సొంత జాగా ఉన్నోళ్లకు పైసలెప్పుడు ఇస్తరు..?

సొంత జాగా ఉన్నోళ్లకు పైసలెప్పుడు ఇస్తరు..?

హైదరాబాద్, వెలుగు: సొంత జాగా ఉన్నోళ్లు ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామంటూ 2021లో తీసుకొచ్చిన స్కీమ్​పై ఇప్పటిదాకా సర్కారు క్లారిటీ ఇవ్వలేదు.  దీనిపై ఎలాంటి గైడ్​ లైన్స్ రూపొందించలేదని హౌసింగ్​ డిపార్ట్​మెంట్​అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ సాయంపై ఏండ్లుగా ఎదురుచూస్తున్న పేదలు నిరాశ చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి ఈ స్కీమ్ ద్వారా సాయం చేస్తామని, లబ్ధిదారుల లిస్టు ఎమ్మెల్యేలే తయారు చేస్తారని అప్పట్లో సర్కారు ప్రకటించింది. ఇంతకు మించి ఈ స్కీమ్​ గురించి ఏ విషయమూ డిసైడ్​ కాలేదు. కానీ ప్రతి వేదికపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ స్కీమ్​ను ప్రస్తావిస్తూ పేదలను ఊరిస్తున్నారు. నాలుగు లక్షల ఇండ్ల నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున ప్రభుత్వం మొత్తం రూ.12 వేల కోట్లను  బడ్జెట్​లో కేటాయించింది. 

ప్రచారం మాత్రం చేసుకుంటున్నరు

2021లో తొలిసారి ఈ స్కీమ్​ను ప్రకటించినప్పుడు ఒక్కో లబ్ధిదారుకు ఐదు లక్షల చొప్పున ఇస్తామని సర్కారు చెప్పింది. ఆ ఆర్థిక సంవత్సరం ముగిసినా స్కీమ్​​అమలు కాలేదు. అదే పథకాన్ని 2022–23 బడ్జెట్​లో తిరిగి ప్రస్తావించినా అడుగు ముందుకు పడలేదు. పోయిన ఏడాది హుజూరాబాద్​ ఎలక్షన్స్​లో, ఈ సారి మునుగోడు బై ఎలక్షన్స్​లో ఈ స్కీమ్​పై అధికార పార్టీ ప్రచారం చేసుకుంది. మంత్రి కేటీఆర్​ కూడా డిసెంబర్​లోనే  ఈ స్కీం మొదలు పెడుతామని ఇటీవల ప్రకటించారు. ఆఫీసర్లు మాత్రం ఈ స్కీమ్​ గైడ్​లైన్స్​ ఫిక్స్​ కాలేదని.. చర్చల దశలోనే ఉందని చెప్తున్నారు.

రూ.12 వేల కోట్లు కావాలి

ఈ స్కీమ్​ను ఒకేదశలో అమలు చేయాలంటే రూ.12 వేల కోట్లు కావాలి. సర్కారు నిధుల కొరతను ఎదుర్కొంటున్నందున ఫేజ్ ల వారీగానే అమలు చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇది కూడా దళితబంధు స్కీమ్​ మాదిరే ఉంటుందని, ఎమ్మెల్యేలు ఎవరి పేరు సూచిస్తే వారికే సాయం అందనుందని అధికారులు చెబుతున్నారు. అయితే అర్హుల గుర్తింపునకు క్రైటిరియా తప్పనిసరని,  గైడ్​లైన్స్​ నిర్ణయిస్తేనే క్లారిటీ వస్తుందని  అంటున్నారు.