ట్విట్టర్ నుంచి మస్టడాన్ కు మారిపోతున్నరు!

ట్విట్టర్ నుంచి మస్టడాన్ కు మారిపోతున్నరు!

క్రిప్టో కరెన్సీ.. ఒక మిస్టరీ !!  దాని ఆది, అంతం ఎవరికీ తెలియదు !! దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారనే విషయం కూడా ఎవరికీ తెలియదు!! సరిగ్గా ఇటువంటి లక్షణాలతో ఒక సోషల్ మీడియా నెట్ వర్క్ పుట్టుకొచ్చింది. అదే ‘మస్టడాన్’!!  ఇదొక ఓపెన్ సోర్స్ సోషల్ నెట్ వర్క్. మస్టడాన్ 6 ఏళ్ల క్రితమే ఏర్పాటైనప్పటికీ.. గత కొన్నివారాల వ్యవధిలో దానికి అమాంతం క్రేజ్ పెరిగింది. ఓ వైపు సోషల్ మీడియా సైట్ ‘ట్విట్టర్’ ను అపర కుబేరుడు ఎలాన్ మస్క్ రూ.3.60 లక్షల కోట్లకు కొని తనదైన శైలిలో సంస్కరణలు చేస్తుండగా.. మరోవైపు ‘మస్టడాన్’ సోషల్ నెట్ వర్క్  వినియోగదారుల సంఖ్య రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. గత వారం రోజుల వ్యవధిలో మస్టడాన్ సోషల్ నెట్ వర్క్ కొత్తగా 2.30 లక్షల మంది వినియోగదారులను కూడగట్టుకోవడం విశేషం. దీంతో మస్టడాన్ మొత్తం యాక్టివ్ వినియోగదారుల సంఖ్య 6.55 లక్షలు దాటింది. దీని యూజర్స్ సంఖ్య ఇంత భారీ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ‘ట్విట్టర్’ లో ఉద్యోగ కోతలు మొదలైన ప్రస్తుత తరుణంలో.. ‘మస్టడాన్’ మస్త్ పర్ఫార్మెన్స్ తో దూసుకుపోతుండటం గమనార్హం.  అందుకే పలువురు టెక్ నిపుణులు మస్టడాన్ ను ట్విట్టర్ కు ప్రత్యామ్నాయ సోషల్ ప్లాట్ ఫామ్ గా  అభివర్ణిస్తున్నారు. రానున్న రోజుల్లోనూ ట్విట్టర్ నుంచి మస్టడాన్ లోకి వినియోగదారులు పెద్దఎత్తున మారిపోయే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. 

ఓ కాలేజీ స్టూడెంట్ వదిలిన బాణం ‘మస్టడాన్’  

మస్టడాన్ అనేది ఓపెన్ సోర్స్ సోషల్ నెట్ వర్క్. ఇది వికేంద్రీకృత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్. అంటే దీని ఓనర్ ఏ ఒక్క వ్యక్తో , సంస్థో కాదు. అంటే ఇది క్రిప్టో కరెన్సీ సైట్ల తరహా పనితీరును కలిగిన సోషల్ మీడియా నెట్ వర్క్. దీన్ని 2016 సంవత్సరంలో యూజెన్ రోచ్కో అనే జర్మన్ డెవలపర్ తయారు చేశాడు. అప్పుడు ఆయన వయసు 24 సంవత్సరాలు. కాలేజీ స్టూడెంట్ గా ఉన్నప్పుడే ఈ సోషల్ మీడియా సైట్ ను యూజెన్ రోచ్కో డిజైన్ చేశారు. మస్టడాన్ అంటే.. డైనోసార్ల యుగాని కంటే ముందు (13వేల ఏళ్ల క్రితం)ఉత్తర అమెరికా, మధ్య అమెరికా ప్రాంతాల్లో నివసించిన ఒక జంతువు. చూడటానికి ఏనుగులా పొడవాటి దంతాలతో, చర్మంపై వెంట్రుకలతో ఉండే ఈ జంతువు కాలక్రమంలో అంతరించిపోయింది. మస్టడాన్ అనే ఆ జంతు జాతి ఎంతో బలమైనదని చెబుతుంటారు. 

సెన్సార్ లేని స్వేచ్ఛకు కేరాఫ్

మస్టడాన్ సైట్ డెస్క్ టాప్ వర్షన్ లోకి వెళితే.. ‘‘ ఇది ప్రజల ద్వారా రూపొంది.. ప్రజల చేతిలో ఉన్న సోషల్ మీడియా. ఇప్పుడున్న సోషల్ మీడియాల కంటే పూర్తిగా భిన్నమైంది. ఇక్కడ మీ మనసులోని భావాలను స్వేచ్ఛగా చెప్పొచ్చు. మీరు ఏది చూడాలో.. ఏది చూడొద్దో సోషల్ మీడియా కంపెనీ నిర్ణయించదు. మీరే నిర్ణేతలు’’ అనే వెల్కమ్ నోట్ కనిపిస్తుంది.  మస్టడాన్ వేదికగా భావ ప్రకటన స్వేచ్ఛకు పెద్దపీట ఉంటుంది. ఎవరైనా ఏదైనా కామెంట్ చేయొచ్చు. దానిపై జోక్యం చేసుకోవడానికి మస్టడాన్ కు ఎటువంటి మేనేజ్మెంట్ ఉండదు. వినియోగదారులే దీనికి విధాతలు. 

చేదు అనుభవాలతో మార్పు దిశగా.. 

2021 సంవత్సరం ప్రారంభంలో ఫేస్ బుక్ తన వాట్సప్ వినియోగదారుల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసే అనుమతి పొందేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయితే ఆ ప్రతిపాదనకు అప్పట్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. వాట్సప్ ను బాయ్ కాట్ చేస్తామనే డిమాండ్ కూడా పలువురు నెటిజన్ల నుంచి వినిపించింది. దీంతో వాట్సప్ వెనక్కి తగ్గింది. 2021 అక్టోబరు 4న సర్వర్ల సమస్యతో ఫేస్ బుక్ స్తంభించింది. కొన్ని గంటల పాటు ఎఫ్ బీ తెరుచుకోలేదు. వాట్సప్, ఇన్ స్టాగ్రామ్ కూడా కొంతసేపు మొరాయించాయి. ఈ పరిణామంతో ఆ సమయంలో నెటిజన్లు ప్రత్యామ్నాయంగా టెలిగ్రామ్ వైపు మొగ్గు చూపారు.  ఆ ఒక్కవారంలోనే టెలిగ్రామ్ సోషల్ మీడియాకు ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మంది వినియోగదారులు వచ్చి చేరారు. అంటే.. మితిమీరిన అనుమతులు అడిగే, తరుచూ సాంకేతిక సమస్యలు ఎదురయ్యే , భావ ప్రకటన స్వేచ్ఛకు తావులేని సోషల్ మీడియా సైట్లపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని స్పష్టమవుతోంది.