ఫుడ్ ​ప్యాకెట్లపై ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ముద్రిస్తరు?

ఫుడ్ ​ప్యాకెట్లపై ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ముద్రిస్తరు?
  • ఫుడ్ ​ప్యాకేజ్‌లపై ఇన్ఫో లేబుల్ ఎప్పుడు?
  • ముందుకు కదలని లేబులింగ్​ పాలసీ
  • లిమిట్‌కు మించి కొవ్వు, సాల్ట్‌, షుగర్‌‌ ఉంటే హైలైట్‌ చేయాలి
  • సేల్స్‌ తగ్గిపోతాయంటున్న కంపెనీలు 

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: ‘70% ఫ్యాట్​ ఫ్రీ’, ‘హై ఫైబర్‌‌‌‌’, ‘నో షుగర్‌‌‌‌’ అంటూ ప్యాకేజ్డ్‌‌ ఫుడ్స్‌‌ను అమ్మే కంపెనీలు యాడ్స్‌‌ ఇస్తుంటాయి. చాలా మంది  ప్రోడక్ట్‌‌పై లేబుల్స్‌‌ను పెద్దగా పట్టించుకోరు. ఇవి అర్థం కావు కూడా.  దీనినే ఫుడ్​ ప్రొడక్ట్స్​  కంపెనీలు తమకు అనుకూలంగా  మలుచుకుంటున్నాయి. తమకు నచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. వీటికి చెక్ పెట్టే చట్టం ఒకటి రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఏదైనా ప్రొడక్ట్‌‌లో కొవ్వు, సాల్ట్‌‌ లేక మరేమైనా కంటెంట్‌‌ మోతాదుకు మించి ఉంటే ప్యాకేజి ముందువైపు రెడ్ లేబుల్‌‌తో వార్నింగ్ ఇవ్వాలని గతంలో ప్రభుత్వం ఓ ప్రపోజల్‌‌ రెడీ చేసింది.  ఏయే కంటెంట్‌‌ లిమిట్‌‌కు మించి ఉందో  వాటి గురించి రెడ్‌‌ డాట్‌‌తో కంపెనీలు హైలైట్‌చేయాలని ప్రపోజల్‌‌లో పేర్కొంది. ఈ ప్రపోజల్స్‌‌ అమల్లోకి వస్తే ప్రొడక్ట్‌‌లోని కంటెంట్‌‌ గురించి కన్జూమర్లకు సులువుగా అర్థమవుతుందని, కొవ్వు, సాల్ట్‌‌, షుగర్‌‌‌‌ లెవెల్స్‌‌ను మరింత తగ్గించడంపై టెక్నాలజీ మెరుగుపడుతుందని  ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. కానీ ఈ లేబులింగ్ ప్రపోజల్స్‌‌ను ప్యాకేజ్డ్‌‌ ఫుడ్స్‌‌ ఇండస్ట్రీ  తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో అవి ముందుకు కదలడం లేదు. దీంతో హై ఫ్యాట్, షుగర్‌‌‌‌, సాల్ట్‌‌(హెచ్‌‌ఎఫ్‌‌ఎస్‌‌ఎస్‌‌) ఫుడ్స్‌‌ను రెగ్యులేట్‌‌ చేయడం గత ఐదేళ్ల నుంచి ఆగిపోయింది.  ప్రభుత్వం ఇప్పటికి కూడా దీనిపై నిర్ణయం తీసుకోలేకపోతే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.

వెంటనే చట్టం తేవాలి..

‘గతంలో అండర్ న్యూట్రిషన్‌‌(న్యూట్రిషన్ సరిపోకపోవడం)తో ఇండియా బాధపడేది. ఓవర్‌‌‌‌ న్యూట్రిషన్‌‌ సమస్యలు రావని అందరం అనుకున్నాం. కానీ ఈ సమస్యలు చాలా వేగంగా వచ్చాయి. పాలసీలను రెడీ చేసే టైమ్‌‌ కూడా మనకిప్పుడు లేదు’ అని లేబులింగ్‌‌ రెగ్యులేషన్స్‌‌ను తయారు చేసిన కమిటీ మెంబర్‌‌‌‌ కే మాధవన్‌‌ నాయర్ అన్నారు. ‘కొవ్వు, సాల్ట్‌‌, షుగర్‌‌‌‌లు నాన్‌‌ కమ్యునికబుల్‌‌ డిసీజ్‌‌(ఎన్‌‌సీడీ–ఇతరులకు అంటని రోగాలు) లకు కారణమవుతున్నాయని చెప్పారు.  దేశంలో డయాబెటిస్‌‌, ఒబేసిటీ వంటి ఎన్‌‌సీడీలు పెరుగుతున్నాయని నేషనల్‌‌ ఫ్యామిలీ హెల్త్‌‌ సర్వే పేర్కొనడం విశేషం.  ప్రస్తుతం ఫుడ్‌‌ సేఫ్టీ అండ్ స్టాండర్డ్‌‌ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్‌‌ఎస్‌‌ఏఐ) రెడీ చేసిన రెడ్ డాట్ రూల్స్‌‌ వలన  కన్జూమర్లు భయపడతారని ఇండస్ట్రీ చెబుతోంది. ‘ రెడ్ లేబుల్స్ కావాలని ఎవరూ కోరుకోవడం లేదు. కానీ పబ్లిక్‌‌లో అవగాహన కలిగించడానికి ఇదొక్కటే మార్గం’ అని నాయర్ చెప్పారు.

లేబులింగ్‌‌ రెగ్యులేషన్స్‌‌కు సంబంధించి డ్రాఫ్ట్ పేపర్స్‌‌- 2018ను ముగ్గురు సభ్యులున్న కమిటీ సవరించింది. కొత్త డ్రాఫ్ట్ పేపర్స్‌‌ను 2019 లో సబ్మిట్ చేసింది. అయినా ఈ కొత్త ప్రపోజల్స్‌‌ ఇండస్ట్రీకి నచ్చలేదు.  ప్రభుత్వం రెడీ చేసిన డ్రాఫ్ట్‌‌ కన్ఫ్యూజన్‌‌ క్రియేట్‌‌ చేస్తోందని అంటున్నాయి. ఏ నూట్రియంట్స్‌‌ను హైలైట్‌చేయాలి? మోతాదు ఎలా నిర్ణయిస్తారు? లేబుల్స్‌‌ డిజైన్‌‌ ఎలా ఉండాలి?  ఎప్పట్లోగా ఈ పాలసీని అమలు చేయాలి ? అనే అంశాలపై ఇండస్ట్రీలో కన్ఫ్యూజన్‌‌ ఉంది. కాగా, ప్యాకేజ్డ్‌‌ ఫుడ్స్‌‌లో  రెడ్‌‌ డాట్‌‌ను వాడాలని   ఎఫ్‌‌ఎస్‌‌ఎస్‌‌ఏఐ ప్రపోజ్‌‌ చేసింది. ప్రతి ఒక్క కేటగిరికీ సెపరేట్‌‌ డాట్‌‌ను వాడాలని చెబుతోంది. డబ్ల్యూహెచ్‌‌ఓ పేర్కొన్న న్యూట్రియెంట్‌‌ లెవెల్స్‌‌కు తగ్గట్టు ప్యాకేజ్డ్‌‌ ఫుడ్‌‌లలో కాలరీస్‌‌, కొవ్వు, సాల్ట్‌‌ల మోతాదు దాటకూడదు.

ఇండస్ట్రీ వ్యతిరేకిస్తోంది..

రెడ్‌‌ కలర్‌‌‌‌లో వార్నింగ్‌‌ లేబుల్‌‌ ఇవ్వడానికి ఇండస్ట్రీ ఇష్టపడడం లేదు. డేంజర్‌‌‌‌కు సూచనగా రెడ్‌‌ కలర్ ఉంటుందని, ఇది సేల్స్ పడిపోవడానికి కారణమవుతుందని చెబుతోంది. ఈ విషయంలో ఏకాభిప్రాయం తీసుకురావడం కష్టమని ఎనలిస్టులు కూడా పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న పొజిషన్‌‌లో ఈ ప్రపోజల్స్‌‌ను అమలు చేయడం కష్టమని  ఎఫ్‌‌ఎస్‌‌ఎస్‌‌ఏఐకి రాసిన లెటర్‌‌‌‌లో సీఐఐ పేర్కొంది. ఒక్కో ఫుడ్‌‌ ఐటమ్​కు ఒకలా కొవ్వు శాతం ఉంటుందని తెలిపింది. 100 గ్రాముల కెచప్‌‌లో 25–75 గ్రాముల కొవ్వు ఉంటుందని, కానీ ఈ ప్రొడక్ట్‌‌లలో కొవ్వు లిమిట్‌‌ను 12 గ్రాములుగా నిర్ణయించారని పేర్కొంది.  ఆలూ చిప్స్‌‌లో 8 గ్రాములుగా కొవ్వు లిమిట్‌‌ను ఎఫ్‌‌ఎస్‌‌ఎస్‌‌ఐఏ నిర్ణయించింది. అయితే, వీటిలో  కొవ్వు శాతం 30–36 గ్రాములుగా ఉంటోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఫ్రైడ్ ఫుడ్స్‌‌లో కొవ్వును 8 శాతం కంటే తగ్గించే టెక్నాలజీ ఏదీ లేదని సీఐఐ  పేర్కొంది. మేజర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు కూడా ఈ విషయాలనే లేవనెత్తుతున్నాయి. వివిధ లిమిట్‌‌లపై ఇండస్ట్రీ తమ ఫీడ్‌‌ బ్యాక్‌‌ను ఇచ్చిందని, దేశీయ పరిస్థితులకు తగ్గట్టు వీటిని మార్చమని కోరిందని ఎఫ్‌‌ఎస్‌‌ఎస్‌‌ఏఐ సీఈఓ అరుణ్ సింగల్‌‌ అన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకొని ప్రపోజల్స్‌‌ను తిరిగి రెడీ చేయనున్నామని ఆయన అన్నారు.

For More News..

మీరు సీఎం అయ్యాకే తెలంగాణ తలరాత మారింది

కార్పొరేట్ కాలేజీల వెనుక టీఆర్ఎస్ పెద్దలు

మూడు పార్టీలకు సాగర్ ఎన్నిక సవాల్

గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేడీ తొలగింపు