వాట్సాప్ డేటా లీక్ : 84 దేశాలకు చెందిన 48 కోట్ల మంది నంబర్లు అమ్మకానికి ? !

వాట్సాప్ డేటా లీక్ : 84 దేశాలకు చెందిన 48 కోట్ల మంది నంబర్లు అమ్మకానికి ? !

వాట్సాప్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు వినియోగిస్తున్న హాట్ ఫేవరేట్ మెసేజింగ్ యాప్.  అయితే  దాదాపు 48.7 కోట్ల  వాట్సాప్ నంబర్లకు సంబంధించిన భారీ డేటా లీక్ అయిందంటూ వెలువడిన ఓ సైబర్‌న్యూస్‌ నివేదిక కలకలం సృష్టిస్తోంది. నవంబరు 16న ఒక హ్యాకింగ్‌ కమ్యూనిటీ ఫోరమ్‌లో ‘అమ్మకానికి 48.7 కోట్ల  వాట్సాప్ నంబర్లు’ అనే ప్రకటనను ప్రచురించినట్లు ఆ సైబర్ న్యూస్ లో ప్రస్తావించారు. భారత్, అమెరికా, యూకే, ఈజిప్టు, ఇటలీ, సౌదీఅరేబియా సహా 84 దేశాలకు చెందిన వాట్సాప్ వినియోగదారుల నంబర్లు ఈ డేటాలో ఉన్నట్లు పేర్కొన్నారు. 

ఈజిప్టు నుంచి 4.5 కోట్ల మంది నంబర్లు..

ఈజిప్టు నుంచి 4.5 కోట్ల మంది, ఇటలీ నుంచి 3.5 కోట్ల మంది, అమెరికా నుంచి 3.2 కోట్ల మంది, సౌదీ అరేబియా నుంచి 2.9 కోట్ల మంది, ఫ్రాన్స్‌ నుంచి 2 కోట్ల మంది, టర్కీ నుంచి 2 కోట్ల మంది, యూకే నుంచి 1.1కోట్ల మంది, రష్యా నుంచి దాదాపు కోటి మంది వాట్సాప్‌ నంబర్లు లీకయ్యాయని కథనంలో వివరించారు.

ఒక్కో దేశానికి ఒక్కో రేటు కట్టి..  

అయితే  ఒక్కో దేశానికి చెందిన వారి వాట్సాప్ నంబర్లకు ఒక్కో రేటు కట్టి అమ్ముతున్నారని తెలిపారు. అమెరికా వాస్తవ్యుల వాట్సాప్ నంబర్లు అయితే 7వేల డాలర్లు, బ్రిటన్ కు చెందిన వారి వాట్సాప్ నంబర్లు అయితే 2500 డాలర్లు, జర్మనీ వాట్సాప్ వినియోగదారుల నంబర్లు అయితే 2వేల డాలర్లకు అమ్ముతున్నట్లు కథనంలో పేర్కొన్నారు. ఒకవేళ ఈ వాట్సాప్ నంబర్లను సైబర్ కేటుగాళ్లు కొనుక్కుంటే.. ఫేక్ కాల్స్,  ప్రమాదకర లింక్ లతో కూడిన మెసేజ్ లు, మెయిల్స్ ద్వారా హ్యాకింగ్ కు తెగబడే ముప్పు ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.