2 నెలల్లో వాట్సప్‌ పేమెంట్‌ సర్వీస్‌

2 నెలల్లో వాట్సప్‌ పేమెంట్‌ సర్వీస్‌

ఎన్‌‌పీసీఐ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ దిలీప్‌‌ ఆస్బె వెల్లడి
వాట్సప్‌‌ పేమెంట్స్‌‌తో డిజిటల్‌ పేమెంట్స్‌‌ పెరుగుతాయని అంచనా
కిందటేడాది నుంచే వాట్సాప్ పేమెంట్ బేటా వెర్షన్
ప్రస్తుతం 10 లక్షల మందికి పరిమితం

ముంబై : ఫేస్‌‌బుక్‌‌ అధీనంలోని మెసేజింగ్‌‌ దిగ్గజం వాట్సప్‌‌ త్వరలోనే ఇండియాలో పేమెంట్‌‌ సర్వీసులు మొదలెట్టనుంది. రాబోయే రెండు నెలల్లో ఈ కంపెనీ డేటా లోకలైజేషన్‌‌ నిబంధనలను నెరవేర్చనుంది. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న పేమెంట్‌‌ సర్వీసులను ఆ తర్వాత ప్రారంభించడం వాట్సప్‌‌కు వీలవుతుందని నేషనల్‌‌ పేమెంట్స్‌‌ కార్పొరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా వెల్లడించింది. వాట్సప్‌‌ పేమెంట్‌‌ సర్వీసులు మొదలైనా ఇండియాలో ఇంకా క్యాష్‌‌ హవానే కొనసాగుతుందని ఎన్‌‌పీసీఐ చీఫ్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ దిలీప్‌‌ ఆస్బె తెలిపారు. డిజిటల్‌‌ చెల్లింపులు దేశంలో ఊపందుకోవాలంటే ఇప్పుడున్న యూజర్ల సంఖ్య మరో మూడు రెట్లు పెరిగి 30 కోట్లకు చేరాలని చెప్పారు.

ఇండియాలో కిందటేడాది నుంచే వాట్సప్‌‌ పేమెంట్‌‌ సర్వీసెస్‌‌ బేటా వెర్షన్‌‌ను నడుపుతోంది. 30 కోట్ల యూజర్లు సహా చాలా మంది వాట్సప్‌‌ పేమెంట్‌‌ సర్వీసెస్‌‌ రాకను ఆసక్తిగా గమనిస్తున్నారు. చైనాలో వుయ్‌‌ఛాట్‌‌ తరహాలో ఇండియాలో వాట్సప్‌‌ డిజిటల్‌‌ చెల్లింపులకు పెద్ద ఊపు ఇస్తుందని భావిస్తున్నారు. గూగుల్‌‌, వాట్సప్‌‌ రెండు ఇంటర్మీడియరీల పేమెంట్‌‌ సర్వీసులు పెండింగ్‌‌లో ఉన్నాయని,  వాట్సప్‌‌ రాబోయే రెండు నెలల్లో పేమెంట్‌‌ సర్వీసెస్‌‌ లాంఛ్‌‌కు సిద్ధమవుతుందని ఆస్బె వెల్లడించారు. ఈ రెండు నెలల్లో డేటా లోకలైజేషన్‌‌ నిబంధనలను పూర్తి స్థాయిలో వాట్సప్‌‌ నెరవేర్చగలుగుతుందని చెప్పారు.

వాట్సప్‌‌ తన పేమెంట్‌‌ సర్వీసెస్‌‌ను ప్రస్తుతం 10 లక్షల మందికే పరిమితం చేసింది. రిజర్వ్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఆర్‌‌బీఐ) డేటా లోకలైజేషన్‌‌ నిబంధనలను పూర్తిగా ఇంకా నెరవేర్చకపోవడం వల్లే కంపెనీ ఈ పరిమితి పాటించాల్సి వస్తోంది. ఆడిటర్ల పరిశీలన పూర్తయిన తర్వాత రివ్యూ చేసి ముందుకు వెళ్తామని ఆస్బె చెప్పారు. ఇండియాలోని యూజర్ల ట్రాన్సాక్షన్‌‌, యూజర్‌‌ డేటాను ఇక్కడే ఉంచాలని, విదేశీ సర్వర్ల నుంచి 24 గంటలలోపు తొలగించాలని విదేశీ కంపెనీలపై ఆర్‌‌బీఐ రూల్స్‌‌ పెట్టింది. వాట్సప్‌‌ డేటా లోకలైజేషన్‌‌ కంప్లయన్స్‌‌ మీద ఆర్‌‌బీఐ నియమించిన  థర్డ్‌‌ పార్టీ సంస్థ ఆడిట్‌‌ జరుపుతోందని, అది పూర్తియిన తర్వాత రివ్యూ చేసి, వాట్సప్‌‌ ముందుకు వెళ్లడానికి అనుమతిస్తామని తెలిపారు. వాట్సప్‌‌ ఉన్నతాధికారులు ఇటీవల ముంబైకి వచ్చినప్పటికీ, తాను వారిని కలవలేదని ఆస్బె వెల్లడించారు.

 అమెజాన్‌‌ పే, ట్రూకాలర్‌‌ సంస్థలు కూడా…

షియోమి, అమెజాన్‌‌ పే, ట్రూకాలర్‌‌ సంస్థలు కూడా పేమెంట్‌‌ సర్వీసెస్‌‌ కోసం అప్లికేషన్‌‌ పెట్టాయని, కానీ ఇంకా డేటా లోకలైజేషన్‌‌ నిబంధనలను నెరవేర్చలేదని పేర్కొన్నారు. యూనిఫైడ్‌‌ పేమెంట్స్‌‌ ఇంటర్‌‌ఫేస్‌‌ (యూపీఐ) కింద జరుగుతున్న ట్రాన్సాక్షన్స్‌‌లో ముప్పావు వంతు  రూ. 100 లోపువే ఉంటున్నట్లు నీతి ఆయోగ్‌‌ సర్వేలో తేలిందని ఆస్బె చెప్పారు. ఇక్కడే యూపీఐ మరింతగా చొచ్చుకుపోయి, నగదు రహిత లావాదేవీలకు ఊతమివ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.  ఎన్‌‌పీసీఐ అభివృద్ధి చేసిన యూపీఐ ప్లాట్‌‌ఫామ్‌‌  వినియోగం వాట్సప్‌‌ వంటి దిగ్గజాల రాకతో మరిన్ని రెట్లు పెరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పెద్ద సంస్థల ఎంట్రీతో దేశంలో డిజిటల్‌‌ చెల్లింపుల రూపు రేఖలు మారే అవకాశం ఉందన్నారు. ఇండియాలో డిజిటల్‌‌ పేమెంట్స్‌‌కు ప్రస్తుతం 10 కోట్ల మంది యూజర్లున్నారు. క్యాష్‌‌ రహితంగా మారాలంటే ఈ సంఖ్య కనీసం 30 కోట్లకు పెరగాలని ఆస్బె చెప్పారు. ఇదే పెద్ద సవాలని పేర్కొన్నారు.

విదేశాలలోనూ చెల్లింపులకు యూపీఐ….

యూపీఐ వాడకాన్ని పెంచేందుకు ట్సాక్స్‌‌ ఇన్సెంటివ్స్‌‌ కల్పించడానికి బహుశా మరి కొంత సమయం పడుతుందని ఆస్బె చెప్పారు. వాడకం పెంచడానికి క్యాష్‌‌ బ్యాక్‌‌లు ఇవ్వడం సరైనదేనని పేర్కొన్నారు. విదేశాలలోనూ చెల్లింపులు జరిపేందుకు అనువైనదిగా యూపీఐని మలుస్తున్నట్లు తెలిపారు. సింగపూర్ యూఏఈలలో మార్చి 2020 నాటికి యూపీఐ సర్వీసెస్ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ రెండు దేశాలలోనూ ఎన్​ఆర్​ఐలు ఎక్కువని అన్నారు. ఎన్‌‌పీసీఐ తెచ్చిన రూపే కార్డులకు స్పందన బాగుందని, మార్కెట్లో విలువ, ట్రాన్సాక్షన్స్‌‌ పరంగా రూపే కార్డులకు 30 శాతం వాటా ఉందని చెప్పారు. యాక్సిస్‌‌ బ్యాంక్‌‌, ఐసీఐసీఐ బ్యాంక్‌‌ త్వరలో రూపే కార్డులను లాంఛ్‌‌ చేయనుండటంతో దేశంలో రూపే కార్డుల సంఖ్య భారీగా పెరుగుతుందని ఆస్బె తెలిపారు.

డిజిటల్ పేమెంట్ యూజర్లు 10 కోట్ల మంది..

యూపీఐ యాక్సెప్టెన్స్‌‌ బాగా పెరిగిందని, 30 లక్షల పాయింట్స్‌‌ ఆఫ్‌‌ సేల్‌‌ (పీఓఎస్‌‌) మెషీన్లు, మరో  కోటి క్యూఆర్‌‌ కోడ్స్‌‌ ప్రస్తుతం యాక్టివ్‌‌గా ఉన్నాయన్నారు. నగదు వాడకం బాగా తగ్గాలంటే, పీఓఎస్‌‌, క్యూఆర్‌‌ కోడ్స్‌‌ సంఖ్య కనీసం అయిదు రెట్లు పెరగాల్సి ఉంటుందని చెప్పారు. గత మూడేళ్లలో డిజిటల్‌‌ పేమెంట్‌‌ యూజర్ల సంఖ్య 10 కోట్లకు పెరిగిందని, ఈ ఎకో సిస్టమ్‌‌ మరింత విస్తరించడం కొంత కష్టమైనదేనని అభిప్రాయపడ్డారు. కొత్తగా 20 కోట్ల మందిని డిజిటల్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌పైకి తేవడం, బ్యాంకులు, ఇతర సంస్థలతోపాటు తమకూ ఛాలెంజేనని అన్నారు. ఈ రంగంలో బ్యాంకులు, ఫిన్‌‌టెక్‌‌ కంపెనీలే ఎక్కువ చొరవ తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

రూ. 500 లోపు అంటే చిన్న చిన్న చెల్లింపులకు యూపీఐ ఆధారమవుతుందని, మిగిలిన పేమెంట్స్‌‌కు కార్డులు ఎటూ ఉంటాయన్నారు. డిజిటల్‌‌ యూజర్లలో 5 శాతం మందే పేమెంట్స్‌‌కు స్కాన్‌‌ బేస్డ్‌‌ ఫీచర్లను వాడుతున్నారని, చైనాలో ఒక రోజుకు 60 కోట్లకు పైగా స్కాన్‌‌ బేస్డ్‌‌ ట్రాన్సాక్షన్స్‌‌ జరుగుతున్నాయని ఆస్బె తెలిపారు. యూపీఐ ప్లాట్‌‌ఫామ్‌‌ థర్డ్‌‌ వెర్షన్‌‌ తెచ్చే ఆలోచనేదీ ఎన్‌‌పీసీఐకి ప్రస్తుతం లేదని స్పష్టం చేశారు. పాన్‌‌ వెరిఫికేషన్‌‌ వంటి అదనపు ఫీచర్లను యాడ్ చేయనున్నట్లు తెలిపారు.