తెలంగాణలో కొత్త ఎన్‌ఈ‌పీకి మోక్షమెప్పుడు?

తెలంగాణలో కొత్త ఎన్‌ఈ‌పీకి మోక్షమెప్పుడు?

డా. కస్తూరి రంగన్ కమిటీ సమర్పించిన ‘జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈ‌పీ)-2020 డ్రాఫ్ట్’ ను కేంద్ర క్యాబినెట్ జులై 2020లోనే ఆమోదించింది. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నందువల్ల, ఎన్‌ఈ‌పీ-2020 అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తున్నది.

ఎన్‌ఈ‌పీ (నేషనల్​ ఎడ్యుకేషన్​ పాలసీ)- 2020 పాఠశాల విద్యను 5+3+3+4 మోడల్​లో రూపకల్పన చేసి దానిలో  అంగన్​వాడి వ్యవస్థను, ఇంటర్మీడియట్​ను విలీనం చేయాలని సిఫార్సు చేసింది. దీని ప్రకారం పాఠశాల విద్య 5 సంవత్సరాలు పునాది దశ (3 సం. ప్రీ-ప్రైమరీ,  ఎఎంపి గ్రేడ్ -1,2). ఆ తర్వాత 3 సంవత్సరాలు సన్నాహక దశ (గ్రేడ్ -3,4,5), మరో 3 సంవత్సరాలు మధ్య దశ (గ్రేడ్ -6,7,8), 4 సంవత్సరాలు ఉన్నత దశ (గ్రేడ్ -9,10,11,12) అనే నాలుగు దశలుగా ఉండనుంది. పాఠశాలలో  పిల్లలను చేర్పించడానికి కనీస వయస్సు 3 సంవత్సరాలుగా  నిర్ధారించింది. పిల్లల్లో  భౌతిక -జ్ఞాన అభివృద్ధి, సామాజిక-, భావోద్వేగ, -నైతిక- సాంస్కృతిక అభివృద్ధితో పాటుగా కమ్యూనికేషన్ (భావ వ్యక్తీకరణ)కు అవసరమయ్యే భాష, సంఖ్య, అక్షరాస్యతా సామర్థ్యాలు అభివృద్ధి చెందించడం ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ లక్ష్యంగా ఉండాలని ఎన్ఈపీ చెప్పింది.  

ఎన్‌ఈ‌పీ-2020 సిఫార్సు చేసిన విధంగా పాఠశాలలు ఎన్ని రకాలుగా ఉండాలో  తెలంగాణ ప్రభుత్వం స్పష్టత  ఇవ్వాల్సి ఉంది. అంటే పునాది, సన్నాహక, మధ్య, ఉన్నత దశలను బట్టి  పాఠశాలలను ఎలా విభజిస్తారు అనే అంశంపై ప్రభుత్వం నియమ, నిబంధనలు రూపొందించాలి. అప్పుడే ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ వారికి విద్యార్థుల సంఖ్యను బట్టి ఎలా అప్​గ్రేడ్  లేదా కన్వర్ట్ చేసుకోవాలో తెలుస్తుంది. తెలంగాణ  ప్రభుత్వం ప్రస్తుతం నిర్వహిస్తున్న మోడల్, గురుకుల స్కూళ్లు లేదా కేంద్ర ప్రభుత్వం అధీనంలో నడిచే నవోదయ, కేంద్రీయ పాఠశాలల్లాగా ఏదో ఒక పద్ధతిని అనుసరించవచ్చును.

పాఠశాల విద్యలో చాలా మార్పులు అవసరం

స్కూళ్లలో ఇంటర్ విద్యను విలీనం చేస్తే, కామర్స్, సోషి యాలజీ, సైకాలజీ, జాగ్రఫీ, సంస్కృతం వంటి సబ్జెక్ట్ లను 9,10 విద్యార్థులకు బోధించాల్సి  ఉంటుంది. వాటికోసం అదనపు స్థలం, తరగతి గదులు, బల్లలు, డెస్కులు, ఫ్యాన్లు,  లైబ్రరీ, సైన్స్ లాబ్స్ తదితర మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. బోధన, బోధనేతర  సిబ్బందిని పెంచుకోవాలి. అలాగే టీచర్ల నియామక విధానంతో పాటు వారికి ఉండాల్సిన కనీస విద్యార్హతలు, వారి హోదాలు (టి‌జి‌టి, పి‌జి‌టి) కూడా మారుతాయి.  9,10,11,12 తరగతులకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో రూపొందించే సిలబస్, ఆల్ ఇండియా లెవెల్​లో  పరీక్ష రాసేవారికి కూడా ప్రయోజనం చేకూర్చేలా ఉండాలి. 

ఆ నూతన పుస్తకాలను ముద్రించడమే కాకుండా, వాటి సాఫ్ట్ కాపీలను ఎన్‌సి‌ఈ‌ఆర్‌టి  మాదిరిగా ప్రభుత్వ వెబ్ సైట్​లో అందరికీ అందుబాటులో ఉంచాలి.  అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఎన్‌ఈ‌పీ 2020 ప్రకారం పాఠశాల విద్య, ఉన్నత విద్యను పూర్తి స్థాయిలో పునర్నిర్మించడంలో ఎదురయ్యే సవాళ్లను, సమస్యలను గుర్తించడానికి ఎటువంటి అధ్యయనం చేయలేదు. అందువల్ల తెలంగాణ ప్రభుత్వం,  ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయడానికి లేదా పాఠశాల విద్యను 12వ తరగతి వరకు విస్తరించడానికి విధివిధానాలు రూపొందించడానికి కమిటీ వేయాలి. ఈ కమిటీలో ఆర్థిక శాస్త్రవేత్తలు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్, ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్లు తదితరులు ఈ కమిటీ సభ్యులుగా ఉండాలి. అప్పుడే తెలంగాణ రాష్ట్రంలో చదివే విద్యార్థులు భవిష్యత్తులో విజేతలుగా నిలిచి తెలంగాణ కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తారని నిస్సందేహంగా చెప్పవచ్చు. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఎన్‌ఈ‌పీ2020 అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నది.

ఎన్‌ఈ‌పీని అమలు చేయకపోవడం వల్ల నష్టాలు

ఎన్‌ఈ‌పీ 2020 ప్రకారం.. పిల్లలకు 6 సంవత్సరాల వయస్సు వస్తేనే వారిని ఒకటో తరగతిలో చేర్చుకోవాలి. దేశంలోని అన్ని సి‌బి‌ఎస్‌ఈ, ఐ‌సి‌ఎస్‌ఈ  స్కూళ్లు ఈ నిబంధనను ఖచ్చితంగా పాటిస్తున్నాయి. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఎన్‌ఈ‌పీ -2020ని ఇంకా అమలు చేయకపోవడం వల్ల రాష్ట్ర సిలబస్ ఫాలో అయ్యే స్కూలుల్లో ఒకటో తరగతిలో పిల్లలను చేర్చడానికి కనీస వయస్సును ఫిక్స్ చేయలేదు. నగరాల్లోని ప్రైవేట్ స్కూల్స్ మాత్రం కొందరు పిల్లలకు ఆరేండ్లు నిండలేదని,  ఎల్‌కె‌జి, యూ‌కెజిని మళ్లీ చదవాలని చెప్తున్నారు. దీనివల్ల పేరెంట్స్​లో గందరగోళం నెలకొంది. అలాగే  ప్రస్తుతానికి 10 వ తరగతి, ఇంటర్మీడియట్  రెండు బోర్డులు వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇంటర్మీడియట్ కోర్సును స్కూల్ ఎడ్యుకేషన్​లో కలిపిన తర్వాత వాటిని ఒకే బోర్డుగా మార్చవలసి ఉంటుంది. కేవలం రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్  కోర్సుకు లక్షల్లో  ఫీజులు వసూలు చేస్తున్నారు. 

ఐ‌ఐ‌టి, నీట్ పరీక్షల్లో మంచి ర్యాంకుల కోసం పిల్లలపై మానసిక ఒత్తిడి అధికమై కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇంటర్ విద్య పూర్తిగా కార్పొరేట్ మయమై,  ధనార్జనే ధ్యేయంగా నడుస్తున్నది. ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లందరినీ పి‌జి‌టిలుగా గుర్తించాలి.  వారిలో బి‌ఈ‌డి చేయనివారికి  4 సంవత్సరాలల్లో పూర్తి చేసుకొనే వెసులుబాటు కల్పించాలి. దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, పాఠశాల, కళాశాల యాజమాన్యాలకు ఆర్థిక భారం తగ్గడంతోపాటు జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న మానవ వనరులను సంపూర్ణంగా వినియోగించుకోవచ్చు. మరోవైపు రోజురోజుకూ ప్రభుత్వ కాలేజీల్లో తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్యను పెంచి అక్కడి ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను ప్రభావవంతంగా ఉపయోగించవచ్చు.

ఒత్తిడి లేని చదువు అందించాలి

ఇంటర్మీడియట్​ను స్కూల్ ఎడ్యుకేషన్​లో కలపడం వల్ల పేరెంట్స్​కు ఇంటర్ విద్య అందుబాటులోకి రావడమే కాకుండా స్టూడెంట్స్ కు మానసికంగా ఒత్తిడి లేని చదువు అందించవచ్చు.  ఎంత మంచి పాలసీ అయినా అది అమలు చేసే విధానాన్ని బట్టే ఫలితాలు వస్తాయి. ఒక కొత్త మార్గంలో  వెళ్తున్నప్పుడు పాలసీ మొత్తాన్ని ఒకేసారి అమలు చేయడం కుదరదు. 

దానికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్​లు సంయుక్తంగా కలిసి చేయాల్సిన అంశాలను నిర్ణీత సమయాల్లో పూర్తి చేయాలని ఎన్‌ఈ‌పీ -2020 సిఫారసు చేసింది. రాష్ట్ర విద్యాశాఖ  అమలు చేయబోయే సమగ్ర ప్లాన్ ను సిద్ధం చేసుకోవడం,  టీచర్  రిక్రూట్​మెంట్, వారి సర్వీస్ రూల్స్ రూపొందించడం, 2023 వరకు టీచింగ్ మెథడ్, మూల్యాంకన పద్ధతులు నిర్ధారించుకోవడం చేయాలి. కానీ, తెలంగాణ ప్రభుత్వం వీటిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోవడం శోచనీయం.

 – డా. శ్రీరాములు గోసికొండ, అసిస్టెంట్ ప్రొఫెసర్, నర్సీ మోంజీ డీమ్డ్ యూనివర్సిటీ, హైదరాబాద్