
నేటి పోటీ ప్రపంచంలోని విద్యావ్యవస్థలో ర్యాంకుల, మార్కుల వేట కొనసాగుతోంది. ప్రీప్రైమరీ దశలోనే తమ పిల్లలు బాగా చదివి మంచి మార్కులు సాధించాలనే ఆత్రుత తల్లిదండ్రుల్లో పెరిగిపోతుంది. ఇది పాఠశాల, కళాశాల దశకు వచ్చేసరికి మరింత పెరుగుతుంది. తల్లిదండ్రుల తమ పిల్లల పట్ల అతిగా అంచనాలు పెట్టుకుంటున్నారు. డాక్టరు, ఇంజినీర్లు కావాలని కలలు కంటున్నారు. పేరెంట్స్ లక్ష్యాలను సైతం తమ పిల్లలపై రుద్దుతున్నారు. పాఠశాల దశ నుంచే ఐఐటీ, మెడిసిన్ అని ప్రత్యేకమైన ఫౌండేషన్ కోర్సులతో విద్యనందిస్తున్నారు.
ఈ క్రమంలో కార్పొరేట్ విద్యాసంస్థలు లక్షల ఫీజులు దండుకుంటున్నాయి. విద్యావ్యవస్థ ఒక పెద్ద మార్కెట్‌గా మారింది. ఇంజినీరింగ్, మెడిసిన్ సీటు లక్ష్యంగా ఇంటర్లో చేర్పిస్తున్నారు. ఇంటర్మీడియట్లో అకాడమీ పరీక్షలను, పోటీ పరీక్షలను ఎదుర్కోవడంలో విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. మరోవైపు అటు తల్లిదండ్రులు ఇటు విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్ల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు. ర్యాంకుల ఒత్తిడిలో ఏటా వందలమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2022 గణాంకాల ప్రకారం 13,044 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
అందులో 2 వేల మంది పరీక్షల్లో వైఫల్యంతోనే ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొంది. రాజస్థాన్‌లోని కోటాలో గతేడాది 26మంది స్టూడెంట్స్ తనువు చాలించగా, ఈ ఏడాది ఇప్పటివరకు 14మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. విద్యార్థుల ఆత్మహత్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఇది చాలా ఆందోళకరమైన విషయం అంటూ రాజస్థాన్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలు కోటాలో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయంటూ నిలదీసింది.
కోచింగ్ లేకుండా విజయం సాధించలేమా?
ప్రస్తుతం కోచింగ్ లేకుండా ఇంజినీరింగ్ లేదా వైద్య విద్య ప్రవేశ పరీక్షల్లో ర్యాంకు సాధించడం కాదన్నట్టుగా మారింది. కొన్నిసార్లు ఎంత చదివినా ర్యాంకు సాధించలేరనే భావన విద్యార్థులతోపాటు తల్లిదండ్రుల్లోనూ నెలకొంది. ఉత్తమ ర్యాంకులు సాధించి, అత్యుత్తమ విద్యాసంస్థల్లో సీట్లు దక్కించుకోవాలనే తాపత్రయంతో పాఠశాల స్థాయి నుంచి కోచింగ్ కేంద్రాల్లో చేర్పిస్తున్నారు.
మరోవైపు పిల్లల శిక్షణకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు. శిక్షణ తీసుకోకపోతే తాము వెనకబడతామనే భావనతో చదువులో ప్రతిభావంతులు సైతం కోచింగ్ కేంద్రాల్లో చేరుతున్నారు. మరోవైపు పలు ప్రైవేటు కోచింగ్ సెంటర్లు ఇష్టారాజ్యంగా తమదే మొదటి ర్యాంకు అని ప్రచారం చేసి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. పిల్లలు ర్యాంకుల పరుగుపందెంలో పడి తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ధోరణి ఈ దేశాభివృద్ధికి, భవిష్యత్ మానవవనరుల అభివృద్ధికి పెనుశాపంగా మారనుంది.
ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి కేంద్ర విద్యాశాఖ దృష్టి సారించింది. కోచింగ్ ప్రభావం పడకుండా పరీక్షలకు పోటీపడేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించి, సిఫార్సులు చేయాలని కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషి ఛైర్మన్‌గా కమిటీని నియమించింది. సీబీఎస్‌ఈ ఛైర్మన్, పాఠశాల, ఉన్నత విద్య విభాగాల సంయుక్త కార్యదర్శులు, ఐఐటీ మద్రాస్, తిరుచ్చి ఎన్‌ఐటీ, ఐఐటీ కాన్పూర్, ఎన్‌సీఈఆర్‌టీ ప్రతినిధులు, ఒక కేంద్రీయ విద్యాలయ, ఒక నవోదయ విద్యాలయ, ఒక ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రతి నెలా సంబంధిత శాఖా మంత్రికి పురోగతిని వివరించాలని ఆదేశించింది.
సహజ నైపుణ్యాలకు ప్రాధాన్యమివ్వాలి.
ఇటీవల దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు ఒత్తిడి ఎదుర్కొంటున్న నేపథ్యంలో తల్లిదండ్రుల అభిప్రాయంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల సహజ నైపుణ్యాలతో సంబంధం లేకుండా తల్లిదండ్రులు తమ లక్ష్యాలను పిల్లలపై రుద్దడం మానుకోవాలి. విద్య అంటే పాఠశాలకు వెళ్లి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడం మాత్రమే కాదు.
ఇది జ్ఞానాన్ని పొందడం, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవాలో నేర్చుకోవడం గురించని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. భావితరాన్ని ఒత్తిడికి గురి చేయకుండా బాల్య దశ నుంచి శాస్త్రీయంగా విద్యను అందించేవిధంగా పాఠశాలలు, కళాశాలలు చర్యలు చేపట్టాలి. ఈ నేపథ్యంలో పాఠశాల దశ నుంచే విద్యను సంస్కరించాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల సహజ నైపుణ్యాల అభివృద్ధి ఆధారంగా విద్యను అందించాలి.
- సంపతి రమేష్ మహారాజ్,
సోషల్ ఎనలిస్ట్