సీఎం కేసీఆర్ వ్యూహాలేంటి.?

సీఎం కేసీఆర్ వ్యూహాలేంటి.?

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటై.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకూ సీఎం కేసీఆర్ చాలాసార్లు ఢిల్లీ వెళ్లారు. అయితే అక్కడ ఎక్కువ రోజులు గడిపేవారు కాదు. కానీ ఇటీవల కేసీఆర్​ 8 రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో ఆయన పొలిటికల్​ ప్లాన్స్​పై చాలా ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి. ఢిల్లీ టూర్​ సందర్భంగా కేసీఆర్​ చేసిన పనులు చాలానే ఉన్నాయి. సీక్రెట్​గా ఆయన కాంగ్రెస్​ లీడర్లను కలవొచ్చు. ఎందుకంటే.. కాంగ్రెస్​ పార్టీకి చెందిన మాజీ ఎంపీలు చాలా మంది ఇప్పుడు టీఆర్ఎస్​లోనే ఉన్నారు. కాంగ్రెస్​ హైకమాండ్​తో మాట్లాడాలనుకుంటే వారికి ఇప్పటికీ అవకాశం ఉంటుందనే విషయాన్ని మనం మరిచిపోకూడదు. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే కేజ్రీవాల్, శరద్​పవార్​లను కలవలేదనే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ నిజం ఏమిటనేది నెమ్మదిగా బయటపడుతుంది.

నేషనల్​ పాలిటిక్స్​కు ఇది టైం కాదు

2021 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్​ విక్టరీ కొట్టిన పశ్చిమబెంగాల్​ సీఎం మమతా బెనర్జీకి జాతీయ రాజకీయాలపై చాలా ఆశలే ఉన్నాయి. ఇక శరద్​పవార్​ కూడా ప్రధానమంత్రి అభ్యర్థిత్వం కోసం చాలా ఆతృతతో ఉన్నారు. కేజ్రీవాల్​ విషయానికి వస్తే 2024 లోక్​సభ ఎన్నికల తర్వాతే ఆయన అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. కానీ కేసీఆర్​ 2023 డిసెంబర్​లోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఫేస్​ చేయాల్సి ఉంది. ఆ ఎన్నికల తర్వాత మాత్రమే తాను ఎక్కడ ఉంటాననే విషయం కేసీఆర్​కు అర్థమవుతుంది. ఒకవేళ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్​ ఓటమిపాలైతే.. ఆయనకు నేషనల్​ పాలిటిక్స్​పై అంతగా ఆశలు ఉండకపోవచ్చు. ఒకవేళ ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషించాలని కేసీఆర్​ కోరుకుంటే.. అది నరేంద్రమోడీకి వ్యతిరేకంగా వెళ్లడమే అవుతుంది. బీజేపీని వ్యతిరేకించి కేసీఆర్​ సాధించేదేమిటి? అనేది ఇక్కడ ఎదురయ్యే ప్రశ్న. తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ కేసీఆర్​కు ప్రధాన ప్రత్యర్థి కదా? అందువల్ల మమతాబెనర్జీ, శరద్​పవార్, కేజ్రీవాల్​ చేసినట్టుగా కేసీఆర్​ చేస్తే అందులో ఎలాంటి లాజిక్​ ఉండబోదు. అలాగే రాహుల్​ గాంధీని ప్రతిపక్షాల ఉమ్మడి నాయకుడిగా చూడాలని కూడా కేసీఆర్​ కచ్చితంగా అనుకోకపోవచ్చు. అందువల్ల తన ప్రత్యర్థులతో ఆయన ఎందుకు కలుస్తారు? ఈ కారణాల వల్ల నేషనల్​ పాలిటిక్స్​లోకి కేసీఆర్​ వెళ్లాల్సిన సరైన టైం ఇది కాదు. ఒకవేళ అలా చేస్తే మాత్రం నీళ్లు లేని స్విమ్మింగ్​పూల్​లోకి జంప్​ చేసినట్టే భావించాలి.

తెలంగాణలో ఎదురయ్యే సమస్యలు

ఏడేండ్లు అధికారంలో ఉన్నందువల్ల సాధారణంగానే ప్రభుత్వ వ్యతిరేకత మొదలవుతుంది. అలాగే ప్రభుత్వ తీరుపై విసుగు కూడా కలుగుతుంది. కేసీఆర్​ బయట ఎక్కువగా కనిపించే పొలిటీషియన్. ఎప్పుడైతే ఒక పొలిటీషియన్​ ఓవర్​ఎక్స్​పోజ్​ అవుతారో అప్పుడు తన చరిష్మాను, తన సీక్రెట్​ను అతను కోల్పోతాడు. కేసీఆర్​కు పూర్తి వ్యతిరేకమైన వ్యక్తి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్. ఆయన ఎక్కువగా బయట ఎక్స్​పోజ్​ కారు. కానీ 21 ఏండ్ల పాటు ఏకథాటిగా అధికారంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం కేసీఆర్​కు ఎదురయ్యే పొలిటికల్​ సవాళ్లు ఏమిటనే విషయాన్ని పరిశీలిస్తే..

1. అధికారంలో ఉండటం వల్ల కేసీఆర్​ కాంగ్రెస్, టీడీపీకి చెందిన కీలక నాయకులను ఆకర్షించగలిగారు. ప్రస్తుతం కొత్త లీడర్లకు టీఆర్ఎస్​లో అవకాశాలు తక్కువే. ఇదే సమయంలో పాత సీనియర్​ లీడర్లకు కచ్చితంగా సరైన అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. అయితే అలాంటి పదవులు ఎక్కువ సంఖ్యలో లేవు. పదవులు దక్కని సీనియర్​ లీడర్లు పార్టీకి నష్టం చేసే అవకాశం ఉంటుంది. కేసీఆర్​ వాళ్లను వదిలి పెట్టలేరు లేదా అందరికీ పదవులు ఇవ్వలేరు.

2. కాంగ్రెస్​ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అసంతృప్తితో ఉన్న చాలామంది నేతలు టీఆర్ఎస్ నుంచి మళ్లీ కాంగ్రెస్​లో చేరే అవకాశాలు లేకపోలేదు. అలాగే మైనార్టీల ఓట్లు కూడా చీలి పోయే అవకాశాలు ఉన్నాయి.

3. బీజేపీ విషయానికి వస్తే.. తెలంగాణలో వెనుకబడిన వర్గాల పార్టీగా ఆ పార్టీ అవతరిస్తోంది. అలాగే ఎవరైనా కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకున్నా అలాంటి వారిని ఆకర్షిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్​ పార్టీలు సీనియర్​ లీడర్లతో నిండిపోవడంతో.. బీజేపీలో కొత్త వారికి ఎక్కువ స్పేస్​ కనిపిస్తోంది.

4. కేసీఆర్​ ప్రభుత్వ పనితీరు ప్రస్తుతం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఉచిత స్కీములు, సంక్షేమ పథకాలు వాటిని పొందలేని కొందరిలో ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఒక సెక్షన్​ జనాలు మంచి పాలనను కోరుకుంటున్నారు. ప్రస్తుతం కేసీఆర్​ కూడా ఓ డైలమాలో ఉన్నారు. ఉచితంగా ఏమివ్వాలి? ఎంతివ్వాలి? ఎవరికివ్వాలి? అనే విషయాన్ని ఆయన తేల్చుకోలేకపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఏదో ఒకటి పొందిన వారిలో సంతృప్తి కలగడం లేదు. వారు మరింత కావాలని కోరుకుంటున్నారు. ఓటర్​గ్రీడ్​ అనేది అపరిమితమైనది. ఆర్థికశాస్త్ర పరంగా చెప్పాలంటే.. దీనిని ‘లా ఆఫ్​ డిమినిషింగ్​ రిటర్న్’ అంటారు. మీరు ఎంత ఎక్కువ ఇస్తే.. దాని విలువ అంత తగ్గిపోతుంది.

1955లో ప్రముఖ సోషియాలజిస్ట్​ ఎంఎన్ శ్రీనివాస్​.. సంస్కృతీకరణ, ఓటుబ్యాంకు అనే పదాలను ఖాయం చేశారు. సంస్కృతీకరణ అనేది సామాజిక మార్పునకు ఉద్దేశించిందని, ఓటుబ్యాంకు అనేది విశ్వసనీయ ఓటర్ల సమూహం, వీరంతా ఒక నిర్థిష్ట అభ్యర్థికే ఓటు వేస్తుంటారని ఎంఎన్​ శ్రీనివాస్​ చెప్పారు. 25 ఏండ్ల క్రితం, ఒకవేళ మీరు ఒక కులంలో ఎవరికైనా ఏదైనా సాయం చేసినట్లయితే.. ఆ కులం ఓట్లు మొత్తం మీకే పడేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. సామాజిక మార్పుల కారణంగా ఓటు బ్యాంకులనేవి విచ్ఛిన్నమైపోయాయి. ఒకవేళ హుజూరాబాద్​లోని దళితులకు మీరు ఏమైనా చేస్తే, వేరే ప్రాంతాల్లోని దళితులు కూడా అదే కావాలని కోరుకుంటున్నారు. లేకపోతే వారు మీ గురించి అస్సలు పట్టించుకోరు. అందువల్ల ఓటు బ్యాంకుల విచ్ఛిన్నమనే సవాల్​ను కూడా కేసీఆర్​ ఎదుర్కొంటున్నారు. ఎవరో ఒకరి ఏదో చేయడం ద్వారా ప్రస్తుతం కేసీఆర్​ శత్రులను సృష్టించుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని కులాలు.. అన్ని పార్టీలకు ఓటు వేస్తున్నాయి. కులాల్లోనే వారు విడిపోతున్నారు. తెలంగాణలో గొప్ప కుల నాయకులు ఎవరైనా ఉన్నారా? ఇప్పటి వరకూ ఫార్వార్డ్​ కులాలు మాత్రమే ఓటు బ్యాంకుగా ఉండేవి. అయితే ఇప్పుడు ఈ కులాలు అన్ని పార్టీలకు విస్తరించాయి. అందువల్ల స్పష్టమైన ఓటు బ్యాంకులు అనేది కనుమరుగైపోయాయి.

కేసీఆర్​ ముందున్న ఆప్షన్స్

  • కేసీఆర్​ ప్రస్తుతం అటు కాంగ్రెస్​తో కానీ, ఇటు బీజేపీతో కానీ పొత్తు పెట్టుకోలేరు. ఒకవేళ కేసీఆర్​ కాంగ్రెస్​తో జట్టు కడితే అప్పుడు బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా మారుతుంది. అప్పుడు పదవులు పొందలేని టీఆర్ఎస్ సీనియర్​ నాయకుల పరిస్థితి ఏమిటి? ఒకవేళ కేసీఆర్​ బీజేపీతో దోస్తీ చేస్తే.. అప్పుడు 10 శాతం ఉన్న మైనార్టీ ఓటర్లను కాంగ్రెస్​కు కోల్పోవాల్సి వస్తుంది. 
  • కేసీఆర్​ టీఆర్ఎస్​ లోని మొత్తం సీనియర్​ లీడర్లను పక్కనపెట్టాలి. బీజేపీ అధికారంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో ప్రస్తుతం చేస్తున్న పని ఇదే. కేసీఆర్​ సీనియర్లను పక్కన పెట్టి వచ్చే ఎలక్షన్లలో కొత్త ముఖాలకు చోటు కల్పించాలి.
  • మంచి ప్రభుత్వాన్ని నడపడం. ఇది చెప్పడానికి సులువుగానే ఉంటుంది. కానీ, సమర్థవంతమైన, అవినీతి మరకల్లేని ప్రభుత్వాన్ని నడిపించడం అంటే చాలా కష్టమైన విషయం.
  • తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామనే మాట ఇకపై చెప్పడానికి టీఆర్ఎస్​ నాయకులకు కుదరకపోవచ్చు. ఎందుకంటే రాష్ట్రం సాధించినందుకే జనాలు పదేండ్ల పాటు ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు.ఓటు బ్యాంకుల కాలం పోయింది

పెంటపాటిపుల్లారావు,పొలిటికల్ అనలిస్ట్