
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ అప్పట్లో భారీ ప్రాజెక్ట్. ఆ తరువాత ప్రకటించిన కొత్త భారీ ప్రాజెక్ట్ బనకచర్ల ఎత్తిపోతల పథకం. దశాబ్దాల నుంచి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగూతునే ఉన్నది. ఈ ప్రాజెక్ట్ రాజకీయాలలో ఒక అంశంగా, ఓట్లకు ఒక ఎరగా ఉపయోగపడుతూనే ఉన్నది. ప్రాజెక్టు వల్ల ఉపయోగం ప్రజలలో ఎవరికి, ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా, ఎంత వస్తుంది అనేది కట్టిన తరువాత తేలుతుంది. ప్రస్తుతం అయితే, నిర్మాణ సమయంలో కాంట్రాక్టర్లు, అధికారులు, రాజకీయ నాయకులకు దండిగా ఉపయోగపడుతుంది.
అధికారం కోసం ఉపయోగించే అనేక ఆయుధాలలో సాగు నీటి ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. సాగు నీటి ప్రాజెక్టులు రాజకీయాలకు కల్పతరువు. సాగునీటి ప్రాజెక్టుల వల్ల రాష్ట్ర ఖజానా మీద పడే భారం సాధారణంగా చర్చలోకి రాదు. ఎందుకంటే ఆదిలోనే అది రాజకీయాంశంగా మారుతున్నది. తెలుగు రాష్ట్రాలలో ఒక్కొక్క సాగునీటి ప్రాజెక్టు వల్ల కలిగే లాభ నష్టాలు, రిస్క్- బెనిఫిట్ విశ్లేషణకు అవకాశమే ఉండడం లేదు.
ఒక నదిలో పారే నీటిని ఏ విధంగా పంచుకుంటారు? గోదావరి, కృష్ణ నదుల మీద వేసిన ట్రిబ్యునళ్ళు ఏండ్లుగా చర్చించి నీటి వాటాలను నిర్ణయిస్తే వాటిని కూడా తోసిరాజని ఎవరికివాళ్ళు ఇష్టమొచ్చిన రీతిలో స్పందిస్తున్నారు. నదిలో పారే నీటిని లెక్కించినట్లు చెబుతున్నారు. నదిలో నీటిని కొలిచే సాధనాలు ఏవి? గణితం ఉపయోగించి నదిలో నీటి ప్రవాహాన్ని కొలిచే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏ పద్ధతి పాటించినా అందులో తప్పు (ఎర్రర్) శాతం 25 శాతం కంటే తక్కువే ఉండవచ్చు. రానురాను ప్రవాహం లెక్కలు ఆనకట్టల దగ్గర ఉన్న నిలువ బట్టి లేదా గేట్ల దగ్గర ప్రవాహం బట్టి చెబుతున్నారు.
ప్రవాహం లెక్కలు ఒక నది పరీవాహక ప్రాంతం మొత్తం లేదు. పరీవాహక ప్రాంతంలో వర్షం పడ్డ తరువాత ఆ నీరు క్రమంగా నదికి చేరి, అక్కడ నుంచి నది పొడవునా పారి చివరికి సముద్రంలో కలుస్తాయి. నదిలోకి నీరుని అనేక వాగులు, ఉపనదులు వస్తాయి. అంటే, నది పొడవునా నీటి ప్రవాహం ఒకే విధంగా ఉండదు. నది పొడవునా నీటి ప్రవాహం కొలిచే వ్యవస్థ కూడా లేదు. కేంద్ర జల సంఘం నదుల మీద సేకరించే నీటి ప్రవాహ సమాచారం పూర్తిగా, సమగ్రంగా లేదు. గోదావరి మీద సమాచార సేకరణ ఒక 50 పాయింట్ల నుంచి ఉంటే కృష్ణా నది మీద దాదాపు డజన్ ఉంటాయి. ఇందులో కొన్ని పాతవి, అనేకం కొత్తవి.
నీటివాటాలు నిర్ణయించడం కష్టసాధ్యం
గోదావరి, కృష్ణా బేసిన్లు రెండింటికీ సంబంధించి సాధారణంగా దీర్ఘకాలంగా నడుస్తున్న కేంద్ర జల సంఘం నిర్వహణలో ఉన్న ప్రధాన స్టేషన్లలో దాదాపు 50–60 సంవత్సరాల నదీ ప్రవాహ (గేజ్-డిశ్చార్జ్) రికార్డులు ఉంటాయి. కొత్త ఉపనది ప్రదేశాలలో 20–40 సంవత్సరాల సమాచారం మాత్రమే ఉంటుంది. భారత జల వనరుల వ్యవస్థలో సాధారణంగా విడుదల చేస్తున్న నీటి ప్రవాహ సమాచారం 1970 నుంచి ఉంటాయి, అయితే, కొన్ని విశ్లేషణలు 1960ల మధ్యకాలంనాటి డేటాను ఉపయోగిస్తాయి. వాస్తవానికి నిరంతర ప్రత్యక్ష డిశ్చార్జ్ కొలత కాకుండా ప్రవాహ కొలతలు ఎక్కువగా రిజర్వాయర్/ఆనకట్ట నీటి మట్టాలు, గేట్ ఓపెనింగ్ డేటాపై ఆధారపడి ఉంటుంది.
ముఖ్యంగా వరదలు లేదా ఆకస్మిక గేట్ ఆపరేషన్ల సమయంలో స్థూలంగా, నదిలో నీటి ప్రవాహాల లెక్కలు ఖచ్చితం కావు. అంచనాలు మాత్రమే. ఇటువంటి అంచనాల మీద ఆధారపడి నీటి వాటాలను పంచుకునే వ్యవస్థలో సూత్రాల ఆధారంగా పంపిణీ జరగాలి. బిందెలో పడ్డ నీటిని పంచుకున్నంత సులువుగా నదిలో నీటి వాటాలు రాష్ట్రాల మధ్య నిర్ణయించడం సాధ్యం కాదు. నదీ జలాల హక్కులు నిర్ణయించేటప్పుడు నది పరీవాహక ప్రాంతం బట్టి, అక్కడ పడే వర్షం బట్టి, నదిలో ప్రవాహం బట్టి నిర్ణయిస్తారు. అయితే, నది పరీవాహక ప్రాంతంలో పడ్డ వర్షం ఆసాంతం నదికి చేరదు. 20 నుంచి 40 శాతం మాత్రమే చేరవచ్చు. ఎంత చేరుతుంది అనేది ఆయా భౌగోళిక స్వరూపం బట్టి, ప్రకృతి బట్టి, పర్యావరణం బట్టి ఉంటుంది.
గోదావరిలో నీళ్ళు ఎక్కడివి?
గోదావరి నదిలో నీళ్ళు ఎక్కువగా చూసేది తెలుగు రాష్ట్రాల ప్రజలే. విశాలంగా, నిండుగా ప్రవహించే గోదావరి నదిలో నీళ్ళు అనేక ఉపనదుల కలయిక తరువాత ఒక మహా నదిగా మారుతుంది. నాసిక్‌లో పుట్టిన గోదావరిలో ఎక్కువ నీళ్ళు ఉండవు. తగ్గిపోతున్నవి. దానికి తోడు మహారాష్ట్రలో అనేక చిన్న, మధ్య తరహ ఆనకట్టలును మహారాష్ట్ర కట్టేసింది. దాదాపు రూ.60 వేల కోట్ల పెట్టుబడిపెట్టి కట్టిన తరువాత కూడా విదర్భ, మరాఠ్వాడ ప్రాంతంలో నీటి కరువు తీరలేదు. ప్రాణహిత (వార్ధా–వైన్‌గంగా–పెన్‌గంగా వ్యవస్థ కలిపి) ఇప్పటివరకు అతిపెద్ద గోదావరి ఉపనది. ఇంద్రావతి కూడా పెద్దది.
ప్రస్తుతం గోదావరిలో అధిక శాతం నీళ్ళు రెండునదులు ప్రాణహిత, ఇంద్రావతి ద్వారా వస్తున్నాయి. ఈ ప్రవాహాలు ఎంతకాలం ఈ స్థాయిలో ఉంటాయో చెప్పలేం. గోదావరి, కృష్ణా, కావేరి, తుంగభద్ర నదులలో నీళ్ళు తగ్గినట్టు ఈ రెండ నదులలో కూడా నీళ్ళు తగ్గే అవకాశం ఉన్నది. అదనంగా, ఇంద్రావతి మీద ఇప్పటికే 3 ప్రాజెక్టులు కట్టే యోచన చత్తీస్‌గఢ్ రాష్ట్రం ప్రకటించింది. ఆయా ప్రాజెక్టులు వస్తే గోదావరి నదిలో నీరు ఇంకా తగ్గవచ్చు.
ఆనకట్టలు వరదలను నివారిస్తున్నాయా?
ప్రతి సాగునీటి ప్రాజెక్టు, సాధారణంగా భారీ స్థాయిలో కడుతున్నప్పుడు, రెండు లక్ష్యాలు ప్రకటిస్తారు.. వరద నివారణ, నిరంతర నీటి లభ్యత. అయితే, అనేక కారణాల వల్ల ఈ రెండు లక్ష్యాలు సాధ్యం కావడం లేదు. పైగా, కట్టిన రిజర్వాయర్లు వరదలకు కారణం అవుతున్నాయి. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల తగ్గినా దిగువన ఉన్న ఉప- బేసిన్‌లలో భారీ వర్షపాతం వల్ల క్రింద ఉన్న రిజర్వాయర్‌లోకి ప్రవాహం పెరుగుతుంది. ఒక్కోసారి ప్రవాహాన్ని గణనీయంగా పెంచుతుంది. 2024లో పైన ఉన్న రిజర్వాయర్ నుంచి నీళ్ళు విడుదల చేయకపోయినా దిగువన పడిన వర్షపాతం వల్ల కృష్ణా నది నీటి ప్రవాహం పెరిగింది.
దిగువ ఆనకట్టల నుంచి నీటిని విడుదల చేయవలసి వచ్చింది. శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, పులిచింతల వంటి ప్రాజెక్టులన్నీ వరద నీటిని విడుదల చేయాల్సి వచ్చింది, లేకుంటే వాటికి ప్రమాదం ఏర్పడేది. ఎగువ ఆనకట్టల నుంచి ఆఖరి నిమిషంలో నీటి విడుదల కారణంగా వరదలు ఏర్పడడం దాని మీద వివాదాలు బ్రహ్మపుత్ర నది నుంచి కావేరి దాకా ఉండనే ఉన్నాయి. స్థానిక వర్షాలు కూడా నదిలో వరదలు సృష్టించవచ్చు. స్థానిక వర్షాల కారణంగా నదిలో దిగువన నీటి ప్రవాహాలు పెరిగితే, ఎగువన ఉన్న రాష్ట్రాలు ఎక్కువ నీటిని విడుదల చేయమని బలవంతం చేయకూడదని వాదిస్తున్నాయి.
అయితే, ఈ రకం వివాదాలు పరిష్కారం కావడానికి అవసరమయిన సమాచారం కేంద్ర జల సంఘం వద్ద ఉండడం లేదు. మన దేశంలో ఉన్న దాదాపు 400 నదులలో ఏ ఒక్క నది మొత్తం నిర్వహణ ఒక సంస్థ పరిధిలో లేదు. రాష్ట్రాల పరిధిలో ఉండే నది పరీవాహక ప్రాంతానికి ఒకే సంస్థ పని చేయడం లేదు. అరకొర సమాచారంతో నాయకులు తమ రాజకీయ క్రీడ కొనసాగించడం తప్పితే శాస్త్రీయ పద్ధతితో కూడిన యాజమాన్యం మీద దృష్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు.
- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్