పాలకుల అభివృద్ధిలో పంచాయతీలు సమిధలు

పాలకుల అభివృద్ధిలో పంచాయతీలు సమిధలు

మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో పునాదిగా భావించే గ్రామ స్థాయి పాలనకు భారత రాజ్యాంగంలో ప్రత్యేక స్థానం కల్పించారు. మొత్తం పంచాయతీరాజ్ సంస్థాగత వ్యవస్థకు, తద్వారా భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు, గ్రామసభ మూలస్తంభంగా భావించారు. ప్రజాస్వామ్యం అనేది సమానత్వం, సామాజిక, రాజకీయ పరివర్తనలో పాల్గొనే హక్కు, అభివృద్ధి హక్కు, గౌరవంగా జీవించే హక్కుపై ఆధారపడి ఉంటుంది. సుపరిపాలనలో పంచాయతీరాజ్ ఒక వ్యవస్థ. ప్రజాస్వామ్యం అందించేందుకు ఉపయోగించే ప్రక్రియ. అనాదిగా భారతదేశంలో గ్రామాలు పరిపాలనకు ప్రాథమిక యూనిట్లుగా ఉన్నాయి. గత 30 ఏండ్లుగా గ్రామాలకు అభివృద్ధి పథంలో, నిర్ణయాల్లో ఉండాల్సిన పాత్ర క్రమంగా పలచన చేస్తూ వస్తున్నాయి ప్రభుత్వాలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు గ్రామాలు, గ్రామ సభలు, పంచాయత్ రాజ్ వ్యవస్థ అడ్డుగా ఉన్నాయని భావిస్తున్నాయి. తాము తీసుకునే నిర్ణయాలు గ్రామ సభల వల్ల ఆలస్యం అవుతున్నాయని అసహనం ప్రదర్శిస్తున్నాయి. తమకు వచ్చే ఆదాయంలో గ్రామాలకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. పంచాయత్ రాజ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధులు, నిర్ణయాల మీద ‘ఘర్షణ’ లేకుండా, భారత రాజ్యాంగం వ్యవస్థలను నిర్మించింది. వీటిని రెండు అంతరాల పాలనా వ్యవస్థలు(కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు)తోచిన దగ్గర నిర్వీర్యం చేస్తూ వస్తున్నాయి. ప్రాథమిక స్థాయి పాలనా వ్యవస్థ మీద ఉక్కు పాదం మోపి క్రమంగా ప్రజాస్వామ్య పద్ధతులనే మారుస్తూ, గ్రామాలను సమిధలుగా చేస్తున్నాయి.

లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలదే..

అభివృద్ధి ఒక నినాదంగా వాడుకుంటూ దేశంలోని రాజకీయ పక్షాలు అన్నీగ్రామాలను, గ్రామీణ ప్రాంతాలను, గ్రామ స్థాయి వ్యవస్థలను దోచుకుంటూ, నిర్వీర్యపరుస్తున్నారు. ఆహార ఉత్పత్తికి పట్టుగొమ్మలైన గ్రామాల్లో ఆకలి పెరగడానికి, పోషక ఆహారం లేమికి, పేదరికానికి ఈ రుద్దబడిన అభివృద్ధే కారణమని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. తాగు, సాగు నీరు ప్రాజెక్టులు కట్టి అవి పారే గ్రామాలకు చుక్క నీరు ఇవ్వకుండా పట్టణాలకు అందించే వ్యవస్థల మీద పెట్టిన ఖర్చులను జీడీపీ లెక్కల్లో రాసుకుని సగటు ఆదాయం పెరిగిందని గొంతు చించుకుంటున్నారు. ఈ మధ్య అయితే ఒక పథకం ప్రకటించి అది గ్రామాలకు చేరాలని ‘లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ అని లక్ష్యం పెట్టుకుంటున్నారు. అంటే, గ్రామీణ లబ్ధిదారులు ‘చివరి’ వరుసలో ఉన్నారని ఒప్పుకుంటున్నారు. పింఛను, విత్తనాలు, రుణం ఇలా అన్నింటికీ గ్రామాల్లో వితరణ వ్యవస్థ లేదు. పంచాయతీలకు ఇచ్చే అధికారం లేదు. లబ్ధిదారుల ఎంపిక కూడా ఈ మధ్య ఎమ్మెల్యేలు చేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న పంచాయత్ రాజ్ ప్రతినిధుల పాత్ర దళారీ పాత్రకు పరిమితమైంది. గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను గుర్తించే పని ఎప్పుడో పోయింది. గ్రామీణులు మాత్రమే లక్ష్యంగా పథకాలు వచ్చినా అవి చేరకపోవడానికి ప్రధాన కారణం ప్రజాస్వామ్యం, పాలన వ్యవస్థ వారి కనుసన్నల్లో లేకపోవడం.

గ్రామసభ తీర్మానాలకు విలువేది?

పంచాయత్ రాజ్ వ్యవస్థ గురించి ఆలోచిస్తే భారత రాజ్యాంగంలో 73వ అధికరణం గుర్తుకు వస్తుంది. ప్రజలకు దగ్గరగా ఉండే మూడో ప్రభుత్వానికి ఈ అధికరణం మూల స్తంభం. కానీ గ్రామాల పాలనా వ్యవస్థకు ఉండే అధికారాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సొంతం చేసుకుంటున్నాయి. ఒక్కో రాష్ట్రంలో గ్రామాల అధికారాల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి. స్థూలంగా చూస్తే నిర్ణాయక అధికారాలు గ్రామీణుల వద్ద లేవు. బొగ్గు, కలప, రాయి, ఇసుక, వ్యవసాయ ఉత్పత్తులు, పశువుల ఉత్పత్తులు వగైరా అన్ని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ గుప్పిట్లో పెట్టుకొని, గ్రామాలను ఆడిస్తున్నాయి. అడవులు, చెరువులు, గుట్టలు వంటివి కూడా ఈ రోజు మార్కెట్ వస్తువులైనా గ్రామాలకు నిర్ణయాధికారం లేదు. తెలంగాణాలో అనేక పరిశ్రమలు గ్రామస్తులకు చెప్పకుండా, అడగకుండా, మోసపూరితంగా ఏర్పాటు అయ్యాయి. ప్రమాదకర ఫార్మా తదితర పరిశ్రమల వల్ల అనేక గ్రామాలు కాలుష్యం కోరల్లో చిక్కి విలవిలలాడుతున్నాయి. కేంద్ర పర్యావరణ చట్టంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందు గ్రామ సభ ఆమోదం తప్పనిసరిగా ఉండేది. ఈ నిబంధనను రకరకాలుగా బలహీనపరిచి ఈ మధ్య మార్చారు. అత్యంత ప్రమాదకర పరిశ్రమలకు కూడా ఇప్పుడు గ్రామ సభ ఆమోదం అవసరం లేదు. ఘట్టుప్పల్​లో ఫార్మా పరిశ్రమ వద్దు అంటున్నా, రాష్ట్ర మంత్రి ఏర్పాటు చేయబోమని హామీ ఇచ్చినా పరిశ్రమ ఏర్పాటు ఆగలేదు. జగిత్యాల జిల్లాలో స్తంభాలపల్లి గ్రామం, నారాయణపేట జిల్లాలో చిత్తనూరు గ్రామం పరిశ్రమ వద్దు అన్నా కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పందించడం లేదు. గ్రామ సభ తీర్మానాలు పట్టించుకోవడం లేదు. అనేక గ్రామాలు వివిధ విషయాలపై చేసిన గ్రామ సభ తీర్మానాలకు విలువ లేకుండా పోతున్నది. భగీరథ ఇంటింటికీ నీరు ‘అందించే’ పని గ్రామ పంచాయతీ చేతుల నుంచి ఒక కంపెనీకి చేర్చింది. గ్రామాల్లో వీధి లైట్ల ఏర్పాటు నిర్వహణ కూడా దేశ వ్యాప్తంగా ఒక ప్రైవేటు కంపెనీకి అప్పజెప్పారు. ఆయా పథకాలకు నిధులు గ్రామాలకు వచ్చేవి నేరుగా వారికి చేరుతున్నాయి. గ్రామీణులకు ఈ విషయాలు ఏవీ తెలిసే అవకాశం లేదు. 

అభివృద్ధి నిర్ణయాలపై అధికారం ఎవరది?

హైదరాబాద్ నగరం సమీపంలో అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో 10 గ్రామాలు, పక్కనే యాదాద్రి భువనగిరి జిల్లాలో 10 గ్రామాల మధ్యలో దాదాపు30 రాతి గనులు, కంకర మెషిన్లు తదితర కాలుష్యకారక పరిశ్రమలు అనుమతి లేకుండా10 ఏండ్లకు పైగా నడుస్తున్నాయి. గ్రామ సభ తీర్మానాలు ఇక్కడ పని చేయలేదు. కేంద్ర భూసేకరణ చట్టంలో గ్రామ సభ పెట్టి సమాచారం ఇచ్చి, ఆమోదం తీసుకునే నిబంధన ఉంటే, దాన్ని మార్చి ఇంకొక చట్టం తీసుకు వచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఏటిగడ్డ కిష్టాపూర్ లో మాకు ఈ రకమైన అభివృద్ధి వద్దని గ్రామస్తులు అన్నా ప్రభుత్వం బలవంతంగా ఖాళీ చేయించింది. హైదరాబాద్ విస్తరణకు 2012లో ఏకపక్షంగా హెచ్ఎండీఏ పరిధి7,527 చదరపు కిలోమీటర్లకు పెంచి, నిర్మాణాల అనుమతులకు వచ్చే ఆదాయం 849 గ్రామ పంచాయతీల నుంచి గుంజుకున్నరు. ఈ పంచాయతీలకు ఇప్పుడు ఆదాయం లేదు. జహీరాబాద్ దగ్గర నిమ్జ్ ప్రాజెక్టు, హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టు, కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ విస్తరణ తదితర ‘అభివృద్ధి’ నిర్ణయాలు స్థానిక గ్రామాలు వ్యతిరేకించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

తెలంగాణలో పంచాయతీ రాజ్ చట్ట సవరణ తర్వాత గ్రామ సర్పంచులను తీసివేసే అధికారం జిల్లా కలెక్టర్లకు వచ్చింది. ఈ అస్త్రంతో గ్రామ సభ తీర్మానాలు తమకు అనుకూలంగా చేయించుకునే రాచరిక అధికారం సాధించుకున్నారు పాలకులు. ఇక, ప్రభుత్వాలు తలచుకునే ‘అభివృద్ధికి’ ఆటంకాలు ఎలా ఉంటాయి? అనూహ్యంగా, హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉన్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల రక్షణకు ఉన్న 111 జీవో ఎత్తివేయడానికి, దీని పరిధిలో ఉన్న 84 గ్రామాలు కోరుతున్న అభివృద్ధిగా వర్ణిస్తూ, గ్రామ సభ తీర్మానాలను తన వాదనకు దన్నుగా తెలంగాణ ప్రభుత్వం వాడుకుంటున్నది. లక్ష ఎకరాలకు సంబంధించి లక్ష కోట్ల రూపాయల వ్యాపారం జరిగినా ఒక్క రూపాయి కూడా 84 గ్రామ పంచాయతీలకు అందే అవకాశం లేదు. గ్రామ ప్రజలకు ఈ రియల్ ‘అభివృద్ధి’ లో భాగస్వామ్యం లేదు. నిర్ణయాధికారం అసలే లేదు.

కేంద్ర, రాష్ట్ర పన్నుల్లో జీపీకి స్థానమేది?

కొత్త పన్నుల వ్యవస్థలో(జీఎస్టీ-) తమ మధ్య ఉండే పన్నుల ఆదాయం మీద చర్చలు జరిపి ఒక ఒప్పందానికి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ వ్యవస్థకు స్థానం కల్పించలేదు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు ఏటా వేల కోట్ల రూపాయల పెరుగుదల తమ ‘పరిపాలనకు’ సాక్ష్యంగా చూపెడుతున్న ఈ రెండు పాలనా వ్యవస్థలు, అసలు గ్రామాల నుంచి చేస్తున్న వనరుల దోపిడీ గురించి చర్చించే అవకాశం లేదు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలు ప్రకృతి మీద ఆధారపడి నిర్మాణమయ్యాయి. ప్రకృతి వనరుల మధ్య ఉండే రుతుచక్ర వ్యవస్థల నుంచి అందే వస్తువులు, సేవలు లేకుంటే ఆధునిక ఆర్థిక వ్యవస్థలు పూర్తి స్థాయిలో పనిచేయలేవు.

ఒక సంవత్సరంలో వర్షాల లేమి వల్ల ఆర్థిక వ్యవస్థల మీద పడే ఒత్తిడి మనకు తెలిసిందే. నీరు, భూమి అవసరం లేని ఆర్థిక వ్యవస్థ లేదు. వాటిని అందించే ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు. పట్టణాలకు తిండి, నీరు, భూమి గ్రామాల నుంచే వస్తాయి. పట్టణాల విస్తృతికి చుట్టూ ఉండే గ్రామాలను బలవంతంగా విలీనం చేసుకోవడం ఈనాటి ప్రభుత్వాలు ఎంచుకున్న మార్గం. బ్రిటిష్ సామ్రాజ్యం విస్తృతికి భారత దేశం ఆక్రమించుకుని, తన మనుగడకు ఇక్కడి వనరులను దోచుకున్నది. అదే తీరులో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల్లో ఉండే వనరులను దోచుకునే వ్యవస్థలను నిర్మిస్తూ, ఆయా నిర్ణయాలు తామే తీసుకుంటూ సామ్రాజ్యవాద లక్షణాలను పుణికి పుచ్చుకున్నాయి. అయితే, దీనికి పెట్టిన సుందరమైన పేరు అభివృద్ధి.

-  డా. దొంతి నర్సింహా రెడ్డి, పాలసీ ఎనలిస్ట్