8ఏళ్లుగా చేస్తున్నది పాలన కాదు మోసం

8ఏళ్లుగా చేస్తున్నది పాలన కాదు మోసం

కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా:  సీఎం కేసీఆర్ 8 ఏళ్లుగా చేస్తున్నది పాలన కాదు మోసం అని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఎన్నికలు ఉన్నప్పుడు కేసీఆర్ పథకాలు ప్రకటించి, ఆ తర్వాత ఫాం హౌస్ కు వెళ్లిపోతాడని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ప్రతి పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజాప్రస్థానం పేరుతో షర్మిల చేస్తున్న పాదయాత్ర నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి చేరుకుంది. స్థానిక కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. 

వర్షంలోనే ప్రసంగాన్ని కొనసాగించిన షర్మిల

వైఎస్ షర్మిల తన ప్రసంగాన్ని వర్షంలోనే కొనసాగించారు. జోరుగా వర్షం కురుస్తున్నా ఏ మాత్రం తగ్గలేదు. ప్రజలు వారించినా.. తగ్గేదే లే అంటూ.. తాను వైఎస్ఆర్ బిడ్డనని గుర్తు చేశారు. ‘‘దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కదా.. వర్షానికి భయపడేదే లేదు.. ఎండకు.. వానకు.. వరదలకు భయపడేది లేదు.. అన్యాయాన్ని నిలదీస్తూనే ఉంటా..’’నని షర్మిల స్పష్టం చేశారు.  
ఉమ్మడి మహబూబ్ నగర్.. పాలమూర్ జిల్లా తీవ్ర కరవు కాటకాలతో వలసల జిల్లా అయిందని ఆనాడు సీఎం వైఎస్ గుర్తు చేసుకుని..  కల్వకుర్తి లిఫ్ట్.. భీమా.. నెట్టెంపాడు ప్రాజెక్టులు చేశారని షర్మిల గుర్తు చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో 70 వేల ఎకరాలకు నీళ్లు పారుతున్నాయంటే ఘనత వైఎస్ దేనన్నారు. 

కేసీఆర్ కు సవతి తల్లి ప్రేమ.. దక్షిణ తెలంగాణ అంటే 

సీఎం కేసీఆర్ కు దక్షిణ తెలంగాణ అంటే ఎలాంటి ప్రేమ లేదని.. సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడని షర్మిల విమర్శించారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు చేయాలి అనే డిమాండుతో నల్లబ్యాడ్జితో నిరసన  తెలియజేస్తున్నానని.. ఇంతటితో ఆగకుండా  మహబూబ్ నగర్ లో కనీసం 24 గంటలైనా నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు.  2018 ఎన్నికల్లో కేసీఆర్ ఎన్నో మోసపు మాటలు చెప్పి మభ్యపెట్టాడని షర్మిల ఆరోపించారు. 

గత ఎన్నికల హామీల వీడియో  ప్రదర్శించిన షర్మిల

2018 ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల వీడియోను సభలో ప్లే చేసి వినిపించారు. ‘‘జైపాల్ యాదవ్ ను గెలిపించండి.. కల్వకుర్తి నియోజకవర్గానికి .. 2 సంవత్సరాలలోపు 2 లక్షల ఎకరాలకు నీళ్లిస్తా.. ఇంజనీరింగ్ కాలేజీ కావాలంటున్నారు.. అమనగల్లు కు డిగ్రీ కాలేజీ..  పాలిటెక్నిక్ కాలేజీ అడుగుతున్నారు.. ఇస్తాం.. 50 పడకల నుంచి 150 పడకల ఆస్పత్రిగా పెంచుతాం.. ’’ అంటూ కేసీఆర్ ఇచ్చిన హామీల వీడియోను సభికులకు వినిపించారు. మొత్తం హామీలన్నీ వినిపించాలంటే సమయం చాలదంటూ షర్మిల ఎద్దేవా చేశారు.  పేనుకు పెత్తనం ఇస్తే.. నెత్తి అంతా కొరిగేసిందట అన్న చందంగా ఉందన్నారు.  మీ ఎమ్మెల్యే ఒక్క పనైనా చేశాడా.. ? అంటూ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.