ఏది రిటైర్‌‌మెంటో తెలిసింది!

ఏది రిటైర్‌‌మెంటో తెలిసింది!

ఉద్యోగం నుంచి రిటైర్‌‌మెంట్‌‌కు ఇంకా పదేండ్ల వ్యవధి ఉన్న ఉద్యోగి దగ్గరకు ఆ సాయంత్రమే రిటైర్‌‌ అవ్వాల్సిన ఉద్యోగి నిర్లిప్తంగా వచ్చి-‘మంచిది  బై’ అన్నాడు.  ‘ఎప్పుడూ చెప్పే బై కి ఇంత సీన్‌‌ అవసరమా?.  ఈరోజే రిటైర్‌‌ అవుతున్నట్లు మాడు మొహం వేసుకొని బై బై అంటున్నావ్‌‌’ అని ఇంకా పదేండ్ల సర్వీసు ఉన్న ఉద్యోగి అనగానే రిటైరవబోతున్న వ్యక్తి ‘రిటైర్డ్‌‌ హర్ట్‌‌’ అయ్యాడు. తన రిటైర్‌‌మెంట్‌‌ బాధకంటే తను ఆరోజు రిటైర్‌‌ అవుతున్న సంగతి జ్ఞాపకం ఉంచుకోని తోటి నడివయసు ఉద్యోగి ప్రవర్తన మరింత బాధను కలిగించింది. పదవీ విరమణ ఎవరికైనా కష్టమే. రాజకీయాల్లో ఉన్నవారికి పదవి వస్తున్నప్పుడు సంతోషం,- పోయినప్పుడు బాధ కలుగుతుంది. కానీ, మళ్లీ ఎప్పటికైనా ఏదో ఒకటి వస్తుందనే ఆశాభావంతో పదవీ విరమణను అంతగా పట్టించుకోరు. పట్టించుకున్నా చేసేది ఏమీలేదు అన్న భావన కొంతకాలం వారిని వెన్నాడినా - ‘మంచికాలం ముందున్నది’ అన్న ఆశతో జీవిస్తారు.

అయితే, ఉద్యోగుల పదవీకాలం ముగియగానే - అంతే సంగతులు. ఎవరికో అదృష్టవంతులకు రిటైర్‌‌ అయిన తర్వాత ఏదో ఒకటి రావచ్చు. - గవర్నమెంటు ఉద్యోగం పెద్దదయినా, చిన్నదయినా ఆ దర్పం వేరు,- హంగామా వేరు - ఆర్భాటం వేరు. నెత్తురు రుచి చూసిన పులికి చవకబారు చారు సహించదు.- గవర్నమెంట్‌‌ గవర్నమెంటే..- ప్రైవేట్‌‌ ప్రైవేటే. ఏదో ఒకటి అని సరిపెట్టుకోవటం తప్ప, రిటైర్‌‌ అయిన తర్వాత ఏంచేయాలి? ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏంచేసినా చేయకపోయినా చెల్లుబాటు అవుతుంది. టంచన్‌‌గా జీతం వస్తుంది. రిటైర్‌‌ అయిన తర్వాత పెన్షన్‌‌ (ఈమధ్య ఎక్కువనే వస్తున్నది) వచ్చినా ‘సాలరీ’తో సమానం కాదుకదా. 

ఆమ్యా-ఆమ్యాలు ఉండవుగా!

కొందరికి, బాపు సినిమాలో తీతా (తీసేసిన తాసిల్దార్‌‌) చెప్పినట్లుగా ఆమ్యా- ఆమ్యాలు ఇక ఉండవుగా!. అయితే, రిటైర్‌‌మెంటు తర్వాత జీవితం ఎందుకు సుఖమయం చేసుకోగూడదని కొందరు ప్రయత్నించారు. ఇద్దరు, ముగ్గురు కలిసి ఆ కాలనీలో రిటైర్‌‌ అయినవారి ఆరోగ్యాన్ని ఇంప్రూవ్‌‌ చేద్దామని అనుకొని తెల్లవారకమునుపే మరికొందరి రిటైర్‌‌ అయిన ఉద్యోగస్థుల తలుపు తట్టారు. కారణం వారిని ‘మార్నింగ్‌‌ వాక్‌‌’కు తీసుకొనిపోదామని. మార్నింగ్‌‌ వాక్‌‌ను మించిన మందు లేదని, ఉత్సాహానికీ.. ఉల్లాసానికీ  హార్లిక్స్‌‌,- బోర్నవిటాలను మించి పనిచేస్తుందని రిటైర్‌‌ అయిన ప్లేయర్స్,- వృద్ధ సినిమా నటులు చెప్పటం వల్ల ఆ మంచి పనికి పూనుకున్నారు. ఒక ఇల్లు తలుపు తెరుచుకోలేదు. కారణం వృద్ధ రిటైరీలు తలుపుకు తాళం వేసిన సంగతి గమనించకపోవటం వల్ల.  మరో ఇంటివారు దొంగలనుకొని భయపడి లోపల మరోతాళం వేసుకున్నారు. ఇంకో ఇంటి గృహిణి తలుపు తీస్తూనే - ‘‘వేళాపాళా లేదా? ఇంత పొద్దున్నే పాలపాకెట్ల సరఫరాకు’’ అని టపేల్న తలుపు వేసింది. ఇలాంటి నిరాశాజనక వాతావరణంలో ఆ ఇద్దరు ముగ్గురు నడవటానికి మనసొప్పక మళ్ళీ రేపు ప్రారంభిద్దాం. మనం యీ నడకను ఒక ‘ఇంప్లిమెంట్​బుక్‌‌ స్కీమ్‌‌’గా భావించి.. మధ్యాహ్నం వాళ్ళను కలిసి ఎడ్యుకేట్‌‌ చేసి రేపట్నించి నడుద్దాం అనుకున్నారు. పొద్దున్నే కాఫీ తాగకుండా ఎక్కడికి అఘోరించారు?. ఇప్పుడు మళ్ళీ కాఫీ ఇవ్వటం నావల్ల కాదన్న ధోరణిలో ‘బెటర్‌‌ హాఫ్‌‌’లు చిటపటలాడటంతో ముసుగేసారు. ఎందుకు గొడవ అని.
 
రిటైర్‌‌మెంట్‌‌ కష్టాలు 

ఉద్యోగం చేసే రోజుల్లో ‘పేరెంట్స్‌‌ -టీచర్స్‌‌’ మీటింగ్స్​కు పిల్లల స్కూళ్లకు వెళ్ళటం కుదరలేదు. ‘వైనాట్‌‌ టేక్‌‌ కేరాఫ్‌‌ చిల్డ్రన్‌‌’ అని అనుకుంటే ‘చిల్డ్రన్‌‌’ అంతా ‘ఓల్డ్​మెన్‌‌’ అయినట్లుగా గడ్డాలు, మీసాలు పెంచి అడ్డగోలుగా కనపడ్డారు. లాభం లేదనుకొని ఒకరిద్దరు పదవీ విరమణదారులు మనవళ్లు,- మనవరాళ్లతో కలిసి వాళ్ళ స్కూళ్లకు వెళ్దామనుకుంటే.. - తాతలూ! మీరు రావల్సిన అవసరం లేదు.  అవ్వన్నీ ఇప్పుడు ఫార్మల్‌‌ మీటింగ్స్‌‌ అయ్యాయి. మా టీచర్సు మా ఫ్రెండ్సులా ఉంటారు. వాళ్ళే అన్నీ రాసుకొని,- మా పేరెంట్స్ సంతకం పెట్టటం మాకువచ్చు కాబట్టి ఆ సంతకాలు మాతోనే పెట్టించుకొని మాటర్‌‌ క్లోజ్‌‌ చేస్తారు. మీరు వచ్చి వాళ్ళను ‘కన్‌‌ఫ్యూజ్‌‌’ చేయటం ఎందుకు? అని అడగటంతో ఆ నిర్వాకం గూడా మానుకున్నారు. ఇదిలా ఉంటే..మాలో ఒకాయన అత్యంత ఉత్సాహంతో బీరువాపైన ‘మన దుమ్మేగదా. దులుపుకుంటే పోలే.’ అనుకొని బీరువాకు నిచ్చెన వేసుకొని దుమ్ము విజయవంతంగా దులిపాడు. కానీ,- నిచ్చెన దిగే  ప్రయత్నంలో బొక్కబోర్లా పడి బొమికె విరగ్గొట్టుకొని, కట్టేసుకొని పడక ఎక్కాడు. ఈ తతంగంలో స్వర్గానికి నిచ్చెన మాత్రం తప్పించుకోగలిగాడు.  ‘డిగ్నిటీ ఆఫ్‌‌ లేబర్‌‌’ ప్రదర్శన ఆ దెబ్బకు మా గ్రూప్‌‌లోని వారు ఒకింత భయపడి విరమించుకున్నారు. 

జీవితంలో రిటైర్‌‌మెంట్‌‌ ఓ కామా,

రెండ్రోజుల తర్వాత ఆ అనుభవజ్ఞుడు మొహం వేళ్ళాడేసుకొని గ్రూప్‌‌ మీటింగ్‌‌లో కూర్చున్నాడు. ఏమయింది? నీ అనుభవం పనికి వచ్చిందా? అని ఫ్రాక్చరిస్టు అడిగాడు. ‘‘నా బొంద అనుభవం. ఉఫ్‌‌ అని నన్నూ, నా అనుభవాన్నీ ఊదేయటం ఒక్కటే తక్కువ. పొద్దున్నే అందరికీ కాఫీ తాగుతున్నప్పుడు - మీకే ఇబ్బందులు వచ్చినా అడగండి. - నా అనుభవంతో మీకు సహాయం చేయటానికి సిద్ధం’’ అన్నాను. నా పెద్ద కొడుకు కొడుకు ‘‘తాతా! నీవు ఉద్యోగంలో ఉన్నప్పుడే నా ఇంజనీరింగ్‌‌ సీట్‌‌ కోసం ట్రై చేయమంటే టాలెంట్‌‌ ముఖ్యం,- రికమండేషన్‌‌ కాదు అని మొహం మీద కొట్టినట్లు చెప్పావుగా!. అందునా ఉద్యోగం వెలగపెడ్తున్నప్పుడు వాడుకోని అనుభవం- ఇప్పుడు రిటైరయిన తర్వాత ఇంకేం పనికి వస్తుంది?’  అని హితబోధ చేశాడు. ‘రిటైరయిన తర్వాత ఎవరికీ సలహాలు ఇవ్వగూడదన్న అనుభవం- వాడు ‘సలహాలరావు తాతయ్య’ అని ఎగతాళి  చేసింతర్వాత వచ్చింది’’ నిట్టూరుస్తూ శూన్యంలోకి చూస్తూ అనుభవాల రావు అన్నాడు. మరునాడు ఉదయమే రిటైరయిన గ్రూప్‌‌లోని ఒక ఫ్రెండు అన్నాడు ‘నాకు ఉదయమే ఆకాశంలోకి చూస్తూ కాఫీ తాగుతున్నప్పుడు జ్ఞానోదయం అయింది. ‘రిటైర్‌‌మెంట్‌‌ అన్నది, జీవితం నుంచి రిటైర్‌‌ అయ్యే ముందు ఒక కామా లాంటిది.  జీవితమే అనిశ్చయమూ, తాత్కాలికమూ,- పర్మినెంట్‌‌గా రిటైర్‌‌ అయ్యేది అని తెలిసినప్పుడు..- ఉద్యోగంలోంచి రిటైర్‌‌మెంట్‌‌ ఏపాటిది?’ అని జీవితసత్యం చెప్పాడు. అంతే ఆనాటి నుంచి అసలైన విరమణ ముందు ఉద్యోగ విరమణను గురించి వారంతా ఆలోచించటం మానేశారు. 

పరుగో పరుగు

మనందరం గ్రూప్‌‌గా వెళ్ళి మన మిల్క్‌‌ పాకెట్లను మనమే ఎందుకు తెచ్చుకోగూడదన్న మరో ఆలోచన గ్రూప్‌‌లో ఒకరికి రావటంతో నెక్స్ట్​డే నుంచే అమలు చేద్దామనుకున్నాం. గ్రూప్‌‌ టాస్క్‌‌ బాగానే జరిగిందని అనుకుంటున్న తరుణంలో గభాలున అయిదు, ఆరు కుక్కలు మూకుమ్మడిగా వెంటబడ్డాయి. గ్రూప్‌‌ మొత్తం కకావికలమైంది. టాస్క్‌‌ ఫోర్స్​ఘోరంగా ఫెయిలయింది. పరుగో..పరుగు అన్నట్లు పరుగు లంకించుకున్నాం కానీ కొందరి కాళ్లు తడబడ్డాయి. కుక్కలు మాత్రం తరమటంలో తడబడలేదు. ఏమాత్రం వెనుకడుగేయలేదు.- పైగా భౌభౌమంటూ ఇద్దరి ముగ్గురి మీద వాటి తడాఖా చూపించటంతో వారికి బొడ్డు చుట్టూ ఇంజెక్షన్‌‌లు యీ యాక్టివిటీలో ‘బోనస్‌‌’గా మిగిలింది. ఇలా కాదు..ఇవ్వన్నీ కాదనుకొని ‘మనం పెద్దవాళ్ళమయ్యాం. బోలెడంత అనుభవం గడించాం.  మనవాళ్ళు ఎన్నో ప్రాబ్లెమ్స్‌‌ ఫేస్‌‌ చేస్తుంటారు. వాళ్లకు ధైర్యంచెప్పి,- మనం ఉన్నాం అన్న కాన్ఫిడెన్సు వాళ్ళకు ఇవ్వాలి’ అని ఒకడు సిన్సియర్‌‌గా అన్నాడు.  ‘ఆ పని నీవే మొదలుపెట్టు’ అని గ్రూప్‌‌లో ఇంకొకడు వెటకారం జోడిస్తూ అన్నాడు. అతను ఫ్రాక్చర్‌‌ కట్టును మోస్తున్నవాడు. 

- రావులపాటి సీతారాంరావు,  ఐపీఎస్​ (రిటైర్డ్)