
ఒకప్పుడు బట్టలు చిరిగిపోయేవరకు ఉపయోగించేవారు. ఈరోజుల్లో ఎప్పటికప్పుడు కొత్తవి కొనడం ఫ్యాషన్. ఇది ఇప్పటి సమాజ ధోరణి. ముఖ్యంగా అధిక ఆదాయ దేశాలలో, ధనికులు దుస్తులు, పాదరక్షలు, ఫర్నిచర్‌లను తరచుగా కొనుగోలు చేస్తున్నారు. వాటిని పూర్తిగా ఉపయోగించకుండానే కొత్త ఫ్యాషన్‌లతో, డిజైన్ లతో భర్తీ చేస్తున్నారు. సగటున ఏటా యూరోపియన్లు దాదాపు 26 కిలోల వస్త్రాలను ఉపయోగిస్తారట. వాటిలో 11 కిలోల వరకు పారేస్తారు. పారేసిన దుస్తులను వర్ధమాన దేశాలకు ఎగుమతి చేస్తారు. ఎక్కువగా (87%) కాల్చివేస్తారు లేదా చెత్తకుప్పలో వేస్తారు. కృతిమ నూలుతో తయారు అయిన పాలిస్టర్ తదితర వస్త్రాలు భూమిలో కలవవు. ప్లాస్టిక్ వంటి పాలిస్టర్ వస్త్రాలు దుస్తుల వల్ల నూలు దగ్గర నుంచి వస్త్రాలుగా పడేసేవరకు తీవ్రమైన పర్యావరణ నష్టం జరుగుతుంది.
హైదరాబాద్ వంటి నగరాలలో వస్త్రాలు మురికినీటి కాలువలలో, చెరువులలో తేలుతున్నాయి. వస్త్ర ఉత్పత్తికి వందల ఏండ్ల నుంచి ప్రముఖంగా ఉన్న భారతదేశం కూడా వస్త్ర వ్యర్థాలను దిగుమతి చేసుకుంటున్నది. మన దగ్గర ఉత్పన్నమయ్యే వస్త్ర వ్యర్ధాలు ఒక సమస్య కాగా వాటికి తోడు ఈ దిగుమతులు కూడా జోడు అయ్యాయి. మొత్తం వస్త్ర వ్యర్థాల నిర్వహణ దేశంలో ఒక పెద్ద సవాలుగా మారింది.
ఆశ్చర్యం ఏమిటంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టుగా కూడా లేదు. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, భారతదేశంలో ఏటా సుమారు 7.8 మిలియన్ టన్నుల వస్త్ర వ్యర్థాలు మిగిలిపోతున్నాయి. ప్రపంచ వస్త్ర వ్యర్థాలలో ఇది 8.5 శాతం. ఈ వ్యర్థాలలో దిగుమతి చేసుకున్న వస్త్ర వ్యర్ధాలు కూడా ఉన్నాయి. ఏటా 7,800 కిలోటన్నుల వస్త్ర వ్యర్థాలను నిర్వహించడంలో కనీస ప్రణాళిక లేకపోవడం ఇబ్బంది కలిగిస్తున్నది.
ఏటా 60 మిలియన్ టన్నులకు పైగా దుస్తులు కొనుగోలు
1995లో వస్త్ర పరిశ్రమ తలసరి 7.6 కిలోగ్రాముల ఫైబర్‌ను ఉత్పత్తి చేసింది. 2018 నాటికి ఇది దాదాపు రెట్టింపు అయ్యి ప్రతి వ్యక్తికి 13.8 కిలోగ్రాములకు చేరింది. ఇదేకాలంలో ప్రపంచ జనాభా కూడా 5.7 బిలియన్ల నుంచి 7.6 బిలియన్లకు పెరిగింది. ప్రస్తుతం ప్రతి సంవత్సరం 60 మిలియన్ టన్నులకుపైగా దుస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఈ సంఖ్య 2030 నాటికి దాదాపు 100 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా.
పాలిమర్ ఆధారిత ఫైబర్స్, ముఖ్యంగా పాలిస్టర్ ఉత్పత్తి, ఏటా 2000లో 25 మిలియన్ టన్నుల నుంచి 2018లో దాదాపు 65 మిలియన్ టన్నులకు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 100 బిలియన్ వస్త్రాలు ఉత్పత్తి అవుతున్నాయని అంచనా. ప్రపంచ జనాభా మొత్తం 8 బిలియన్లు మాత్రమే. అందునా అనేక లక్షల మందికి వస్త్రాలు కొనుక్కునే స్థోమత లేదు.
సూరత్‌లో 65 వేలకు మించి చీరల ఉత్పత్తిదారులు
భారతదేశంలో కూడా వస్త్రాల వినియోగం గత రెండు దశబ్దాలలోనే విపరీతంగా పెరిగిపోయింది. పాలిస్టర్ చీరల ఉత్పత్తికి కేంద్రం గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరం. ఇక్కడ దాదాపు 65 వేల చీరల ఉత్పత్తిదారులు ఉన్నారని అంచనా. ఒక్కసారి కట్టుకున్న చీర మళ్ళీ కట్టుకోకపోవడం ద్వారా సమాజంలో తమ ‘స్టేటస్’ పెరిగినట్టుగా భావిస్తున్నారు కొందరు మహిళలు.
2024లో బెల్జియంలో నివసిస్తున్న 156 మందిపై ఒక విస్తృతమైన వార్డ్‌రోబ్ అధ్యయనం చేశారు. తమ ఆల్మారాలో (వార్డ్‌రోబ్‌లో) సగటున 198 వస్త్రాలను కలిగి ఉన్నారని, వాటిలో 2% మాత్రమే సెకండ్ హ్యాండ్, 22% (12 నెలల్లో ) అసలు ఉపయోగించలేదు అని అధ్యయనం కనుగొంది. ఇందులో 75% బట్టలు పునర్వినియోగించే స్థితిలో ఉన్నాయి. ఈ పరిశోధన ప్రకారం వార్డ్‌రోబ్‌లలో దాదాపు 25 శాతం వస్త్రాలను పారవేయడం లేదు. ఉపయోగించడం కూడా లేదు. భారత్‌లో కూడా అనేకమంది ఆల్మరాలలో లక్షల సంఖ్యలో చీరలు, ఇతర వస్త్రాలు మూలుగుతున్నాయి. వాటిని వాడరు. కొత్తవి కొంటూనే ఉంటారు.
పెట్రో కెమికల్స్‌తో వస్త్రాల తయారీ
ఫాస్ట్ ఫ్యాషన్‌లో ప్లాస్టిక్ వాడకం వంద శాతం ఉంటుంది. పాలిస్టర్, నైలాన్, ఎలాస్టేన్, యాక్రిలిక్ వంటి సింథటిక్ ఫైబర్‌లు శిలాజ ఇంధనాలను ఉపయోగించి తయారుచేస్తారు. ఇటీవలి సంవత్సరాలలో ఫ్యాషన్‌లో ఈ ఫైబర్‌ల వాడకం నాటకీయంగా పెరిగింది. 2000 – 2020 మధ్య రెట్టింపు అయింది. సింథటిక్ ఫైబర్‌ల ఉత్పత్తి పెద్ద మొత్తంలో శక్తిని ఉపయోగిస్తుంది.
ప్రపంచ వాతావరణ మార్పులకు ఆజ్యం పోస్తున్న పెట్రోకెమికల్ పరిశ్రమలో ఈ కృత్రిమ ఫైబర్ ఉత్పత్తి ఒక భాగం. వెబ్‌సైట్‌ల ద్వారా అమ్ముతున్న వస్త్రాలు ఎక్కువ శాతం పాలిస్టర్, యాక్రిలిక్, నైలాన్ మరియు పాలిమైడ్ వంటి పెట్రోకెమికల్స్ నుంచి తయారు చేసినవే ఉంటాయి. నదులు, మహాసముద్రాలు, ఆహార వ్యవస్థలలో కనిపిస్తున్న ట్రిలియన్ల కొద్దీ మైక్రోఫైబర్ పెట్రోలియం- ఆధారిత బట్టల నుంచి వచ్చినవే. ఇటీవలి అధ్యయనంలో సగటున 6 కిలోల పాలిస్టర్ వస్త్రం నుంచి అర మిలియన్ ఫైబర్, అక్రిలిక్ నుండి 700,000 ఫైబర్‌లు విడుదల అవుతాయని తేలింది.
పారేసిన ప్లాస్టిక్ వస్త్రాలతో కలుషితాలు
పారేసిన ప్లాస్టిక్ వస్త్రాలు క్రమంగా ముక్కలు అయ్యి, మైక్రో ఫైబర్‌గా, మైక్రో ప్లాస్టిక్ కణాలుగా మారుతున్నాయి. నీటి ద్వారా, జలచరాల ద్వారా మంచి నీటిలోకి, ఆహారంలోకి ప్రవేశిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద నీటి వినియోగదారులలో ఒకటైన ఫ్యాషన్ పరిశ్రమ ప్రతి సంవత్సరం 20 ట్రిలియన్ల నుంచి 200 ట్రిలియన్ లీటర్ల వరకు నీటిని వినియోగిస్తోంది. పెట్రో కెమికల్ ఉత్పత్తులయిన పాలిస్టర్, ఇంకా ఇతర కృత్రిమ నూలును వాడడం వలన, పడేయడం వలన అనేక అనర్థాలు కలుగుతున్నాయి.
చేనేత రంగాన్ని ప్రోత్సహించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా బట్టల గుట్టలను, బట్టల వలన ఏర్పడుతున్న కలుషిత వాతావరణాన్ని మార్చవచ్చు. వస్త్రాలలో సహజ నూలు వినియోగం, చేతిమగ్గాల ఉపయోగం ద్వారా పర్యావరణ అనుకూల జీవన విధానం కూడా తిరిగి సాధించవచ్చు. పెరుగుతున్న వేడి నుంచి తట్టుకునే ప్రత్తి నూలు వస్త్రాలు చేనేత మగ్గం నుంచి మాత్రమే సాధ్యం. ఈ దిశగా ప్రభుత్వ విధానం మారాలి.
చేనేత ఒక పరిష్కారంగా ప్రభుత్వం అంతర్జాతీయ పర్యావరణ సమావేశాలలో ప్రవేశపెట్టి, తగిన ఆర్థిక వనరులను సమకూర్చాలి. సుస్థిర, పర్యావరణ అనుకూల, సామాజిక సమానత్వం, బాధ్యతాయుత వస్త్ర వినియోగానికి తగిన విధానం తీసుకురావాలి. వస్త్ర వ్యర్థాల దిగుమతులను నిషేధించాలి. వస్త్ర వ్యర్థాలు గాలిని, నేలను, నీటి వనరులను కలుషితం చేయకుండా చర్యలు చేపట్టాలి. తగిన విధి విధానాలు ప్రకటించాలి. వ్యర్ధాల సంబందిత చట్టాలలో వ్యర్థ వస్త్రాలను కూడా చేర్చాలి.
వస్త్రాల ఉత్పత్తికి 15 వేల రసాయనాలు
కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సబ్సిడీలు ఇస్తూ పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తికి ప్రోత్సాహం ఇస్తున్నది. సహజ నూలుతో చేసే వస్త్ర ఉత్పత్తిని, చేనేత రంగాన్ని నిర్లక్ష్యంతో విస్మరిస్తున్నది. ఈ కృతిమ నూలు వస్త్రాలను మృదువుగా మార్చడానికి అనేక రకాల రసాయనాలు వాడుతున్నారు. ఒక అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక వస్త్రాల ఉత్పత్తికి, వివిధ దశలలో దాదాపు 15 వేల రసాయనాలు ఉపయోగిస్తున్నారు.
ఆధునిక వస్త్రాలు, ప్రత్యేకంగా సింథటిక్ ఫైబర్‌లతో సంబంధం ఉన్న వ్యర్థాలు, విషపదార్థాలు ప్రపంచ పర్యావరణ వ్యవస్థ మీద, మానవ ఆరోగ్యాన్ని వివిధ మార్గాలలో ప్రభావితం చేస్తున్నాయి. రసాయన రంగులు మాత్రమే కాకుండా వస్త్ర ఉత్పత్తిలో ఉపయోగించే అనేక రసాయనాలు గురించి చాలామందికి అవగాహన లేదు. 1 కిలో వస్త్రాలను ఉత్పత్తి చేయడానికి అర కిలో కంటే ఎక్కువ రసాయనాలు అవసరమని అంచనా వేశారు.
తయారీ ప్రక్రియలలో 15,000 కంటే ఎక్కువ రసాయనాలు ఉపయోగిస్తారని అంచనా. ఎండ, వేడి, చలి తదితర వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడుకోవడానికి వస్త్రాలు ధరించే పరిస్థితి నుంచి అందం కోసం, పోటీపడి సామాజిక స్థితికి సూచికగా వాడడం వలన జరిగే అనర్థాలు అనేకం.
- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్