ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

స్టేషన్​ఘన్ పూర్, వెలుగు: దళితబంధు, డబుల్ బెడ్​రూం ఇండ్లు తన చేతిలో ఉండవని స్థానిక ఎమ్మెల్యేనే సంప్రదించాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. సోమవారం జనగామ జిల్లా స్టేషన్ ​ఘన్​పూర్ శివారు ఇందిరానగర్ కాలనీలో ఆయన పర్యటించారు. టీఆర్ఎస్ జిల్లా నాయకులు గాండ్ల రాజు, సమ్మయ్య, చింత నాగరాజు ఆధ్వర్యంలో కాలనీవాసులు తమ సమస్యలు తెలియజేశారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కాలనీలోని ప్రైమరీ స్కూల్​లో కిచెన్ షెడ్, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్​నిర్మాణానికి రూ.20లక్షలు మంజూరు చేస్తామన్నారు. మూడు నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత చిల్పూరు మండలంలోని శ్రీపతిపల్లిలో పర్యటించారు. ఇటీవల నేషనల్ కాన్ఫరెన్స్ ​కు అటెండ్ అయిన సర్పంచ్ కేశిరెడ్డి ప్రత్యూష మనోజ్​ రెడ్డిని అభినందించారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సర్పంచ్​ను సత్కరించారు. గ్రామంలో డిజిటల్ లైబ్రరీ, కమ్యూనిటీ హాల్​కు కాంపౌండ్​వాల్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ ఎడవెల్లి క్రిష్ణారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పోగుల సారంగపాణి, మామిడాల లింగారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు నీల సోమన్న, రైస్​ మిల్లర్స్​ వెల్ఫేర్​ అసోసియేషన్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెలిదె వెంకన్న తదితరులున్నారు.

మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి

ములుగు, వెలుగు: ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోన్న చేప పిల్లలతో మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ యాదవ్ అన్నారు. సోమవారం ములుగు ఎంపీడీవో ఆఫీసులో జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ పిల్లి శ్రీపతి, మత్స్య సంఘం చైర్మన్​ సాధు రఘు ఆధ్వర్యంలో చేపల పంపిణీ ప్రోగ్రాం జరగగా.. చీఫ్ గెస్టుగా శ్రీదేవి హాజరై మాట్లాడారు. మండలంలో 56 చెరువులకు గాను 10.50లక్షల చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఇక్బాల్, ఎంపీవో హన్మంతరావు, మత్స్య సహకార సంఘం కార్యదర్శి కలాలి అనిల్, ఉపాధ్యక్షుడు బండి సదయ్య, డైరెక్టర్లు పాల్గొన్నారు. 

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రాయపర్తి, వెలుగు: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన ఎండీ రాహుల్(24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాహుల్ ఇంటర్ పూర్తి చేసి, గవర్నమెంట్ జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు. ఆదివారం ఓ పని నిమిత్తం వరంగల్​కు వెళ్లి సోమవారం తిరుగు ప్రయాణం అయ్యాడు. బొల్లికుంట శివారం వాగ్దేవి కాలేజీ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో స్పాట్​లో చనిపోయాడు. డెడ్ బాడీని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడం, గతేడాది రాహుల్ తండ్రి కూడా మృతి చెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. బాధిత కుటుంబాన్ని వరంగల్ ఎంజీఎంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు.

రామురావు కుటుంబానికి ఈటల పరామర్శ

హనుమకొండ సిటీ, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నేత, మాజీ మంత్రి తక్కెళ్లపల్లి పురుషోత్తంరావు కుటుంబాన్ని మాజీ మంత్రి, హుజురాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ దంపతులు పరామర్శించారు. పురుషోత్తంరావు కుమారుడు, తెలంగాణ జనవేదిక కన్వీనర్​ తక్కెళ్లపల్లి రామురావు(58) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఈటల దంపతులు సోమవారం మధ్యాహ్నం హనుమకొండ హంటర్​ రోడ్డులోని పురుషోత్తంరావు ఇంటికి చేరుకున్నారు. రాము చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మృతికి గల కారణాలను తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాము సేవలను కొనియాడి పురుషోత్తంరావుకు ధైర్యం చెప్పారు.  ఈటల వెంట బీజేపీ నాయకులు మార్తినేని ధర్మారావు, ఏనుగుల రాకేశ్​ రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్​ ​రావు, కన్నెబోయిన రాజయ్య, రావు అమరేందర్​ రెడ్డి తదితరులు ఉన్నారు.

గిరిజన సంక్షేమానికి పెద్దపీట

మరిపెడ, పర్వతగిరి, వెలుగు: గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మరిపెడ మండల టీఆర్ఎస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు అజ్మీరా రెడ్డి నాయక్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పించడం, హైదరాబాద్ నడిబొడ్డున బంజారా భవన్ నిర్మించడం, గిరిజన బంధు ప్రకటించడం పట్ల యావత్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మరిపెడ పట్టణ అధ్యక్షులు జాటోద్ బాలాజీ, పాండు నాయక్, బిల్లు నాయక్, భాస్కర్ నాయక్, శ్రీను నాయక్, బాలు నాయక్ తదితరులున్నారు. అలాగే వరంగల్  జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో BJకేసీఆర్​ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సింగులాల్, ఎంపీపీ కమల పంతులు, జడ్పీ కో ఆప్షన్ సర్వర్, ఎంపీటీసీ కోల మల్లయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు  రంగు కుమార్ ఉన్నారు.

బీజేపీలో నయా జోష్

మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల బీజేపీలో కొత్త జోష్ కనిపించింది. సోమవారం బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి చందుపట్ల కీర్తి సత్యపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా గోస– బీజేపీ భరోసా కార్యక్రమం నిర్వహించగా.. చీఫ్ గెస్టుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. మండలంలోని ఆరు గ్రామాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పర్యటన సాగించారు. కార్యక్రమంలో పార్టీ స్టేట్ లీడర్ చదువు రాంచంద్రారెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ మోరి రవీందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు శేషగిరి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రవీందర్, ఎంపీటీసీలు దొంగల రాజయ్య, గాజుల రజిత మల్లయ్య మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు జంబుల రజిత, లీడర్లు చందా సమ్మయ్య, మోరే వేణుగోపాల్ రెడ్డి, చింతకింది నాగరాజ్ తదితరులున్నారు.

మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన

ములుగు, వెలుగు: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.3వేల గౌరవ వేతనం ఇవ్వాలని సిబ్బంది డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం ములుగు జిల్లాకేంద్రంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ అనుబంధ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంపాల రవీందర్​మాట్లాడుతూ.. ఏండ్లుగా తక్కువ వేతనానికే పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. సర్కారు ఇచ్చే రూ.1000తో ఎలా బతుకుతారని ఆవేదన వ్యక్తం చేశారు. వంట బిల్లులు చెల్లించకున్నా.. బయట అప్పులు తెచ్చి, పిల్లలకు తిండి పెడుతున్నారని గుర్తు చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ ప్రటించిన రూ.3వేల వేతనం జీవోను వెంటనే రిలీజ్ చేయాలన్నారు. అలాగే కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

భద్రాచలం బీజేపీ కన్వీనర్ గా త్రినాథరావు

వెంకటాపురం, వెలుగు: భద్రాచలం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గా గులకోట త్రినాథరావు నియామకమయ్యారు. వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామానికి చెందిన త్రినాథరావు.. 35ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన నియామకం పట్ల వెంకటాపురం బీజేపీ మండలాధ్యక్షులు రఘురాం, జిల్లా నాయకులు ఉప్పల కృష్ణమూర్తి, ఎంపీపీ చెరుకూరి సతీశ్​హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా త్రినాథరావు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి తీరుతామన్నారు. తనకు పదవి అప్పగించిన కేంద్ర, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారమే బీజేపీ ఎజెండా

నెల్లికుదురు( కేసముద్రం), వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారమే బీజేపీ ఎజెండా అని మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు మోహన్ అన్నారు. ప్రజాగోస–బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా సోమవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ తో కలిసి ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రంలో బడులు, ఆసుపత్రులు లేవు కానీ గల్లీకో బెల్టు షాప్ మాత్రం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నా.. కావాలనే కేసీఆర్ కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రామచంద్రరావు, మండల అధ్యక్షుడు పొదిల నరసింహారెడ్డి, శోభన్ నాయక్, వెంకటరెడ్డి, వెంకట చారి తదితరులు పాల్గొన్నారు.

గులాబీ రంగు పురుగుపై అవగాహన

ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం జీల్గుల గ్రామంలో పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణపై ఏడీఏ దామోదర్ రెడ్డి రైతులకు అవగాహన కల్పించారు. పూత దశలోనే గులాబీ రంగు పురుగు ఉధృతి మొదలవుతుందని రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. దీని నివారణకు ఎకరానికి 4-6 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉధృతి ఎక్కువగా ఉంటే ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటిలో, క్లోరాంత్ర నిలిఫోల్ 0.3ఎంఎల్​ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. 30 మంది రైతులకు రాశీ సీడ్స్​ఆధ్వర్యంలో లింగాకర్షక బుట్టలు అందించారు. కార్యక్రమంలో రాశీ సీడ్స్ ప్రతినిధిలు రమణారెడ్డి, హరీశ్, ఏవో రాజ్ కుమార్, ఏఈవోలు రాజు, తిరుపతి, కల్యాణి, రోజ తదితరులున్నారు.