కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం​ ఎటు పోతోంది?

కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం​ ఎటు పోతోంది?

బీహార్​ అసెంబ్లీ, పలు రాష్ట్రాల బై ఎలక్షన్స్​ రిజల్ట్స్​ తర్వాత కాంగ్రెస్​ పార్టీలో మళ్లీ అసమ్మతి గళం వినిపిస్తోంది. ఆగస్టు నెలలో సీనియర్ నేతలు రాసిన లేఖపై కూడా కాంగ్రెస్ అధినాయకత్వం పట్టీపట్టనట్టుగా వ్యవహరించింది. కొద్ది రోజులు సైలెంట్ గా ఉంటే వివాదం అదే సద్దుమణిగిపోతుందని భావించింది. అలాగే ఏఐసీసీ కీలక పదవులకు ఆ సీనియర్ నేతలను దూరం పెట్టడం ద్వారా వారికి పనిష్మెంట్ ఇవ్వొచ్చనే ధోరణి కనిపిస్తోంది. ఆ తర్వాత బీహార్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మంచి విజయం సాధిస్తుందని, దానితో ఆ విమర్శలు  చేస్తున్న వారి నోటికి తాళం వేయొచ్చని రాహుల్ గాంధీ అనుకున్నారు. కానీ అంతా తిరగబడింది. కాంగ్రెస్ బీహార్ ఎన్నికల్లో ఘోరంగా ఫెయిల్ అయింది. దీంతో కపిల్ సిబల్ లాంటి సీనియర్లు మళ్లీ గొంతు పెంచారు. అయితే ఈ సారి వాళ్లను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకైనా సిద్ధమన్నట్లు పార్టీ లీడర్ షిప్ వ్యవహరిస్తోంది.

 

కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని ఆ పార్టీ సీనియర్లు ఎప్పుడూ అంటుంటారు. ఆ పార్టీ విధానాలపై తమలో తామే విమర్శించుకున్నా.. పార్టీగా అంతా కలిసి ముందుకు సాగుతుంటామని చెప్పేవారు. కానీ ఆ పరిస్థితులకు కాలం చెల్లిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కారణం ఆ పార్టీలో సీనియర్లు చేస్తున్న విమర్శలను అధినాయకత్వం యాక్సెప్ట్ చేయలేకపోవడమే. 2014 ఎన్నికల తర్వాత క్రమంగా కాంగ్రెస్ బలం తగ్గిపోతోంది. గడిచిన ఆరేండ్లుగా ఆ పార్టీలో విధానపరంగా గట్టి నిర్ణయాలు తీసుకోలేకపోతోందని, రాహుల్ నాయకత్వం కూడా వీక్ గా ఉందని పార్టీ సీనియర్లు కొంత మంది ఆరోపిస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ పై గతంలో  పార్టీ మేధావి వర్గంలో చర్చించేవాళ్లు. కానీ ఇప్పుడు విమర్శలు చేసిన నాయకులను కీలక పదవులకు దూరంగా పెట్టేసే తీరు కనిపిస్తోంది.

నాడూ.. నేడూ.. సమీక్షల్లేవ్

ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది.  దాదాపు 70 సీట్లలో పోటీ చేసి కేవలం 20 చోట్ల కూడా గెలవలేకపోవడంతో ఆ పార్టీ ఎంతగా బలహీనపడిందో దేశమంతా అర్థమైపోయింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్, పార్టీలో సీనియర్ నేతల పట్ల రాహుల్ గాంధీ లాంటి నేతల వ్యవహార శైలిపై ఈ ఏడాది ఆగస్టు 24న అసమ్మతి గళం బయటకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిలో మార్పులు జరగాల్సిన అవసరం ఉందంటూ 23 మంది సీనియర్ నేతలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఆ లేఖలో సంతకాలు చేసిన నాయకుల్లో సుప్రీం కోర్టు లాయర్, సీనియర్ పార్లమెంటేరియన్ కపిల్ సిబల్ కూడా ఒకరు. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా ఉన్న ఆయనకు అధినాయకత్వంతో సరితూగే ఇమేజ్ ఉంది. అయితే బీహార్ ఎన్నికల రిజల్ట్ తర్వాత ఓటమిపై కాంగ్రెస్ పార్టీ సమీక్ష చేపట్టే ప్రయత్నం కూడా చేయకపోవడంపై ఈ నెల 15న ఓ ఇంటర్వ్యూలో ఆయన తప్పుబట్టారు. ‘బీహార్ అసెంబ్లీ, పలు రాష్ట్రాల బై ఎలక్షన్ల ఫలితాలు చూసిన తరువాత రోజు రోజుకి కాంగ్రెస్‌‌ పార్టీ బలహీనమవుతోందని క్లియర్ గా తెలుస్తోంది. గ్రౌండ్ లెవల్ లో అసలు పార్టీ ఉందా లేదా అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. బీహార్ లో ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నా.. ఓడిపోవడంపై పార్టీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది’ అని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కామెంట్ చేశారు. అయితే సిబల్​సహా కొందరు సీనియర్ల  కామెంట్లపై పార్టీ ఘాటుగా స్పందించింది. పార్టీని వ్యతిరేకించే వాళ్లు కావాలనుకుంటే.. వాళ్లకున్న బలం, తెలితేటలతో సొంత పార్టీ పెట్టుకోవచ్చంటూ కాంగ్రెస్​ లోక్​సభ పక్షనేత అధిర్​రంజన్ చౌదరి​ వ్యాఖ్యలు చేశారు. అయితే కపిల్ సిబల్ లాంటి సీనియర్ నాయకుడిపై పార్టీలోని కొందరు ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది.

సిబల్ ను తొక్కాలనుకుంటే పార్టీకే నష్టం..

కపిల్ సిబల్ ను రాహుల్ గాంధీ ఒక సామాన్య నేతగా చూడడం సరైంది కాదు. ఆ పార్టీకి సంబంధించిన లీగల్ ఇష్యూస్ అన్నీ ఆయనే డీల్ చేస్తుంటారు. సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాది. దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలకూ ఆయన సత్తా తెలుసు. వృత్తిపరంగా, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అనేది లేకున్నా ఆయన సర్వైవ్ అవ్వగలరు. ఢిల్లీ స్థాయిలో మంత్రాంగం నడపడంలో దిట్ట. ఆయనతో లొల్లి పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి అంత మంచిదేం కాదు. మనకు ఎవరిని శత్రువులుగా చేసుకుంటున్నామనే దానిపై ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.  ఎవరితో శత్రుత్వం పెంచుకోవాలి, ఎవరితో సఖ్యతగా మెలగాలి అన్న విషయంలో రాహుల్ గాంధీకి అంతగా అవగాహన ఉన్నట్టు కనిపించడం లేదు. అలా శత్రుత్వం పెంచుకోకూడని వ్యక్తుల్లో రాహుల్ కు కపిల్ చాలా కీలకమైన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీతో సమానమైన స్టేచర్ ఉన్న నాయకుడు కపిల్ సిబల్. ఆయన లాంటి సీనియర్ నేతను పార్టీలోని చిన్న చిన్న లీడర్లతో తిట్టిస్తే.. అది పార్టీకే దెబ్బ. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రోజు రోజుకీ చిన్న పార్టీల కంటే దారుణంగా పడిపోతున్న సమయంలో సిబల్ లాంటి వ్యక్తులు విమర్శిస్తే నేరుగా పిలిపించి.. వారి సూచనలపై చర్చించాల్సిన అవసరాన్ని రాహుల్, సోనియా గుర్తించాలి. లేదంటే పార్టీ మరింత క్షీణించినా ఆశ్చర్యం లేదు.

కోటరీలు కాదు.. మేధావులు అవసరం

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అరకొర జ్ఞానం ఉన్న కోటరీలతో నడిస్తే నిండా మునిగిపోతుంది. కానీ రాహుల్ గాంధీ పెద్దగా చదువు, సీనియారిటీ లేని హార్దిక్ పటేల్, డీకే శివకుమార్ లాంటి నేతలను తన పక్కన పెట్టుకునేందుకు ఇష్టపడుతున్నారు. పైగా ఆయన చుట్టూ ఉండే కోటరీ.. సీనియర్ కాంగ్రెస్ నేతలను లెక్క చేయడం లేదు. రాహుల్ చెవిలో జోరీగల్లా చేరి.. సీనియర్ నేతలకు ఆయన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని అధినాయకత్వం గుర్తించాలని సిబల్ లాంటి నేతలు హెచ్చరిస్తున్నారు. సీనియర్ లీడర్లు చెప్పే విషయాలను పక్కనపడేయకుండా పార్టీలో ఉన్న మేధావులతో ప్రత్యేక కమిటీలు వేసుకుని చర్చించాలని సూచిస్తున్నారు. బీహార్ లో జరిగిన పరాభవం లాంటి సీన్స్ మళ్లీ రిపీట్ కాకుండా చూసుకునేందుకు యాక్షన్ ప్లాన్ అవసరాన్ని గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ సీనియర్ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు రాహుల్ దగ్గర సమాధానం లేదు. పైగా పార్టీలో అస్తవ్యస్తమైన విధానాలపై సీనియర్లు ప్రశ్నిస్తే వాళ్లను మొత్తంగా కాంగ్రెస్ నుంచే బయటకు పంపాలన్న ధోరణి ఆయనలో కనిపిస్తోంది.

రాహుల్ లో చాణక్యత కావాలి

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చన్న మాటలను రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలి. ఆయన కాంగ్రెస్ కు భావి నాయకుడిగా పార్టీని నడిపించాలని కోరుకుంటే సరిపోదు.. దానికి అవసరమైన చాణక్యత ప్రదర్శించాలి. పార్టీలో సీనియర్లు, జూనియర్లు అందరినీ కలుపుకొని వెళ్లగలిగే డిప్లొమసీ ఉండాలి. కపిల్ సిబల్ లాంటి సీనియర్ నేతల సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్తే పార్టీకి, రాహుల్ కు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒక వేళ ఆయన వాళ్లను వదిలించుకుంటే.. బీజేపీ లాంటిపార్టీలకు మేలు చేసినట్లవుతుంది. అంతేకాదు.. పార్టీలో అసమ్మతిని సహించలేని నియంతృత్వ వాదిలా రాహుల్ గాంధీపై ముద్రపడుతుంది. రాహుల్ తరచూ మోడీని నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తుంటారు. ఆయన కోణంలోనే చూస్తే… ఫెయిల్యూర్ నియంత కంటే సమర్థవంతమైన నియంత మాత్రమే ఏ వ్యవస్థలోనైనా నిలబడతారని తెలుసుకోవాలి.