
- పది సార్లు ఫోన్లను ఎందుకు మార్చారు
- ఒబెరాయ్ హోటల్లో జరిగిన మీటింగ్ మతలబేందని ప్రశ్న
- సమీర్ మహేంద్రుతో సంబంధం ఏమిటి?: తరుణ్ చుగ్
న్యూఢిల్లీ/ హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి లిక్కర్ స్కామ్‌లోని నిందితులు ఎందుకు వచ్చారని బీజేపీ స్టేట్ ఇన్చార్జ్ తరుణ్‌చుగ్ ప్రశ్నించారు. ఢిల్లీ ఒబెరాయ్ హోటల్ జరిగిన మీటింగ్ ఆంతర్యం ఏమిటని నిలదీశారు. ‘‘ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఎమ్మెల్సీ కవిత పాత్ర నిర్ధారణ అయింది. ఇందులో నిష్పక్షపాత దర్యాప్తు కోసం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు. అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలనే కేసీఆర్ సర్కార్ ప్రధాన స్కీమ్ అని ఆయన విమర్శించారు. అవినీతి, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ దోపిడీ దారి ఢిల్లీ చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చడం కూడా దోపిడీలో ఒక భాగమని దుయ్యబట్టారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో తరుణ్‌చుగ్ మీడియాతో మాట్లాడారు. ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. హైదరాబాద్, ఢిల్లీ ఒబెరాయ్ హోటల్ లో జరిగిన మీటింగ్ లు, నిందితులతో కవిత జరిపిన చర్చల వివరాలను చార్జ్‌షీట్‌లో ఈడీ ప్రస్తావించిందని, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేతలు సౌత్ ఇండియాకు చెందిన వ్యాపారులతో ఏ విధంగా లిక్కర్ స్కామ్ చేశారో పేర్కొందని తెలిపారు. దాదాపు రూ. 100 కోట్ల లంచం తీసుకునేందుకు జరిగిన చర్చలు ప్రజల ముందుకు వస్తున్నాయని చెప్పారు. చార్జ్ షీట్‌లో ఈడీ అనేకసార్లు కవిత పేరును ప్రస్తావించిందని అన్నారు. ‘‘కవిత పదిసార్లు ఫోన్ ను ఎందుకు మార్చాల్సి వచ్చింది? అంత అవసరం ఏంటీ? సమీర్ మహేంద్రుతో కవితకు సంబంధం ఏమిటి?. ఎవరైతే మాఫియా ఇజానికి పాల్పడుతారో వాళ్లకు ఫోన్లు పదే పదే మార్చాల్సి వస్తుంది” అని విమర్శించారు.
తెలంగాణలోనూ ఢిల్లీ లిక్కర్ పాలసే
ఢిల్లీ లాంటి లిక్కర్ పాలసీనే ప్రస్తుతం తెలంగాణ, పంజాబ్ లోనూ కొనసాగుతున్నదని తరుణ్ చుగ్ అన్నారు. ‘‘కుటుంబ వాదంతో తెలంగాణను దోపిడీ చేసిన కేసీఆర్.. ఈ ప్రణాళికలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ను కలిశారు. లిక్కర్ స్కామ్‌లో ఉన్న వాళ్లు ఎంత పెద్దవాళ్లయినా కఠినమైన శిక్ష విధించాల్సిందే. ఈ తీర్పుతో అవినీతిపరులకు ఒక మెసేజ్ వెళ్లాలి” అని పేర్కొన్నారు. పంజాబ్ రైతులకు కేసీఆర్ పంపిణీ చేసిన చెక్ లు బౌన్స్ అయ్యాయని, పంజాబ్ రైతులకు చెక్కులు ఇవ్వడం ఒక సాకు మాత్రమే అని ఆయన అన్నారు. దీని వెనుక కూడా లిక్కర్ కుంభకోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ‘‘కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతిపై బీజేపీ ఎప్పటి నుంచో చెప్తున్నది. కేసీఆర్ మౌనం వహించడం దేనికి సంకేతం? లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు, కూతురిని కాపాడేందుకు బీఆర్‌ఎస్ పేరుతో కేసీఆర్ డ్రామాలాడుతున్నరని ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నది” అని తరుణ్ చుగ్ పేర్కొన్నారు.