పెండింగ్​ పైసలెప్పుడిస్తరు? .. రోడ్డెక్కిన ఎల్లంపల్లి ముంపు బాధితులు

పెండింగ్​ పైసలెప్పుడిస్తరు? ..  రోడ్డెక్కిన ఎల్లంపల్లి  ముంపు బాధితులు

మంచిర్యాల, వెలుగు: ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు బాధితులు రోడ్డెక్కారు. పెండింగ్​డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో హాజీపూర్​లో రాస్తారోకో చేశారు.  బీజేపీ లీడర్లు, ముంపు బాధితులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై గంటన్నరకు పైగా బైఠాయించడంతో ట్రాఫిక్​ జామ్​ అయ్యింది.  పోలీసులు బుజ్జగించినా బాధితులు కదలకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కలెక్టర్  వచ్చి తమ సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించేదిలేదని పట్టుబట్టారు. చివరికి తహసీల్దార్  వచ్చి వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

 అనంతరం తహసీల్దార్​కు వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు మాట్లాడుతూ.. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపు బాధితులకు చెల్లిస్తామన్న పైసలు ఇప్పటివరకూ ఇవ్వలేదని,  ఇది సీఎం కేసీఆర్​ అసమర్థ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రాజెక్ట్ నిర్మిస్తే తమ పంటలకు నీళ్లు వస్తాయన్న ఆశతో వేలాది మంది రైతులు భూములను ఇచ్చారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్  పైసలను ఇంతవరకు చెల్లించకపోవడం దారుణమన్నారు. 

వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్​ చేశారు.  ధర్నాలో మండల అధ్యక్షుడు బొలిశెట్టి తిరుపతి, రజినీష్ జైన్, మోటపలుకుల తిరుపతి, మడిపెల్లి సత్యం, బొడ్డు తిరుపతి, మారు వెంకటరెడ్డి, హనుమాండ్ల శ్రీనివాస్, ఉట్నూరి రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.