దేశ భద్రత గురించి ఎప్పుడు చర్చిస్తారు?

దేశ భద్రత గురించి ఎప్పుడు చర్చిస్తారు?

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై తరచూ విరుచుకుపడుతున్న ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈసారి ఆయనకు ఓ ప్రశ్న వేశారు. దేశ భద్రతా సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారని మోడీని రాహుల్ క్వశ్చన్ చేశారు. దేశ రక్షణ, భద్రత గురించి ఎప్పుడు చర్చ జరుగుతుంది? అని రాహుల్ ట్వీట్ చేశారు. ఇండియా భూభాగాన్ని ఆక్రమించాలని చూసిన వారికి తగిన సమాధానం చెప్పారని సైనికులను మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో మోడీ ప్రశంసిన కాసేపటికే రాహుల్ ఈ ట్వీట్ చేశారు.

గల్వాన్‌ లోయలో చైనాతో ఘర్షణ తర్వాత లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రభుత్వ వైఖరి మీద కాంగ్రెస్ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఎల్‌ఏసీ మీదుగా చైనీయులు 18 కిలో మీటర్లు చొరబడ్డారని.. డ్రాగన్ కంట్రీ దురాక్రమణను బహిరంగంగా, ప్రజల ముందు ప్రధాని మోడీ ఖండించాలని శనివారం కాంగ్రెస్ నేత, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ డిమాండ్ చేసిన సంగతి విధితమే.