
స్వాతంత్య్ర భారతదేశంలో సమాజంలోని అనేక సామాజిక రుగ్మతలకు, ఆర్థిక సమస్యలకు, పేదరిక నిర్మూలనకు సంబంధించిన సామాజిక శాస్త్రాల పరిశోధన, ప్రభుత్వ పాలసీలు ప్రధానంగా ఇంగ్లిష్లోనే జరుగుతున్నాయి. మాతృభాషలో పరిశోధన చేయటం చాలా అరుదుగా జరుగుతున్నది. విశ్వవిద్యాలయాలు, పరిశోధకులు సమాజ సమస్యలకు పరిశోధన పరిష్కారాన్ని ఇంగ్లిష్ పత్రికల్లోనే ప్రచురిస్తారు. సమస్యల అవగాహన, వాటి పరిష్కార మార్గాలను ప్రజలు నేరుగా అర్థం చేసుకునే మాతృభాషలో లేకపోవడం తీరని లోటుగా మిగిలిపోతోంది.
ముఖ్యంగా ప్రాంతీయ సమస్యలను పరిశోధన చేసినప్పుడు తెలుగులో పరిశీలించడం వల్ల ప్రజలతో నేరుగా మాట్లాడడమే కాకుండా, ఆ సమస్యలను అవగాహన చేసుకోవడం, వాటి పరిష్కార మార్గాలను సూచించడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఎప్పుడైతే పరిశోధనల సారాంశం ఇంగ్లిష్ భాషలో ఉంటుందో సామాన్య ప్రజలు ఆ విషయాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాల్లో సైతం తెలుగులో పరిశోధనలకు తగినంత ప్రోత్సాహం, ఆదరణ లేదు.
పరిశోధన నిర్వహణ, పత్రికల ప్రచురణ, శోధన గ్రంథాల రచన అన్ని ఇంగ్లిష్ ఆధారంగా జరుగుతున్నాయి. ప్రపంచంలోని ఏ దేశం దాని మాతృభాషలో విద్యను అందించకుండా అభివృద్ధి చెందలేదు. అనేక దేశాలు తమ మాతృభాషలో విద్యను అందించడం ద్వారా భారతదేశం కంటే వేగంగా వృద్ధి చెందుతున్నాయి. అంతర్జాతీయ భాషగా ఆంగ్ల భాష పరిణామం చెందడానికి ఆంగ్ల ప్రజల అంకితభావం, భాషపై ప్రేమ, వారి భాషను అభివృద్ధి చేయాలనే ప్రయత్నాలు ముఖ్యమైనవి.
వాడుక, బోధనా భాష ప్రయత్నం
తెలంగాణ ప్రభుత్వం 2017లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిపిన తరువాత, తెలుగు భాష ప్రోత్సాహానికి 1 నుంచి 12 వ తరగతి వరకు తెలుగు చదవడం తప్పనిసరి చేసింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర కార్యదర్శి స్థాయి వరకు అధికారిక ఉత్తర, ప్రత్యుత్తరాలు తెలుగులో ఉండాలని, అన్ని అధికారిక పత్రాలకు తెలుగులో సంతకం చేయాలని నిబంధనలు పెట్టడం హర్షణీయం. తెలుగును ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు అందజేస్తోంది. అయితే, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉపాధి అవకాశాలు, పరిశోధనల సామర్థ్యాన్ని పెంచేవిధంగా ఆశించిన మేరకు లేకపోవడంతో తెలుగుకు ఆదరణ తగ్గిపోతుంది.
ప్రామాణిక పదజాలాన్ని అభివృద్ధి చేయాలి
సామాజిక శాస్త్ర రంగంలో ఆధునిక భావనలు, సాంకేతిక పదాలకు తెలుగులో ప్రామాణిక పదజాలాన్ని అభివృద్ధి చేయాలి. దీని కోసం భాషా నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేయాలి. తెలుగులో సామాజిక శాస్త్ర పరిశోధనలకు అవసరమైన పుస్తకాలు, జర్నల్స్, డేటాబేస్‌లు, ఇతర వనరులను అభివృద్ధి చేయాలి. డిజిటల్ లైబ్రరీలు, ఆన్‌లైన్ వనరులను అందుబాటులోకి తీసుకురావాలి.
ప్రాంతీయ భాషలో సామాజిక శాస్త్ర పరిశోధనలు చేసేవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు, స్కాలర్‌షిప్‌లు, గ్రాంట్లు అందించాలి. తెలుగులో ప్రచురించిన పరిశోధన పత్రాలకు గుర్తింపు, ప్రచురణ అవకాశాలను పెంచాలి. తెలుగులో చేసిన పరిశోధనలను, అనువాదం చేసి అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడానికి అవకాశాలను కల్పించాలి. ఇతర భాషలలోని పరిశోధనలను తెలుగులోకి అనువదించాలి. తెలుగు పరిశోధనలను ఇతర భాషలలోకి అనువదించాలి.
పరిశోధన పత్రాల ప్రచురణకు సంబంధించిన జర్నల్స్ అనుభవజ్ఞులైన మేధావుల చేత పరిశోధకులకు అందుబాటులోకి తీసుకురావాలి. ఆ పరిశోధన పత్రాలకి ఉద్యోగాలలో పదోన్నతులకు, అన్ని రకాలైన వృత్తిపరమైన ప్రయోజనాలు అందించినట్లయితే మాతృభాషలో మరింత లోతైన అధ్యయనాలకు, సృజనాత్మకతకు పెద్దపీట వేసిన వారమవుతాం.
పరిశోధనలకు గుర్తింపునివ్వాలి
కేంద్ర ప్రభుత్వం మాతృభాష గొప్పతనాన్ని గుర్తించి నూతన జాతీయ విద్యా విధానంలో అత్యంత ప్రముఖ పాత్రను కల్పించింది. అయినప్పటికీ కేంద్రీయ ఉన్నత విద్యాసంస్థలలో మాతృభాష బోధన చాలా సంక్లిష్టంగా మారటం. మాతృభాషలలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించుకునే వ్యవస్థను నేటికీ అభివృద్ధి చేయకపోవడం, మాతృభాషలో చేసే పరిశోధనలకు, పరిశోధకులకు, టీచర్లకు గుర్తింపు లభించడం లేదు. ఈ ధోరణి మారాలి.
విద్యార్థులు తమ సొంత భాషలలో పరిశోధన చేయడానికి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మాతృభాషలో రాసిన గ్రంథాలకి, శాస్త్రీయ పరిశోధన పత్రాల ప్రచురణకి అవసరమైన, నాణ్యమైన జర్నల్స్ లేకపోవటం కూడా ఒక ప్రధానమైన సమస్య. ప్రభుత్వం జాతీయ విద్యా విధానం ద్వారా మాతృభాషలలో చదువు, పరిశోధనలు చేయవచ్చని పేర్కొన్నప్పటికీ ఉపాధి, ప్రమోషన్ల విషయంలో ఆయా పత్రాలకి ఏ విధంగా ప్రామాణికతనిస్తారు అనే విషయంపైన నేటికీ మార్గదర్శకాలు ఇవ్వలేదు.
మార్గదర్శకాలు విడుదల చేసినట్లయితే కొంతమేరకు పరిశోధనాసామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా స్థానిక భాషలో చేసిన పరిశోధనలు స్థానిక సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా కృషి చేయాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడు మాత్రమే ప్రభుత్వం పరిశోధనలకి, ఉన్నత విద్యకు చేస్తున్న ఖర్చుకు ప్రయోజనం ఉంటుంది. సైన్సు, సామాజిక శాస్త్ర అధ్యయనాల్లో, పరిశోధనలలో సైతం భాష తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. తెలుగు భాషలో ప్రచురితమైన పరిశోధనా వ్యాసాలకు తగిన గుర్తింపునిస్తే ప్రాంతీయ పరిశోధనలు సైతం జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఉపయోగపడతాయి. .
- కృష్ణారెడ్డి చిట్టెడి,
అసోసియేట్ ప్రొఫెసర్,
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ