
ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిని కబళిస్తున్నాయి. వాడడం తేలికగా ఉంటోందని ప్లాస్టిక్ కవర్లను ప్రతిదానికి వాడుతున్న మనిషి చివరికి ఆ ప్లాస్టిక్ వ్యర్థాలే తన అస్తిత్వానికి ముప్పు తెస్తున్నా, మానుకోలేని దుర్భర స్థితిలోకి వెళ్లిపోయాడు. ప్లాస్టిక్ కవర్లు గత 2 దశాబ్ధాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్యాకింగ్ రంగంతోపాటు మానవుల నిత్యజీవితంలో ఒక భాగమయ్యాయి. నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఆహార పదార్థాలు, పండ్లు ఇలా ప్రతిదానిని ఇంటికి తీసుకెళ్లడానికి ప్లాస్టిక్ కవర్లపైనే ఆధారపడుతున్నారు. ప్లాస్టిక్ కవర్లు లేనిదే పని జరగదు అనే పరిస్థితి దాపురించింది. వినియోగానికి సులువుగా వున్న ప్లాస్టిక్ కవర్ వినియోగం తరువాత చెత్తకుప్పలోకి వెళుతోంది. ఒక మనిషి ఒక ప్లాస్టిక్ కవరును వినియోగించే సమయం కేవలం 12 నిమిషాలు మాత్రమే అని ఒక అధ్యయనం సారాంశం. ఇలా ఒకసారి వాడి పారేసి పునర్వినియోగానికి ఉపయోగించకపోవడం వలన ప్లాస్టిక్ వ్యర్థాలు కొండలు కొండలుగా పెరిగిపోతున్నాయి.
పెట్రోలియం ముడి పదార్థాలతో తయారయ్యే ఈ ప్లాస్టిక్ కవర్లు భూమిలో కరగడానికి వందల సంవత్సరాలు పడుతుందని శాస్త్రజ్ఞులు, పర్యావరణవేత్తలు గత 2 దశాబ్దాలుగా చెబుతూనే వున్నారు. కేవలం కొద్ది నిమిషాలపాటు వినియోగించి పారేసే ప్లాస్టిక్ కవర్ల వ్యర్థాలు పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. గృహావసర వ్యర్థాలు, ఇతర వ్యర్థాలు అన్నింటినీ ప్లాస్టిక్ కవర్లలో చుట్టి చెత్తకుప్పలలో వేయడం వలన అవి భూమిలో కలవకపోగా నాళాల ద్వారా జలవనరులైన చెరువులు, వాగులు, కుంటలు, నదులు చివరకు సముద్రాలలో చేరి కాలుష్యాన్ని పెంచుతున్నాయి. నీటి వనరులలో పేరుకుపోతున్న ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు మైక్రోప్లాస్టిక్‌గా రూపాంతరం చెంది భూమిపై ఉన్న ప్రతిదాంట్లోకి జొరబడుతోంది. ఇప్పటికే సముద్రాలన్నీ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయాయి. క్రమంగా కరిగిపోయి మైక్రోప్లాస్టిక్ గా రూపాంతరం చెంది, అది కాస్తా సముద్రజీవుల పొట్టల్లో చేరుకుంటోంది. దీనివల్ల ఆయా జీవరాశుల మనుగడ దెబ్బతింటోంది. అంతేకాకుండా అనేక సముద్ర జీవులు ఆహారంగా తీసుకునే పైటోప్లాంక్టన్ అనే మెరైన్ ఆల్గేను కూడా మైక్రోప్లాస్టిక్ నాశనం చేస్తోంది.
ప్లాస్టిక్ వ్యర్థాల గుట్టలు
ఇప్పటికే మనం వాడి పారేసిన ప్లాస్టిక్ వ్యర్థాల గుట్టలు మరోరూపంలో మనపై విరుచుకుపడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాల్లోనూ తాగునీటి నమూనాలు సేకరించి పరీక్షించగా 83శాతం నమూనాల్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయట. ఈ తరహా నీటి కాలుష్యంలో అమెరికా, లెబనాన్ తర్వాత మూడోస్థానంలో మనదేశం ఉంది. భూమి మీద ఎక్కడ పడితే అక్కడ చెత్తకుప్పల్లో కనిపించడమే కాక జల వనరులన్నిట్లోనూ చేరిన ప్లాస్టిక్ నాశనమయ్యే క్రమంలో కంటికి కనపడని సూక్ష్మరేణువులుగా విడిపోయి, అదే మొక్కల ద్వారా, జలచరాల ద్వారా మన ఆహారంలోకీ, నీటి ద్వారా నేరుగా మన ఒంట్లోకి ప్రవేశిస్తోందని పరిశోధనలు తెలుపుతున్నాయి. న్యూ మెక్సికో ల్యాబ్ పరిశోధకులు చేసిన పరిశోధన వలన తెలిసిన విషయం ఏమిటంటే వారు అధ్యయనం చేసి ప్రతి మెదడులోనూ ఐదు సీసా మూతలతో సమానమైన ప్లాస్టిక్ అణువుల్ని గమనించామని ప్రకటించారు. ఒక అధ్యయనం ప్రకారం ప్రతి వ్యక్తి వారానికి ఐదు గ్రాముల ప్లాస్టిక్‌ను ఆహారంతోపాటూ తీసుకుంటున్నారట. దీనిని నివారించడానికి దశాబ్దం క్రితమే సింగిల్ యూజ్ (ఒకసారి వాడి పారేసే) ప్లాస్టిక్‌ను కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. తరువాత షరా మామూలే.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం
2022 జులై 1 నుంచి దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ కవర్లతో పాటు కూరగాయలు, మాంసం తెచ్చేందుకు వినియోగించే ప్లాస్టిక్ సంచులు, కొబ్బరిబోండాలు, పండ్లరసాలు తాగేందుకు వాడే స్ట్రాలు.. అల్పాహారం, భోజనం చేసే ప్లాస్టిక్ ప్లేట్లు, టీ తాగే గ్లాసులు, స్పూన్లు, ఫోర్కులు, ఇయర్ బడ్స్, పాల ప్యాకెట్లు, నీళ్ల సీసాలు ఇలా ఇవన్నీ ఒకసారి వాడి పడేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కిందకే వస్తాయి. భారతదేశంలో సగటున ఏటా 1650 కోట్ల కిలోల ప్లాస్టిక్ ను వినియోగిస్తున్నారట. ఇది 16 లక్షల ట్రక్కుల లోడు సమానం. మనదేశంలో తలసరిన ఏడాదికి 11 కిలోల ప్లాస్టిక్ వాడి పారేస్తున్నాం. ఇంత వాడితేనే రోజుకు 26 వేల టన్నుల ప్లాస్టిక్ చెత్త తయారవుతోంది. కేవలం ఫుడ్ డెలివరీ వల్లనే సగటున నెలకు 22 వేల టన్నుల ప్లాస్టిక్ చెత్త తయారవుతోందని ఓ లెక్క. ప్రపంచంలో ప్లాస్టిక్ కాలుష్యం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 15వ స్థానంలో వుంది. ఇక రాష్ట్రాల దాకా వస్తే మనదేశంలో కొన్ని రాష్ట్రాలు ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నాయి.
టన్నులకొద్దీ వ్యర్థాలు
రాష్ట్రం విషయానికి వస్తే రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గత రెండుమూడేళ్ల క్రితమే రోజుకు 1300 టన్నుల వ్యర్థాలు పోగయ్యేవి. ఎక్కువశాతం జిహెచ్ఎంసి నుంచే వచ్చేది. 2019-–20తో పోలీస్తే రాష్ట్రంలో 160 శాతం వ్యర్థాలు పెరిగినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) వార్షిక నివేదిక వెల్లడించింది. ఇది ఆందోళనకరమైన అంశమే. రాష్ట్రంలో సగటును రోజుకు, ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి టన్నుల్లో 2018-–19 గాను 501.40 టన్నులు, 2019–-20 గాను 640.14 టన్నులు, 2020-–21కు గాను 1295.00 టన్నులు, ప్రస్తుతానికి 2025కి తీసుకుంటే ఈ మొత్తం రోజుకు దాదాపు 1300 టన్నుల ప్లాస్టిక్ చెత్త ఉత్పత్తి అవుతోంది. అయితే మిగతా వస్తువులతో పోలిస్తే ఒకసారి వాడి పారేసే వస్తువులు చేసే హాని మరీ ఎక్కువ. మనం అవసరానికి వాడుకుని నిర్లక్ష్యంగా పారేస్తున్న ఆ వస్తువులన్నీ రకరకాల మార్గాల్లో నీళ్లలో, ఆహారంలో కలిసే మళ్లీ మన శరీరంలోకే వస్తున్నాయి. కొండల్లా పేరుకుపోతున్న ప్లాస్టిక్ చెత్తను ఏం చేయాలన్నది పెద్ద సమస్యలా మారింది.
- మోతె రవికాంత్,
అధ్యక్షుడు,
సేఫ్ ఎర్త్ ఫౌండేషన్