ఐరన్​ లోపానికి చిక్కకుండా.. 

ఐరన్​ లోపానికి చిక్కకుండా.. 

పిండి కొద్దీ రొట్టె అన్నట్టు... తినే తిండిని బట్టే ఆరోగ్యం. ఎంత ఎక్కువ హెల్దీ ఫుడ్​ తింటే ఆరోగ్యానికి అంత మంచిది. మరీ ముఖ్యంగా మినరల్స్​తో నిండిన ఫుడ్​ తింటే హెల్త్​కి  ఎలాంటి ఢోకా ఉండదు. ఒకవేళ  బాడీలో మినరల్స్​ తగ్గితే కండరాలు, ఎముకల ఆరోగ్యం గండంలో పడినట్టే. గుండె, బ్రెయిన్​, కిడ్నీ, లివర్​ ఇలా ప్రతి  బాడీ పార్ట్​పైనా మినరల్స్​ డెఫిషియెన్సీ ఎఫెక్ట్​ పడుతుంది. మరీ ముఖ్యంగా  బాడీలో ఐరన్​ సరిపడా లేకపోతే స్ట్రెస్​, యాంగ్జైటీ మెదడుని  అల్లుకుంటాయి. మతిమరుపు తలుపు తడుతుంది. అసలు ఐరన్ లోపాని​కి, మెంటల్​ హెల్త్​కి  లింక్​ ఏంటి? అన్నదేగా అందరి ప్రశ్న. అక్కడికే వస్తున్నాం.  

యాంగ్జైటీ, ప్యానిక్​ ఎటాక్స్​, డిప్రెషన్, మతిమరుపు లాంటివన్నీ ఐరన్​ డెఫిషియెన్సీకి సిగ్నల్స్. ‘సైకియాట్రి అండ్ క్లినికల్ న్యూరో సైన్స్’​  రీసెర్చ్​ ప్రకారం ఐరన్​ లోపం వల్ల సైకలాజికల్​గా చాలా డిస్టర్బెన్స్​లు వస్తాయి. ‘ఫోర్టీస్​ మెమోరియల్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్’​కి చెందిన క్లినికల్​ న్యూట్రిషనిస్ట్​ ‘దీప్తి ఖతుజ’ కూడా ఈ మాటే చెబుతున్నారు. ఐరన్​కి , సైకలాజికల్​ సమస్యలకి సంబంధం ఏంటో కూడా  చెప్పారామె. 
లింక్​ ఏంటంటే..
శరీరంలో ఎర్ర రక్త కణాల తయారీలో ఐరన్​దే ‘కీ’ రోల్​.  ఆక్సిజన్​​ శరీరంలోని ప్రతి ఆర్గాన్​కి​ చేరుతుందో లేదో తెలుసుకోవడానికి  సాయ పడుతుంది ఐరన్​​. ఒకవేళ ఇది బాడీలో సరిపడా లేకపోతే ఆ ప్రాసెస్​కి ఆటంకం కలిగి ఫిజికల్​గా చాలా ఇబ్బందులొస్తాయి. అంతేకాదు ఐరన్​ లోపం వల్ల  సరిగా ఆక్సిజన్​ అందక  మెదడు ఏ పనిపైనా ఫోకస్​ చేయలేదు. రోజువారీ యాక్టివిటీస్​ని కూడా మర్చిపోతుంది. మూడ్ స్వింగ్స్​, చిరాకు రోజురోజుకి ఎక్కువ అవుతాయి. పోనుపోను అవి యాంగ్జైటీ, డిప్రెషన్​లకి దారితీస్తాయి. 
ఫ్రస్ట్రేషన్​ పెరుగుతుంది
ఐరన్​ లోపం ఉంటే  రోజంతా అలసటగానే అనిపిస్తుంది. ఎక్కువ రోజులు ఆ జోన్​లో ఉండటం వల్ల ఫ్రస్ట్రేషన్​ కూడా పెరుగుతుంది. ఇదే విషయాన్ని ‘జర్నల్​ ఆఫ్​ న్యూట్రిషనల్​ సైన్స్​ స్టడీ’ కూడా చెప్తోంది. ఈ స్టడీలో భాగంగా ​ ఐరన్​ లోపం ఉన్నవాళ్లకి కొద్ది రోజుల పాటు సంప్లిమెంట్స్​ ఇచ్చారు. రెగ్యులర్​గా సప్లిమెంట్స్​ తీసుకున్న వాళ్లలో అలసట తగ్గడమే కాదు మెంటల్​ హెల్త్​ కూడా బెటర్​ అవ్వడం గమనించారు అంటోంది న్యూట్రిషనిస్ట్​ దీప్తి .  ఈ ఐరన్​ లోపం నుంచి బయటపడటానికి  ఎలాంటి ఫుడ్​ తినాలో కూడా చెప్పారామె. 
ఏం తినాలంటే.. 
ఐరన్​ లోపంతో బాధపడేవాళ్లు రోజువారీ డైట్​లో ఐరన్​ ఎక్కువగా ఉండే ఫుడ్​ని చేర్చాలి. ఆకుకూరలు, నల్ల శెనగలు, చుడ్వా( మరమరాలు, అటుకుల పోహా) , అల్లం ఎక్కువగా తినాలి. చికెన్​​, చేపలు​ కూడా  రెగ్యులర్​గా తినాలి. కేవలం ఐరన్​ ఉన్న ఫుడ్​ తింటే సరిపోదు. శరీరం ఐరన్​ని అబ్జార్బ్​ చేసుకోవడానికి సాయ పడే విటమిన్​–సి ని కూడా  తీసుకోవాలి. విటమిన్​– సి ఎక్కువగా ఉండే సిట్రస్​ ఫ్రూట్స్​, బ్రొకోలీ, ఆలుగడ్డ , బ్లాక్ క్యారెట్​, పెప్పర్​, క్యాబేజీ  వీలైనంత ఎక్కువ తినాలి. పులియబెట్టిన, నానబెట్టిన ఫుడ్​, ఐరన్​ లాంటి  న్యూట్రియెంట్స్​ని శరీరం త్వరగా అబ్జార్బ్​ చేసుకునేలా చేస్తుంది. అందుకే రెగ్యులర్​గా మొలకెత్తిన పెసలు, శెనగలు, బొబ్బర్లు, కందులతో పాటు​ క్యాబేజీ పచ్చడి తినాలి. తిన్న వెంటనే టీ, కాఫీలు తాగితే శరీరం న్యూట్రియెంట్స్​ని సరిగా తీసుకోలేదు. అందుకే భోజనానికి, టీ , కాఫీలకి కనీసం ఒక గంట గ్యాప్​ ఇవ్వాల్సిందే అన్నారు న్యూట్రిషనిస్ట్​ దీప్తి ఖతుజ.