మోడీ జీ 5 ఫైటర్ జెట్ల గురించి నిజం చెప్పండి..? రాహుల్ గాంధీ

మోడీ జీ 5 ఫైటర్ జెట్ల గురించి నిజం చెప్పండి..? రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: ఇటీవల భారత్, పాక్ మధ్య జరిగిన సైనిక దాడుల్లో ఐదు యుద్ధ విమానాలు కుప్పకూలాయని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపాయి. ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ప్రధాని మోడీని ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత్, పాక్ మధ్య జరిగిన సైనిక దాడుల్లో కూలిన ఐదు యుద్ధ విమానాల గురించి నిజం చెప్పండి మోడీ జీ.. దేశానికి నిజం తెలుసుకునే హక్కు ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రంప్ వీడియోను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా  పోస్ట్ చేశారు రాహుల్. ‘‘మోడీ జీ ఐదు జెట్‌ల గురించి నిజం ఏమిటి..? దేశానికి తెలుసుకునే హక్కు ఉంది’’ అని ప్రశ్నించారు. 

కాగా, శనివారం (జూలై 19) రిపబ్లికన్ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన డిన్నర్ సందర్భంగా ట్రంప్ భారత్, పాక్ యుద్ధం ప్రస్థావన తీసుకొచ్చారు. ఇండియా-పాక్ యుద్ధంలో 5 ఫైటర్ జెట్లు కూలిపోయాయన్న ట్రంప్.. ఆ కూలిన ఐదు జెట్లు ఏ దేశానివనే విషయం మాత్రం రివీల్ చేయకుండా సస్పెన్స్‎లో పెట్టారు. దీంతో ట్రంప్ చెప్పినట్లుగా యుద్ధంలో కూలిపోయిన విమానాలు ఏ దేశానివనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ట్రంప్ చెప్పిన ఐదు ఫైటర్ జెట్ల గురించి నిజం ఏమిటో చెప్పాలని ప్రధాని మోడీని నిలదీశారు రాహుల్ గాంధీ. 

2025, ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో భారత పౌరులు 26 మంది చనిపోయారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్తాన్‎తో పాటు పీవోకేలోని 9 టెర్రిరిస్ట్ క్యాంపులపై భారత సైనిక దళాలు మెరుపు దాడులు చేశాయి. ఈ దాడుల్లో పాక్ ఫైటర్ జెట్లను కూడా ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. కానీ పాక్ మాత్రం ఎప్పటిలాగా తన వక్ర బుద్ధి ప్రదర్శించింది. భారత్ చేతిలో చావు దెబ్బ తిన్నప్పటికీ అంతర్జాతీయ సమాజం ముందు పరువు కోసం ఇండియాకు సంబంధించిన ఫైటర్ జెట్లను కూల్చేశామని పాక్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించుకుంది.

కానీ ఆధారాలు మాత్రం చూపెట్టలేకపోయింది. పాక్ ఆరోపణలను భారత్ ఎప్పటికప్పుడూ తిప్పికొట్టింది. ప్రతిపక్ష పార్టీలు కూడా ఆపరేషన్ సిందూర్‎లో భారత్ ఎన్ని ఫైటర్ జెట్లు కోల్పోయిందో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఇండియాకు సంబంధించిన ఒక్క జెట్ కూడా కూలిపోలేదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కానీ తాజాగా ట్రంప్ వ్యాఖ్యలు పాక్, ప్రతిపక్ష పార్టీల మాటలకు బలాన్ని చేకూర్చేలా ఉండటంతో దీనిపై మళ్లీ కొత్త చర్చ మొదలైంది.