
చలిలో వాకింగ్ చేస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్.. స్వెటర్లు కొనుక్కోవడం గురించి మాట్లాడుకున్నారు. వాకింగ్ పూర్తయి ఇంటికెళ్లాక మొబైల్లో ఏ యాప్ ఓపెన్ చేసినా స్వెటర్ల యాడ్సే కనిపిస్తున్నాయి. ‘అరె! ఇప్పుడే కదా స్వెటర్ల గురించి మాట్లాడుకుంది’ అనుకున్నారు ఆ ముగ్గురూ.
పర్సనల్ లోన్ కోసం ఒక బ్యాంకుకు అప్లై చేసుకున్నాడు -సురేష్. రోజు గడవకముందే వరుసగా ఫోన్ కాల్స్.. ‘మా బ్యాంకులో లోన్ తీసుకోండి. తక్కువ వడ్డీకే ఇప్పిస్తాం’ అంటూ. ‘వీళ్లందరికీ నా నెంబర్ ఎలా తెలిసిందబ్బా!’ అన్న ఆలోచనలో పడ్డాడు సురేష్.
అన్వేష్ బస్సులో ఆఫీసుకెళ్తాడు. దానికోసం రోజూ ఒక బస్టాండ్ దగ్గర వెయిట్ చేస్తాడు. అన్వేష్ మొబైల్‌లో ఎప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసినా క్యాబ్ బుకింగ్ అడ్వర్టైజ్‌మెంట్లే కనిపిస్తాయి. తను బస్సులో వెళ్తున్న సంగతి ఆయా కంపెనీలకు ఎలా తెలిసిందా? అని ఆశ్చర్యపోయాడు అన్వేష్.
ఇదంతా చూస్తుంటే ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు? అనే వివరాలు ఎవరో రహస్యంగా దగ్గర ఉండి మరీ గమనిస్తున్నట్టు ఉంది కదూ! నిజమే.. అలా గమనిస్తున్నది మరెవరో కాదు, జేబులో ఉండే ఫోనే. స్మార్ట్‌ఫోన్ మన పర్సనల్ విషయాలను అంతే స్మార్ట్‌గా గమనిస్తుందన్న విషయం చాలామందికి తెలియదు. ప్రపంచం డిజిటల్‌గా మారిన ఈ రోజుల్లో ‘ఇది నా పర్సనల్’ అని చెప్పుకోడానికి ఏమీ మిగల్లేదు. అన్ని వివరాలు అంగట్లో సరుకుల్లా మారిపోయాయి. దీన్ని అడ్డుకునేందుకే ప్రైవసీ పాలసీలు పుట్టుకొచ్చాయి. ప్రైవసీ చట్టాలూ తయారయ్యాయి. అసలు ప్రైవసీ అంటే ఏంటి? అది ఎందుకు ముఖ్యం? దాన్నెలా కాపాడుకోవాలి? అనే విషయాలు ఈ వారం కవర్ స్టోరీలో..
‘ఈ కాలపు దొంగకి నీ ఇంటి తాళాలు అక్కర్లేదు.. నీ గురించి చిన్న సమాచారం చాలు. ఇది ఇన్‌ఫర్మేషన్ ఏజ్.. ఇక్కడ ఒక్కో ఇన్‌ఫర్మేషన్‌కు ఒక్కో రేటుంది’ అని విశాల్ ‘అభిమన్యుడు’ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. వ్యక్తుల పర్సనల్ డేటాతో పెద్ద పెద్ద స్కామ్‌లు జరుగుతున్నాయి. బయటకు కనిపించే ప్రపంచంలో సేఫ్‌గా ఎలా ఉండాలో అందరికీ తెలుసు. కానీ, కంటికి కనిపించని డిజిటల్ వరల్డ్‌లో సేఫ్‌గా ఎలా ఉండాలో చాలామందికి తెలియదు. అందుకే టెన్త్ క్లాస్ పరీక్షలు పూర్తవ్వకముందే కాలేజీల నుంచి ఫోన్లు, ప్రెగ్నెన్సీ వచ్చీరాగానే హస్పిటళ్ల నుంచి ఆఫర్లు.. ఇలా పిల్లల వివరాల నుంచి ఉద్యోగుల లావాదేవీల వరకూ ప్రతి ఒక్కరి ప్రొఫైల్స్, ఫొటోలు, ఫోన్ నెంబర్లు, అడ్రెస్‌లు, ఫ్యామిలీ వివరాలు, ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసే టాపిక్స్, ఆఖరికి పేషెంట్ల మెడికల్ హిస్టరీ కూడా ఇప్పుడు సేఫ్‌గా ఉండడం లేదు. ఎంతో సున్నితమైన పర్సనల్ విషయాలు ఆన్‌లైన్‌లో ఓపెన్‌గా అందుబాటులో ఉంటున్నాయి. ఇది మరింత పెరిగి ఆధార్ వివరాలు, వేలి ముద్రలు లీక్ అయ్యే వరకూ వెళ్లింది. అందుకే ఇప్పుడు ప్రైవసీని కాపాడుకోవడం అత్యంత ముఖ్యం అయింది. ప్రైవసీని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉన్నా.. అదెలా? అన్నది చాలామందికి తెలియకపోవడమే ఇప్పుడు సమస్య. అందుకే ప్రభుత్వాలు, ఇతర సంస్థలు డిజిటల్ లిటరసీపై అవేర్‌నెస్ తీసుకొస్తున్నాయి. డిజిటల్ లిటరసీ పెరిగితే ప్రైవసీ అంటే ఏంటో అర్థం అవుతుంది. ఈ వర్చువల్ వరల్డ్‌లో సేఫ్‌గా ఎలా ఉండాలో తెలుస్తుంది.
పెద్ద ఇష్యూ ఇదే..
“అతి పెద్ద సోషల్ మీడియా సంస్థ అయిన ఫేస్‌బుక్ ఎలాంటి కంటెంట్ తయారుచేయదు. అతి పెద్ద ట్యాక్సీ కంపెనీ ఊబర్‌కి సొంతంగా ఒక్క వాహనం కూడా లేదు. రిటైలర్ సంస్థ అలీబాబా దగ్గర వస్తువులేమీ లేవు. టూరింగ్ వసతులు అందించే ఎయిర్‌బీఎన్‌బీకి ఎటువంటి హోటల్స్ లేవు. కానీ, మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నామో ఊబర్‌కి తెలుసు. మన స్నేహితులెవరు? ఇష్టాలేంటి? అనేది ఫేస్‌బుక్‌కి తెలుసు. మన షాపింగ్ అలవాట్లు ఏమిటనేది అలీబాబాకు తెలుసు. మనం ఎక్కడికి ప్రయాణం చేస్తున్నామనేది ఎయిర్‌బీఎన్‌బీకి తెలుసు” అని 2017లో సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. అంటే యూజర్ల పర్సనల్ డేటా ఆధారంగానే ఈ వ్యాపారాలన్నీ నడుస్తున్నాయన్నది సుప్రీంకోర్టు ఉద్దేశం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రైవసీ అనేది ప్రస్తుతం ఎంత పెద్ద ఇష్యూనో. అంతెందుకు.. రీసెంట్‌గా జరిగిన పేపర్ లీక్ ఇష్యూ కూడా డేటా బ్రీచ్ కిందకే వస్తుంది. సరైన ప్రైవసీ సేఫ్టీని పాటించకపోవడం వల్లనే ఇలాంటి మిస్టేక్స్ జరుగుతుంటాయి. కీలకమైన డేటా వేరొకరి చేతుల్లోకి వెళ్లిపోతుంటుంది.
డేటా ప్రైవసీ అంటే..
ఎలాంటి సమాచారాన్నైనా ‘డేటా’ అని అనొచ్చు. మాటల నుంచి పాటల వరకూ, ఫోన్ నెంబర్స్ నుంచి రేడియో సిగ్నల్స్ వరకూ.. టెక్స్ట్, ఆడియో, వీడియో.. ఇలా ఎలాంటి సమాచారమైనా డేటానే. అయితే ఈ డేటా రకరకాల రూపాల్లో ఉంటుంది. పుస్తకాలు, ప్రభుత్వ రికార్డుల్లో ఉండే డేటా ఫిజికల్ డేటా కిందకు వస్తే ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే డేటా డిజిటల్ డేటా కిందకు వస్తుంది. అంటే సోషల్ మీడియాలో ఉండే డీటెయిల్స్, ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్స్ లిస్ట్, మెయిల్స్, యాప్స్‌లో ఉండే బ్యాంకింగ్ వివరాలు.. ఇవన్నీ ‘డిజిటల్ డేటా’ కిందకే వస్తాయన్న మాట.
ఇక ప్రైవసీ విషయానికొస్తే.. పర్సనల్ విషయాలు అందరికీ తెలిసేలా పబ్లిక్‌గా ఉంచాలనుకోరు ఎవరూ. సొంత విషయాలను రహస్యంగానే ఉంచుకోవాలనుకుంటారు. ఒకవేళ షేర్ చేయాలనుకున్నా.. ఎవరికి చేయాలి అనేది వాళ్ల ఇష్టం. ప్రైవసీ అంటే ఇదే. ఎవరి పర్సనల్ విషయాలపై వాళ్లకు మాత్రమే హక్కు ఉండడం. పర్మిషన్ లేకుండా ఒకరి వివరాలు మరొకరికి షేర్ చేసినా, వివరాలు దొంగిలించినా అది ప్రైవసీని దెబ్బ తీసినట్టు అవుతుంది. ‘నాక్కొంచెం ప్రైవసీ కావాలి’ అంటుంటారు చాలామంది. అంటే ఆ సందర్భంలో ఇతరుల ప్రమేయం, వాళ్ల జోక్యం ఉండొద్దని దానర్థం. డిజిటల్ ప్రైవసీ కూడా ఇలాంటిదే. ఆన్‌లైన్‌లో ఉండే పర్సనల్ డేటాపై ఆయా యూజర్లకు మాత్రమే పూర్తి హక్కు ఉంటుంది. వాళ్ల పర్మిషన్ లేకుండా ఎవరూ వాటిని యాక్సెస్ చేయకూడదు. ఒకరి వ్యక్తిగత వివరాలు అందరికీ తెలిస్తే దానివల్ల చాలా ఇబ్బందులుంటాయి.
ప్రైవసీ ఎందుకంటే..
స్మార్ట్ ఫోన్ జీవితంలో భాగమయ్యాక ప్రతీ విషయానికి దానిపైనే ఆధారపడాల్సి వస్తోంది. ముఖ్యమైన డేటా అంతా మొబైల్‌లో సేవ్ చేయక తప్పట్లేదు. బ్యాంక్ వివరాలు అందులోనే సేవ్ చేయాలి. కాంటాక్ట్స్ లిస్ట్ అందులోనే దాచాలి. ఉద్యోగానికి సంబంధించి ముఖ్యమైన మెయిల్స్ కూడా అందులోనే ఉంటాయి. అయితే మొబైల్.. ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యి పనిచేయడం వల్ల ఆ డేటా అంతా పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నట్టే. కాబట్టి ఎవరి డేటాను వాళ్లు సేఫ్‌గా ఉంచుకోవడం ముఖ్యం.
సోషల్ మీడియా పోస్టులు, విజిట్ చేసిన వెబ్‌సైట్లు, ఐపీ అడ్రస్, కీ వర్డ్ సెర్చ్, బ్రౌజర్లలోని కుకీలు, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌లు, మొబైల్ ఫోన్లలో రికార్డ్ అయ్యే లొకేషన్ వివరాలు.. ఇలా పలు యాక్టివిటీస్‌ను ట్రాక్ చేయడం ద్వారా ఆ వ్యక్తి అలవాట్లు, ఇష్టాలు, ఆలోచనా తీరు, లైఫ్‌స్టైల్, ఆదాయం, ఖర్చులు వంటి వివరాలన్నీ అంచనా వేయొచ్చు. మొబైల్ ఫోన్స్, యాప్స్ చేస్తున్న పని ఇదే. అయితే.. ఈ డేటాను తమ నుంచి సేకరిస్తున్నారన్న విషయం చాలామందికి తెలియదు. ఈ సమాచారాన్ని ఎవరు తీసుకుంటున్నారు? దేనికి ఉపయోగిస్తున్నారు? ఎందుకు ఉపయోగిస్తున్నారు? అనే విషయాలు అసలే తెలియదు. వ్యక్తుల డేటాను దొంగిలించే వాళ్లు ఆ డేటాతో ఏమైనా చేయొచ్చు. పర్సనల్ వివరాలను అడ్వర్టైజింగ్ కంపెనీలకు అమ్మొచ్చు. లేదా హ్యాకర్ల సాయంతో బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించి డబ్బు కాజేయొచ్చు. కాబట్టి పర్సనల్ ప్రైవసీ అనేది ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఎంతో ముఖ్యం.
డేటా చోరీతో..
వెబ్‌సైట్స్‌లో యూజర్లు సెర్చ్ చేసే విషయాలు, షాపింగ్ చేసే వస్తువులు ఇలా ప్రతి యాక్టివిటీని ట్రాక్ చేయడం ద్వారా ముందుగా లాభపడేది అడ్వర్టైజ్‌మెంట్ కంపెనీలు. ఆన్‌లైన్ యాక్టివిటీస్‌ను ట్రాక్ చేయడం ద్వారా ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. అప్పుడు అడ్వర్టైజ్‌మెంట్ కంపెనీల పని తేలికవుతుంది. టార్గెట్ కస్టమర్స్ ఎవరో ఈజీగా తెలిసిపోతుంది. అవసరం ఉన్నవాళ్లకు మాత్రమే అడ్వర్టైజ్‌మెంట్లు పంపే వీలుంటుంది. దాంతో వాళ్ల సేల్స్ పెరుగుతాయి. అయితే ఇది ఇక్కడితో ఆగదు. అడ్వర్టైజ్‌మెంట్ కంపెనీలకు చేరిన యూజర్ల డేటా అక్కడి నుంచి మరొక కంపెనీకి చేరుతుంది. వాళ్లు ఉపయోగించుకున్నాక మరొకరికి. అలా ఒకరి పర్సనల్ డేటా ప్రపంచమంతా తిరుగుతుంది. ఉదాహరణకు ఒక మహిళ ప్రెగ్నెంట్ అని పసిగట్టిన గూగుల్.. ఆ విషయాన్ని మెటర్నిటీ హాస్పిటల్స్‌కు చేరవేస్తుంది. వాళ్లు యాడ్స్ పంపిన తర్వాత ఆ డేటాను పిల్లల ప్రొడక్ట్స్ వాళ్లకు అమ్మేస్తారు. ఆ తర్వాత ఆ డేటా ప్రి–స్కూల్ వాళ్లకు చేరుతుంది. ఇలా డేటాతో పెద్ద మైనింగ్ జరుగుతుంది.
సైబర్ స్కామ్స్
అడ్వర్టైజ్‌మెంట్ల సంగతి అటుంచితే పెద్ద పెద్ద సైబర్ స్కామ్‌లకు కూడా ఈ డేటానే కీలకం. ఒక్కోసారి ఆధార్, వేలి ముద్రల డేటా దేశాలు మారి వెళ్తుంటుంది. ఆ డేటాతో ఇతర దేశాలు ఏం చేస్తాయో ఎవరికీ తెలియదు. చైనీస్ మొబైల్ బ్రాండ్స్ యూజర్ల పర్సనల్ డేటాను తమదేశానికి దొంగతనంగా పంపిస్తున్నాయని రీసెంట్‌గా వార్తలొచ్చాయి. అలాగే లక్షల కొద్దీ ఆధార్ వివరాలను హ్యాక్ చేసి రూ. 500 కే అమ్మేస్తున్నారని గతంలో కొన్ని కథనాలొచ్చాయి. డేటాలో అంత విలువైంది ఏముంది అనుకోవచ్చు. అయితే రకరకాల సైబర్ నేరాలకు, మోసాలకు ఈ డేటానే ఆధారం. సైబర్ నేరగాళ్లు డేటాను కేటగిరీలుగా డివైడ్ చేసి రకరకాల స్కామ్‌లు ప్లాన్ చేస్తుంటారు. ఉదాహరణకు లోన్ కోసం వెతికే యూజర్లను లిస్ట్ చేసి వాళ్లకు ‘మీకు లోన్ అప్రూవ్ అయింది’ అని లింక్‌లు పంపిస్తారు. తెలిసో తెలియకో ఆ లింక్‌లు క్లిక్ చేస్తే వాటి ద్వారా ఫోన్‌లోకి మాల్వేర్ పంపి బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలిస్తారు. అలాగే ఎక్కువగా షాపింగ్ చేసే వాళ్లకు డిస్కౌంట్స్ పేరుతో లింక్‌లు పంపిస్తారు. ఉద్యోగం కోసం వెతికేవాళ్లకు ‘విదేశాల్లో జాబ్ ఆఫర్’ అంటూ మోసం చేసి డబ్బు కాజేస్తారు. ఇలా రోజూ వందల కొద్దీ సైబర్ స్కామ్స్ జరుగుతుంటాయి. ఇలాంటి సైబర్ స్కామ్స్ అన్నింటికీ డేటానే మూలం. డేటా లీక్ అవ్వకుండా ఎవరి డేటాను వాళ్లు సేఫ్‌గా ఉంచుకుంటే సైబర్ మోసాలు జరిగే ఛాన్సే లేదు. డేటా లేకుండా సైబర్ నేరగాళ్లు ఎలాంటి స్కామ్స్ చేయలేరు.
యాప్స్‌తో జాగ్రత్త
ప్రైవసీ ఇబ్బందులు ఫోన్‌తో కాదు, అందులో ఉండే యాప్స్‌తో వస్తాయి. మొబైల్ వాడడం అంటే అందులో ఉండే యాప్స్ వాడడమే కదా! మొబైల్‌లో సోషల్ మీడియా, ఇ–కామర్స్, పేమెంట్స్, హెల్త్ ట్రాకింగ్, స్టాక్‌మార్కెట్, డేటింగ్.. ఇలా రకరకాల యాప్స్ ఉంటాయి. యాప్స్ వాడే విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రైవసీ సేఫ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో 4.2 కోట్ల మొబైల్ యాప్‌లు ఉంటే అందులో కేవలం నాలుగైదు శాతం మాత్రమే సేఫ్ యాప్స్ అని గూగుల్ చెప్తోంది. అందుకే యాప్స్ వాడే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.
యాప్ ఇన్‍స్టాల్ చేసేటప్పుడు ఏయే పర్మిషన్లు అడుగుతుంది? థర్డ్ పార్టీ కంపెనీలకు డేటా పంపించే అవకాశాలు ఉన్నట్టు యాప్ వివరాల్లో ఎక్కడన్నా ఉందా? అన్నది ప్రైవసీ పాలసీలో చదవాలి. అలాగే యాప్‌లో లాగిన్ రూల్స్ ఎంత పకడ్బందీగా ఉన్నాయి. పాస్‍వర్డ్ తేలికగా ఉన్నా ఒప్పుకుంటుందా? బలమైన పాస్‌వర్డ్ సెట్ చేసుకోమంటుందా? అన్నది చెక్ చేయాలి.
ఏదైనా కొత్త యాప్ డౌన్‌లోడ్ చేసేముందు.. దాన్ని ఎవరు డెవలప్ చేశారు? ఎంతమంది డౌన్‌లోడ్ చేసుకున్నారు? అనే విషయాలు గమనించాలి. యూజర్లు చేసిన కామెంట్స్ చూస్తే మంచీ చెడూ తెలుస్తాయి. లక్షలు, కోట్లలో డౌన్‌లోడ్‌లు కనిపిస్తే, దాన్ని కొంత నమ్మొచ్చు. వెయ్యి, రెండు వేల డౌన్‌లోడ్స్ మాత్రమే ఉంటే అనుమానించాల్సిందే.
ఒకే రకమైన పేరుతో రెండు మూడు యాప్స్ కనిపిస్తే ప్లే స్టోర్ నుంచి కాకుండా ఒరిజినల్ వెబ్‌సైట్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం మేలు.యాప్స్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతాయి. అవసరం లేకపోయినా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు అనుమానం వస్తే ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయకపోవడమే మంచిది.మరికొన్ని యాప్‌లు కొన్ని పర్మిషన్స్ ఇస్తే గానీ ఇన్‌స్టాల్ కావు. అలాంటప్పుడు పర్మిషన్స్ ఇచ్చి యాప్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘పర్మిషన్స్’ ను డిజేబుల్ చేయాలి.మొబైల్ ఫోన్‌లో మంచి యాంటీ- వైరస్ సాఫ్ట్‌వేర్ ఉంటే అది కొంత సేఫ్టీ ఇవ్వగలదు. ‘సైబర్ స్వచ్ఛ కేంద్ర’ అనే ప్రభుత్వ వెబ్‌సైట్ నుంచి ఉచిత యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్‌లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
స్టాక్‌మార్కెట్‌లో ట్రేడింగ్ చేసేవాళ్లు సెబీ అనుమతి పొందిన ట్రస్టెడ్ యాప్స్ మాత్రమే ఎంచుకోవాలి. థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా స్టాక్ బ్రోకింగ్ మంచిది కాదు.కొవిడ్ తర్వాత ‘టెలి మెడిసిన్’ ట్రెండ్ పెరిగింది. రకరకాల హెల్త్ యాప్‌లు పుట్టుకొచ్చాయి. ఇవి పేషెంట్ల మెడికల్ హిస్టరీని డేటాబేస్‌లో సేవ్ చేసుకుంటాయి. ఆ డేటాను యాప్స్ ఎవరెవరికి ఇస్తాయో తెలిసే అవకాశం లేదు. కాబట్టి వీలైనంత వరకూ మంచి రివ్యూలు, రేటింగ్ ఉన్న యాప్స్ ఎంచుకోవడం మంచిది. అలాగే ప్రైవసీ పాలసీ చదవడం కూడా ముఖ్యమే.
ప్రైవసీ చట్టాలు
పర్సనల్ డేటా ప్రొటెక్షన్, ప్రైవసీకి సంబంధించి ఇతర దేశాల్లో కట్టుదిట్టమైన చట్టాలున్నాయి. మనదేశంలో కూడా అలాంటి చట్టాలను తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘పర్సనల్ ప్రైవసీ అనేది పౌరుల ప్రాధమిక హక్కు’ అని 2017లో సుప్రీంకోర్టు చెప్పింది. అప్పటినుంచి ప్రైవసీకి సంబంధించి పూర్తి స్థాయిలో చట్టం కోసం ప్రభుత్వం గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంది. త్వరలోనే మనదేశంలో కొత్త డేటా ప్రైవసీ బిల్లు రాబోతుంది. ఈ కొత్త బిల్లులో భాగంగా ప్రభుత్వం ఓ ‘డేటా ప్రొటెక్షన్ బోర్డ్’ ని మొదలుపెట్టనుంది. ఈ బోర్డ్ ప్రైవసీ కంప్లెయింట్స్‌ను పరిష్కరిస్తుంది. అలాగే కొత్త బిల్లు ప్రకారం యూజర్ల డేటాను సర్వర్లలో ఎక్కువకాలం స్టోర్ చేయకూడదు. తమ దగ్గరకు వచ్చే డేటాను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి సోషల్ మీడియా కంపెనీకి, ఇతర సంస్థలకు ఉంటుంది. అలా చేయకపోతే ప్రభుత్వం పెనాల్టీ వేస్తుంది. అలాగే కంపెనీలు డేటాను ప్రాసెస్ చేయడం కోసం ఒక డేటా ఆడిటర్‌ని నియమించుకోవాలి. ఆ ఆడిటర్ యూజర్ల ప్రైవసీ దెబ్బతినకుండా డేటాను రివ్యూ చేయాలి. పిల్లల డేటాపై కూడా ఈ బిల్లులో స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. పిల్లలకు హాని కలిగించేలా వారి డేటాను ఎక్కడా వాడకూడదు. వారిని టార్గెట్ చేస్తూ ఎక్కడా అడ్వర్టైజింగ్ చేయకూడదు. పిల్లల పర్సనల్ డేటాను ప్రాసెస్ చేయడానికి తల్లిదండ్రుల పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి. 18 ఏళ్ల లోపు పిల్లలు వారానికి కొన్ని గంటలకు మించి ఆడే వీల్లేకుండా కొత్త రూల్ రావొచ్చు. క్యాసినో లాంటి ఆన్‌లైన్ బెట్టింగ్ ఆటల్లోనూ పిల్లలకు ఏజ్ లిమిట్ పెట్టొచ్చు.
పర్సనల్ విషయాలను సేకరించడం, ఉపయోగించడం, బయటపెట్టడానికి ముందు సంబంధిత వ్యక్తి నుంచి లెటర్ ద్వారా కానీ, ఫ్యాక్స్ ద్వారా కానీ, ఇ–మెయిల్ ద్వారా కానీ అప్రూవల్ తీసుకోవాలి. సున్నితమైన పర్సనల్ విషయాలను కేవలం చట్టబద్ధమైన అవసరాలకు మాత్రమే సేకరించాలి.
సమాచారాన్ని సేకరిస్తున్న విషయం, అలాగే ఎందుకు సేకరిస్తున్నారు? అన్న విషయం, ఆ సమాచారం ఎవరికి చేరుతుంది? ఆయా సంస్థల పేర్లు, అడ్రెస్ , ఇతర వివరాలన్నీ సంబంధిత వ్యక్తికి తెలిసేలా చూడాలి. ఇలా సేకరించిన సమాచారాన్ని ముందుగా చెప్పిన అవసరాలకు మాత్రమే వాడాలి.
ఒకరి దగ్గర్నుంచి సేకరించిన సమాచారానికి తగిన భద్రత కల్పించాలి. ఈ సమాచారాన్ని సేకరించిన సంస్థలు వాటిని థర్డ్ పార్టీకి ఇవ్వడం కుదరదు. అలా చేయాలంటే సంబంధిత వ్యక్తి నుంచి అప్రూవల్ తీసుకోవాలి.
జాగ్రత్తలు ఇలా..
- ప్రైవసీ సేఫ్‌గా ఉండాలంటే సోషల్ మీడియా నుంచి పేమెంట్ యాప్స్ వరకూ అన్నింటికీ స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టుకోవాలి. అలాగే ప్రతి మూడు నెలలకోసారి పాస్‌వర్డ్‌లను మార్చడం మంచిది. పాస్‌వర్డ్‌తో పాటుగా ఫింగర్ ప్రింట్ లాక్ కూడా ఎనేబుల్ చేసుకుంటే డేటా మరింత సేఫ్‌గా ఉంటుంది.
- పర్సనల్‌గా వాడుకునే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో షేర్ చేసుకోకూడదు. అలాగే కంప్యూటర్‌లను ఎవరికీ రిమోట్ యాక్సెస్‌కు ఇవ్వకూడదు. సందర్భాన్ని బట్టి ఎవరికైనా సోషల్ మీడియా పాస్‌వర్డ్స్ చెప్తే వెంటనే మార్చుకోవాలి.
- కొన్ని పబ్లిక్ ప్లేసుల్లో ఉచిత వై-ఫై ఉంటుంది. బ్యాంకింగ్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్‌లకు ఇలాంటి పబ్లిక్ వై-ఫైని ఉపయోగించకపోవడమే మంచిది. ఈ ఓపెన్ నెట్‌వర్క్‌లు సైబర్ దాడులకు గురయ్యే అవకాశాలు ఎక్కువ.
- నెట్‌బ్యాంకింగ్ పాస్‌వర్డ్ మార్చినట్లు ఎస్సెమ్మెస్, ఇ–మెయిల్ వస్తే వెంటనే స్పందించాలి. బ్యాంకుకు ఆ విషయాన్ని చెప్పాలి. వెంటనే అకౌంట్ లేదా కార్డులను బ్లాక్ చేయమని కోరాలి.
- ఇన్సూరెన్స్ పాలసీపై బోనస్ వచ్చిందని, వడ్డీలేని రుణాలు ఇస్తామని రకరకాల ఫోన్‌కాల్స్ వస్తుంటాయి. వాళ్లు మనకు సంబంధించిన కొన్ని వివరాలను ముందే చెప్తారు. దీంతో వాళ్లు నిజంగా బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్లు అనుకుంటారు చాలామంది. అలా నమ్మితే వారి వలలో పడినట్టే.
- ఎగ్జిబిషన్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్‌లో గిఫ్ట్‌కూపన్లు, లక్కీడిప్స్, వోచర్స్‌కు సంబంధించిన కాగితాల్లో సెల్‌ఫోన్ నంబర్, ఇ–మెయిల్ ఐడీలు రాయకూడదు.
- ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేసేటప్పుడు.. ‘హెచ్‌టీటీపీఎస్’లతో మొదలయ్యే వెబ్‌సైట్‌లను మాత్రమే ఓపెన్ చేయాలి.
- సినిమాలు, వీడియోలు, ఆడియోలు డౌన్‌లోడ్ చేసేటప్పుడు లైసెన్స్ ఉన్న యాప్‌లను మాత్రమే ఉపయోగించాలి.
- అడల్ట్ వెబ్‌సైట్స్, బెట్టింగ్ సైట్స్, డేటింగ్ సైట్ల జోలికి వెళ్లకూడదు.
- టీనేజ్ పిల్లలు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్టయితే వాళ్లు ఏమేం పనులు చేస్తున్నారో పేరెంట్స్ గమనించడం మంచిది.
- ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు ప్రైవసీ పాలసీ కచ్చితంగా చదవాలి.
- సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, మెసేజ్‌లు, కామెంట్లు ఇతరులకు ఇబ్బంది కలిగించేలా, అగౌరవపరిచేలా ఉండకూడదు.
- ఇలాంటి సేఫ్టీ టిప్స్ పాటిస్తే.. మన ప్రైవసీ మన చేతుల్లో ఉంటుంది. సైబర్ క్రైమ్స్‌కు అవకాశం ఉండదు. ప్రైవసీకి సంబంధించిన విషయాలను పిల్లలకు, ఫ్రెండ్స్‌కు కూడా తెలియజేస్తే.. వాళ్లూ ఆన్‌లైన్‌లో సేఫ్‌గా ఉండే వీలుంటుంది.
వాట్సాప్‌లో ఇలా..
రోజూ వాడే వాట్సాప్‌లో ప్రైవసీ సేఫ్‌గా ఉండాలంటే సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు అవసరం. ముందుగా అడక్కుండా వాట్సాప్ గ్రూప్స్‌లోకి యాడ్ చేయడాన్ని ఆపడం కోసం ‘సెట్టింగ్స్’లో ప్రైవసీ లోకి వెళ్లి ‘గ్రూప్స్’లో ‘ఎవ్రీవన్’ కాకుండా ‘మై కాంటాక్ట్స్’ సెలక్ట్ చేసుకోవాలి. అప్పుడు పర్మిషన్ తీసుకోకుండా మిమ్మల్ని గ్రూప్స్‌లోకి యాడ్ చేయడం కుదరదు.
మనసులోని ఫీలింగ్స్, ఫ్రస్ట్రేషన్‌ను వాట్సాప్ స్టేటస్‌లుగా పెడుతుంటారు కొంతమంది. అయితే వాటిని అందరూ చూడొద్దు అనుకుంటే.. సెట్టింగ్స్‌కి వెళ్లి, ప్రైవసీలో ‘స్టేటస్’ ఆప్షన్ దగ్గర ‘మై కాంటాక్ట్స్’ క్లిక్ చేస్తే.. కాంటాక్ట్స్ అందరికీ స్టేటస్ కనిపిస్తుంది. ‘ఓన్లీ షేర్ విత్’ ఎంచుకుంటే సెలక్ట్ చేసుకున్న కొంతమందికే కనిపిస్తుంది. ‘మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్’ ఆప్షన్ ఎంచుకుంటే... ఎంచుకున్నవారు కాకుండా మిగిలిన కాంటాక్ట్స్ అందరికీ స్టేటస్ కనిపిస్తుంది. అలాగే ప్రొఫైల్ ఫొటో ఆప్షన్‌కు వెళ్లి డిస్‌ప్లే ఫొటో కూడా ఎవరూ చూడకుండా పెట్టుకోవచ్చు.
వాట్సాప్ యాప్‌ను వేరేవాళ్లు ఓపెన్ చేయకూడదు అనుకుంటే యాప్‌కు ఫింగర్‌ప్రింట్ లాక్ పెట్టుకోవచ్చు. దీనికోసం వాట్సాప్ సెట్టింగ్స్‌కి వెళ్లి ప్రైవసీ ఆప్షన్‌లో ‘ఫింగర్ ప్రింట్ లాక్’ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే మెసేజ్ చూసినట్టు అవతలి వ్యక్తులకు తెలియకూ డదంటే బ్లూ టిక్స్ ఆఫ్ చేయొచ్చు. సెట్టింగ్స్‌లో ప్రైవసీలోకి వెళ్లి ‘రీడ్ రిసీప్ట్స్’ ఆప్షన్ ఆపేయాలి.
గూగుల్ ట్రాక్ చేయకుండా
గూగుల్ తన అడ్వర్టైజ్‌మెంట్స్‌లో ‘మీ డేటా భద్రంగా ఉంటుంది’ అని చెప్తుంది. కానీ, గూగుల్ సెట్టింగ్స్‌లో మాత్రం డీఫాల్ట్‌గా ‘మై యాక్టివిటీ’ ఎనేబుల్ చేసి ఉంటుంది. ఇది ఎనేబుల్‌లో ఉంటే పర్సనల్ డేటా ఇతరుల చేతిలో పెట్టినట్టే. ‘మై యాక్టివిటీ’ ఫీచర్ ద్వారా గూగుల్‌లో చేసే ప్రతి పనీ రికార్డవుతుంది. దీని ఆధారంగానే యూజర్ల బ్రౌజింగ్ హిస్టరీని ఆయా సంస్థలు తెలుసుకుని, దానికి తగినట్లు యాడ్స్ ఇస్తుంటాయి. అయితే గూగుల్ ఇలా యూజర్ల యాక్టివిటీస్‌ను ట్రాక్ చేయకూడదంటే ‘సెట్టింగ్స్’ లోకి వెళ్లి ‘మై యాక్టివిటీ’ ఆఫ్ చేయాలి. దీనికోసం గూగుల్ యాప్ ఓపెన్ చేసి పైన ఆప్షన్స్‌లో ‘మేనేజ్ గూగుల్ అకౌంట్’ పై క్లిక్ చేయాలి. అక్కడ ‘ప్రైవసీ అండ్ పర్సనలైజేషన్’ లోకి వెళ్లి ‘మై యాక్టివిటీ’ పై క్లిక్ చేయాలి. అక్కడ ‘వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ’, ‘లొకేషన్ హిస్టరీ’, ‘యూట్యూబ్ హిస్టరీ’ లాంటివి ఆఫ్ చేసేస్తే గూగుల్ ట్రాకింగ్ ఆగిపోతుంది. అలాగే ‘పర్సనలైజ్డ్ యాడ్స్’ అనే ఆప్షన్‌ను ఆఫ్ చేస్తే యాడ్స్ తగ్గుతాయి. బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేయడం ద్వారా పెద్ద నష్టమేమీ ఉండదు. గూగుల్ అకౌంట్, ఇతర అప్లికేషన్ల పనితీరుపై ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపదు.
యూట్యూబ్ హిస్టరీ..
యూట్యూబ్‌లో ఏ వీడియోలు చూస్తున్నారు? ఎలాంటి వీడియోలు వెతుకుతున్నారో గూగుల్ ఎప్పటికప్పుడు రికార్డు చేస్తుంది. దాన్ని బట్టి పర్సనలైజ్డ్ యాడ్స్ ప్లే చేస్తుంది. గూగుల్ మీ యూట్యూబ్ యాక్టివిటీని ట్రాక్ చేయకూడదంటే.. యూట్యూబ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘ప్రైవసీ’లో ‘యాడ్ పర్సనలైజేషన్’ను ఆఫ్ చేయాలి.
యూట్యూబ్ లో చూసిన వీడియోల డేటాను డిలీట్ చేయాలనుకుంటే.. యూట్యూబ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘మేనేజ్ హిస్టరీ’ నొక్కితే.. ‘ఆటో డిలీట్’ ఆప్షన్ కనిపిస్తుంది. అది సెలక్ట్ చేసి, మూడు నెలల టైం సెలక్ట్ చేసుకుంటే ప్రతి మూడు నెలలకు యూట్యూబ్ హిస్టరీ ఆటో డిలీట్ అవుతుంది. అలాగే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ‘క్లియర్ వాచ్ హిస్టరీ’ కూడా చేయొచ్చు.
ఆఫీసుల్లో సేఫ్టీ కోసం..
- వర్క్ ప్లేస్ కంప్యూటర్‌లో పర్సనల్ డేటా, బ్యాంకింగ్ డీటెయిల్స్ లాంటివి సేవ్ చేయకూడదు. ఆఫీస్ సిస్టమ్స్‌లో వాట్సాప్ చాటింగ్స్, పర్సనల్ మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్స్ వంటివి లాగిన్ చేయకపోవడమే మంచిది. ఒకవేళ చేసినా ఎప్పటికప్పుడు లాగవుట్ చేయాలి.
- ఆఫీస్ కంప్యూటర్లలో బ్రౌజ్ చేసేటప్పుడు ఎలాంటి పాప్–అప్స్ క్లిక్ చేయకూడదు. ‘హెచ్‌టీటీపీఎస్’తో మొదలయ్యే సైట్స్‌నే ఓపెన్ చేయాలి. ఆఫీస్ ఇ–మెయిల్స్‌కు యాక్సెస్ ఉన్నవాళ్లు వాటి పట్ల మరింత కేర్‌ఫుల్‌గా ఉండాలి. చిన్న పొరపాటు జరిగినా కంపెనీకి సంబంధించిన విలువైన వివరాలు లీక్ అయ్యే అవకాశం ఉంటుంది.
- పనిచేసే చోట లేదా ఇంకెక్కడైనా జీమెయిల్ అకౌంట్ లాగిన్ చేసి మర్చిపోతే ముఖ్యమైన డాక్యుమెంట్స్, ఇ–మెయిల్స్ లాంటివి ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముంది. అందుకే వెబ్ బ్రౌజర్‌లో గూగుల్ అకౌంట్‌లోకి లాగిన్ అయ్యి, ప్రొఫైల్ ఫొటో మీద క్లిక్ చేసి.. ‘మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్’పై క్లిక్ చేయాలి. అక్కడ ‘సెక్యూరిటీ’పై క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ‘యువర్ డివైజెస్’లోకి వెళ్లి ‘మేనేజ్ ఆల్ డివైజెస్’పై క్లిక్ చేస్తే ఏయే డివైజ్‌ల్లో జీమెయిల్ లాగిన్ చేశారో కనిపిస్తుంది. డివైజ్ సెలెక్ట్ చేసి సైన్‌అవుట్ చేయొచ్చు.
సేఫ్ బ్రౌజింగ్ ఇలా..
- బ్రౌజర్ వాడేటప్పుడు యాడ్స్, స్పామ్ పాప్అప్స్ వరుసగా వస్తుంటాయి. అలాంటివాటిని క్లిక్ చేయకూడదు.
- పబ్లిక్ వైఫై లేదా వేరే ఇంటర్నెట్ వాడాల్సి వచ్చినప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు మీ డేటా కలెక్ట్ చేయకుండా ఉండాలంటే ‘వీపీఎన్’ వాడటం మంచిది. వీపీఎన్.. యూజర్ల ఐపీ అడ్రస్ దాచి, బ్రౌజింగ్ డేటాను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది.
- కొన్ని వెబ్‌సైట్లు కుకీస్ యాక్సెప్ట్ చేయకపోతే ఓపెన్ అవ్వవు. అలాంటప్పుడు కుకీస్ యాక్సెప్ట్ చేసి.. వెబ్‌సైట్‌తో పని అయిపోయాక బ్రౌజర్‌లో హిస్టరీని పూర్తిగా క్లియర్ చేసేయాలి.
- ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో క్రోమ్ బ్రౌజర్ వాడుతుంటారు చాలామంది. క్రోమ్‌లో బ్రౌజింగ్ సేఫ్‌గా ఉండాలంటే సెట్టింగ్స్‌లో ‘ప్రైవసీ అండ్ సెక్యూరిటీ’ ఆప్షన్‌కు వెళ్లి అక్కడ ‘డు నాట్ ట్రాక్’ ఆప్షన్ ఆన్‌లో ఉంచాలి. అలాగే ‘సేఫ్ బ్రౌజింగ్’పై క్లిక్ చేసి ‘ఎన్‌హాన్స్‌డ్ ప్రొటెక్షన్’ ఆన్ చేయాలి. దీంతోపాటు ముఖ్యమైన పేజీలను బుక్‌మార్క్స్‌లో సేవ్ చేసుకుని మిగతా బ్రౌజింగ్ డేటాను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తుండాలి.
పర్మిషన్ ఇస్తున్నారా?
- యాప్స్‌కు ఇచ్చే పర్మిషన్స్‌ను బట్టి ప్రైవసీ మారుతుంటుంది. పర్సనల్ వివరాలు ఇతరులకు తెలియకుండా ఉండాలంటే యాప్స్‌కు ఇచ్చే పర్మిషన్స్ ఓసారి చెక్ చేసుకోవాలి.
- కొన్ని యాప్స్ ఓపెన్ చేయగానే లొకేషన్ పర్మిషన్ అడుగుతాయి. ఫుడ్ డెలివరీ, క్యాబ్ బుకింగ్ లాంటి యాప్స్‌కు లొకేషన్ అవసరం. కాబట్టి వాటికి పర్మిషన్ ఇవ్వక తప్పదు. అలాకాకుండా లొకేషన్‌తో పని లేని యాప్స్‌కి కూడా లొకేషన్ యాక్సెస్ ఇచ్చి ఉంటే వెంటనే ఆఫ్ చేయాలి. అలాగే పర్మిషన్ ఇచ్చేముందు ఆప్షన్స్‌లో ‘ఎలో ఆల్ ద టైమ్’ కు బదులుగా ‘వైల్ యూజింగ్ దిస్ యాప్’ ఎంచుకోవడం బెటర్.
- యాప్స్‌కు మైక్రోఫోన్ యాక్సెస్ ఇవ్వడం ద్వారా పర్మిషన్ లేకుండానే యూజర్ల మాటలను వినే ప్రమాదం ఉంది. కాబట్టి ఏయే యాప్స్‌కు మైక్రోఫోన్ యాక్సెస్ ఇస్తున్నారో చెక్ చేసుకోవాలి.
- యాప్స్‌కు స్టోరేజ్ యాక్సెస్ ఇవ్వడం అంటే ఫోన్‌లో ఎలాంటి ఫైల్స్‌నైనా సేవ్ చేయొచ్చని పర్మిషన్ ఇవ్వడం. కాబట్టి ఈ పర్మిషన్ కూడా అవసరమైన యాప్స్‌కే ఇవ్వాలి.
- కొన్ని బ్యాంక్‌లు, క్రెడిట్ కార్డు కంపెనీలు యాప్స్ ద్వారా ఇ–కెవైసీ చేయమని అడుగుతాయి. అలాంటివి సబ్మిట్ చేసేటప్పుడు యాప్ ప్రైవసీ పాలసీ చదవడం మంచిది. పొరపాటున ఆధార్, పాన్ లాంటి కెవైసీ సమాచారం బయటకు వెళ్లిపోతే సైబర్ క్రైమ్స్ జరిగే అవకాశం ఉంటుంది.
- ప్రభుత్వం ఆమోదించిన పేమెంట్ యాప్స్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) యాప్స్‌కు తప్ప మిగతా ఎలాంటి యాప్స్‌కు బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వకూడదు.