కొత్త స్కీమ్​లు పత్తాలేవు

కొత్త స్కీమ్​లు పత్తాలేవు
  • ఆర్థిక సంవత్సరం మొదలై 2 నెలలైనా ఒక్కటీ పట్టాలెక్కలే  
  • పాత పథకాల    అమలులోనూ ఆలస్యమే
  • ప్రజలకు సమాధానం చెప్పలేక లీడర్ల పరేషాన్​
  • కొందరికైనా ఇస్తే కుదుటపడతామని ఆశలు
  • నిధుల సర్దుబాటే అడ్డంకి అంటున్న ఆఫీసర్లు

హైదరాబాద్ : ఆర్థిక సంవత్సరం మొదలై రెండు నెలలు కావొస్తున్నా.. బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో ప్రకటించిన కొత్త పథకాలు పట్టాలు ఎక్కలేదు. ఇప్పటికే ఉన్న స్కీంల అమలు సరిగ్గా జరగడం లేదు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో బుగులు మొదలైంది. నియోజకవర్గానికి వెళ్తే కొత్త స్కీమ్​లు ఎప్పుడు మొదలుపెడతారని, పాత స్కీమ్​లు కూడా తమకు అందుతలేవని ప్రజలు నిలదీస్తున్నారు. రేపు మాపు అంటూ వాయిదాలు వేస్తున్న ఎమ్మెల్యేలకు అసలు కొత్త స్కీములు ఎప్పుడు మొదలవుతాయనే క్లారిటీ లేదు. పాత స్కీమ్​లు ఎందుకు ఆలస్యమవుతున్నాయో కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు.  

బడ్జెట్ హామీలు మొదలు కాలే :-
ఈసారి బడ్జెట్​లో కొత్త స్కీంలు భారీగా ఏవీ ప్రకటించకపోయినా.. గతంలో చెప్పిన వాటినే ఈసారి అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో ప్రధానంగా సొంత జాగా ఉన్నోళ్లకు ఇండ్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తామని చెప్పింది. ఇందుకోసం రూ.12 వేల కోట్లు కేటాయించింది. అయితే ఇంతవరకూ అర్హుల్ని ఎలా గుర్తించాలనే మార్గదర్శకాలు సిద్ధం చేయలేదు. నిధులపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో.. గైడ్​లైన్స్​ ఖరారు ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇక కొత్త ఆసరాపై పోయిన ఏడాది నుంచి ఊరిస్తున్నారు. గతేడాదిలోనే అర్హుల నుంచి అప్లికేషన్లు తీసుకున్నారు. దాదాపు 13.7 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త పెన్షన్లు ఈ ఏడాది ఏప్రిల్​ నుంచే మొదలు పెడతామని బడ్జెట్​లో చెప్పారు. అయితే ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. కనీసం జూన్​ నుంచి అయినా ఇస్తారనుకుంటే.. ఇప్పటికీ వెరిఫికేషన్​ ప్రాసెస్​ స్టార్ట్​ కాలేదు. గర్భిణులకు న్యూట్రిషన్​ కిట్లు, ఆడపిల్లలకు హైజీన్​ కిట్స్, లక్ష మంది భవన నిర్మాణ కార్మికులకు బైక్​లు, రూ.75 వేల లోపు క్రాప్​ లోన్ల మాఫీ వంటివి ఏవీ పట్టాలు ఎక్కలేదు.

నిధుల సర్దుబాటుపై ఆగమాగం :-
ఏప్రిల్​ నెలను ఎలాగోలా నెట్టుకొచ్చిన రాష్ట్ర సర్కార్​కు మే నెల నుంచే తిప్పలు మొదలయ్యాయి. కొత్త హామీలు మొదలుపెట్టకపోగా.. ఉన్న స్కీంలను ఎట్లా అమలు చేయాలనే దానిపై ఆగమాగమవుతున్నది. జూన్​ నెలలో రైతుబంధుకు రూ.7,400 కోట్లు, పట్టణ, పల్లె ప్రగతికి రూ.500 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇవి కాకుండా దళితబంధుకు ఈ ఫైనాన్షియల్​ ఇయర్​ లో రూ.17,700 కోట్లకు బడ్జెట్​ ఉత్తర్వులు ఇచ్చారు. వీటికి ఎంతోకొంత వచ్చే నెలలోనే ఇవ్వాలని అనుకుంటున్నారు. అయితే నిధులు ఎట్లా సర్దుబాటు చేయాలో తెలియక ఆఫీసర్లు తల పట్టుకుంటున్నారు. ఇష్టారీతిన అప్పులు చేయడం.. కొత్త అప్పులు పుట్టని ఫలితంగా అన్ని స్కీంలకు బ్రేకులు పడుతున్నాయి. మొదటి క్వార్టర్​ ముగిసే లోపు అయినా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే.. ప్రభుత్వానికి జీతాలే కష్టంగా మారుతున్నాయని ఆఫీసర్లు చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఎప్పుడు బడ్జెట్​ హామీల అమలును స్టార్ట్​ చేస్తదోనని, కొంత మందికైనా ఇస్తే కాస్త కుదుటపడతామని మెజారిటీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇటీవల ఓ మంత్రి ధైర్యం చేసి.. సీఎం దగ్గర కొత్త ఆసరాపై ప్రస్తావించినట్లు తెలిసింది. ఆయన ‘చేద్దాం’ అంటూ తల ఊపారని ఆ మంత్రి వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యేల్లో టెన్షన్.. టెన్షన్ :-
కొత్త స్కీంలు మొదలు కాకపోవడం.. పాతవాటి అమలులో ఆలస్యం అవుతుండటం తో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు టెన్షన్​ పట్టుకుంది. ఇప్పటికే కొత్త ఆసరా పెన్షన్లపై నియోజకవర్గాల్లో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వచ్చే నెల, ఆ వచ్చే నెల అని చెప్పకుంటూ వస్తున్నామని లీడర్లు అంటున్నారు. దళిత బంధు స్కీమ్​ వంద దళిత కుటుంబాలకే ఇవ్వడంతో మిగిలిన వారి నుంచి ఒత్తిడి మొదలైంది. ఈ ఏడాదిలో నియోజక వర్గానికి 1,500 మందికి ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం ఎమ్మెల్యేలకే అప్పగించింది. అయితే దీనిపై ఎలాంటి గైడ్​లైన్స్​రాకపోవడంతోఎక్కడికి వెళ్లినా తమకెప్పుడు దళితబంధు ఇస్తారని దళితుల నుంచి ప్రశ్నలు ఎదురువుతున్నాయి. ఇతర స్కీమ్​లు అమలు కాకపోవడంతో మిగిలిన వర్గాల నుంచీ వ్యతిరేకత వస్తోంది.