచనా వేయలేదు. 

మనదేశంలో సంభవించడానికి కారణాలు.. 

రుతుపవనాలు మన దేశంలోకి ప్రవేశించినప్పుడు అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు వీస్తాయి. మధ్యధరా తీరం నుంచి వీస్తున్న గాలులు పశ్చిమాన ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తేమను తీసుకొని వస్తాయి. ఈ రెండు గాలులు పర్వత ప్రాంతాల్లో ఒకదాన్నొకటి ఢీకొన్నప్పుడు ఏర్పడిన మేఘాలు ఎక్కువ సాంద్రత (బరువు)ను కలిగి ఉంటాయి. ఈ మేఘాలు.. అతి తక్కువ సమయంలో అకస్మాత్తుగా వర్షిస్తాయి. ఈ సహజ పరిణామాన్నే ‘క్లౌడ్ బరస్ట్’ గా పేర్కొంటారు. దేశంలో పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్, ఉత్తరాఖండ్. అందుకే అక్కడ క్లౌడ్ బరస్ట్ ఎక్కువగా సంభవిస్తుంటుంది. 

క్లౌడ్ బరస్ట్ వేరు.. క్లౌడ్ సీడింగ్ వేరు  

క్లౌడ్ బరస్ట్, క్లౌడ్ సీడింగ్ రెండూ ఒకటేనని చాలామంది భావిస్తుంటారు. ఈ రెండు ప్రక్రియలు వేర్వేరు. క్లౌడ్ సీడింగ్ లో సిల్వర్ అయోడైడ్ లాంటి రసాయన పదార్థాలను మేఘాల్లోకి పంపించి కృత్రిమ వర్షాన్ని కురిపిస్తారు. కరువు పరిస్థితులు ఎక్కువగా ఉన్న సబ్ సహారన్ ఆఫ్రికా, ఆఫ్రికా ఖండం ఈశాన్య దేశాలు, ఆస్ట్రేలియా, చైనా క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను వాడుకొని కృత్రిమ వర్షాలు కురిపించుకుంటున్నాయి. 1940లలోనే ఈ టెక్నాలజీ వినియోగం ప్రారంభమైంది. అయితే దీని ఫలితాలపై చాలా సందేహాలు ఉన్నాయి. 

చైనా చేతలపై పొరుగుదేశాల ఆందోళనలు

2025 కల్లా తమ దేశంలోని 60 శాతం భూభాగం( 55 లక్షల చదరపు కిలోమీటర్ల)లో క్లౌడ్ సీడింగ్ ద్వారా  కృత్రిమ వర్షం లేదా మంచు కురిపించే ప్రాజెక్టును చేపట్టాలని చైనా యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్లానింగ్ ను 2020 డిసెంబరులోనే డ్రాగన్ దేశం ప్రకటించింది. ఇందులో భాగంగా చైనాలోని 50వేల నగరాలు, పట్టణాలలో వ్యవసాయ భూములకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా క్లౌడ్ సీడింగ్ ను ఉపయోగిస్తున్నారు. వడగళ్ల వానపడి పంటలకు నష్టం జరగకుండా ఉండేందుకూ క్లౌడ్ సీడింగ్ పద్ధతిని చైనా వాడుతోంది. వర్షం ప్రమాదకరంగా మారకుండా.. ముందస్తుగా మేఘాల నుంచి వర్షపు నీటిని తొలగిస్తోంది. క్లౌడ్ సీడింగ్ ను  చైనా విచ్చలవిడిగా వాడుకోవడం వల్ల భారత్ వంటి ఇరుగుపొరుగు దేశాలకు రుతుపవన నష్టం జరుగుతుందనే వాదన కూడా ఉంది. చైనా  చేతల వల్ల భారత్ కు వచ్చే రుతుపవనాలపై ప్రభావం పడుతుందనే ఆందోళన ఉంది. ఇరుగుపొరుగు దేశాల వానలను దొంగిలించేందుకు చైనా ఇలా చేస్తోందనే ఆరోపణలు కూడా భవిష్యత్తులో రావచ్చని నేషనల్ తైవాన్ యూనివర్సిటీ 2017లో విడుదల చేసిన ఓ అధ్యయన నివేదికలో వ్యాఖ్యానించింది.