జనాలు ఎప్పుడూ.. సుఖం.. ఆనందం.. సంతోషం కోరుకుంటారు. అయితే ఇవి ఎక్కడ ఉంటాయో తెలియదు కాని... వాటికోసం వెంపర్లాడుతుంటారు. అయితే ఇవన్నీ మనలో ఉన్నాయని తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకునే ముందు రోగము వలన కలిగే బాధలు ఎక్కడి నుంచి వచ్చాయి.. కాశీ నుంచి వచ్చాయా.. రామేశ్వరం నుంచి వచ్చాయా.. ఇంకా ఏదైనా క్షేత్రం వచ్చాయా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి.. ఇవి అక్కడి నుంచి రాకపోయినా దేవుళ్లను ప్రార్థిస్తూ.. మీరు నా బాధలు తీర్చండి.. నా రోగాలు తగ్గించండి అని కోరుకుంటారు. బాధలు తీరినప్పుడు వచ్చే సుఖము... సంతోషం.. మన నుంచే వస్తాయి.. అన్న విషయాన్ని మాత్రం గ్రహించక ఎక్కడి నుంచో బయటి నుంచి రావాలని అనుకుంటారు.
కాలికి ముల్లు గుచ్చుకుంటే బాధపడుతుంటాం.. విలవిలలాడిపోతాం.. అదే రోడ్డుపై ఐదు వందల రూపాయిల నోటు దొరికితే ఎగిరి గంతేస్తాం.. సంతోషం.. ఆనందాన్ని వ్యక్తపరుస్తాం. దీనిని బట్టి పరిశీలిస్తే.. సుఖం.. దు:ఖం.. ఈ రెండు మనలోనుంచే వచ్చాయన్న విషయం అర్దమవుతుంది. అంటే బాధలు.. సంతోషాలు అన్నీ మనలోనే ఉన్నాయన్నమాట. మరో విషయాన్ని పరిశీలిస్తే మన లో ఉండి... మన దగ్గర దొరికే వాటి కోసం .. బయట వేరే ప్రదేశంలో ఎందుకు వెతుకున్నామో ఇప్పటికి అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది.
పాలను కవ్వంతో గట్టిగా చిలికితేనే వెన్న వస్తుంది.. వెన్నను నిప్పులపై వేడిచేస్తేనే నెయ్యి తయారవుతుంది. ఈ నెయ్యితో వివిధ రకాలు పదార్దాలను చేసుకుని తిన్నప్పుడు.. ఆనందం.. సంతోషం వ్యక్తం చేస్తాం. అలాగే మనసును .. భగవన్నామము అనే కవ్వంతో చిలికితే ఆనందమనే వెన్నతో .. భక్తి అనే విధానం ద్వారా నెయ్యిని తయారు చేసుకుని వివిధ రకాలుగా తిని సంతోషపడుతున్నాం.
అంతరంగా సాధన చేయకుండా ... బయట తిరుగుతూ.. ఇష్ం వచ్చినట్టు వ్యవహరిస్తే ఏమొస్తుంది.. ఏమీ రాదు.. గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే రక్షించాలి అంటే అది కుదరదు కదా..! బంగారాన్ని కూడా నిప్పుల కొలిమిపై కాల్చి.. సుత్తితో కొడుతూ.. పదునైన మరో ఆయుధంతో వంచితేనే మనకు కావలసిన వస్తువు తయారవుతుంది. ఆ తరువాత దానిని మనం తీసుకెళ్లి ఆనందంగా నలుగురికి చూపిస్తూ .. సంతోషంగా..మనం ధరిస్తాం... కొంతకాలం తరువాత అవసరమనుకుంటే దానిని డబ్బు రూపంలోకి మార్చుకొని సుఖపడతాం.. .
మనస్సుకు పరిమితమైనవాడు జీవుడు... మనోమూలంలోనికి వెళ్ళినవాడు దేవుడు.... అయితే మనోమూలంలోనికి వెళ్ళినవారి దేహమే దేవాలయమౌతుంది....
దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం... దీని లోపల ఉన్న ఆత్మయే దైవం... భగవంతుడిని చిత్రాలలో వెతకొద్దు ... చిత్తములో వెతకండి అని రమణమహర్షి అంటారు....
దీనిని బట్టి పరిశీలిస్తే భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు, కానీ మనకి కానరావడం లేదు అనేది స్పష్టం అవుతుంది. ఎందుకంటే .. మన మనస్సులో ఉన్న మాలిన్యాలు ..అడ్డుపడి కనపడటం లేదు. ఇలా అడ్డుపడటానికి ప్రధాన కారణాలు రెండు ఉన్నాయని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తోంది.. మొదటిది ' నేను' అనే తలంపు...రెండవది 'నాది' అన్న తలంపు...వీటిలో మొదటిది అహంకారం... ఇక రెండవది మమకారం ... ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు....
మన హృదయములో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు. ఆ పరమపవిత్రుడుని పలికించాలంటే మనమూ పవిత్రం కావాలి.... హృదయమునందున్న భగవంతుడిని పలికించాలన్నా.. ఆయనతో మాట్లాడాలన్నా.. ముందుగా అజ్ఞానము అనే మాలిన్యాన్ని తీసేయాలి... ముందురోజు శేషాలను ఎలా తొలగిస్తామో అలాగనే అంతరంగమున కర్మఫల శేషాలను తొలగించుకోవాలి... అలాగే కర్తృత్వ భావనను కూడా వదిలించుకోవాలి. మనలో ఉన్న అజ్ఞాన నిర్మాల్యమును తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము లనే ఆరుఅడ్డంకులను అధికమించాలి. అప్పుడు సత్కర్మాచరణ, సత్సంగీయుల సాంగత్యం, సర్వేశ్వరుని స్మరణ, సదవగాహన, సత్వగుణ సాధన, సేవాతత్పరత, శుద్ధాహారములతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు...
శుద్ధ ఆహారమంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, పంచేంద్రియాల ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది... మనస్సునూ, బుద్ధిని సంస్కరించుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి. మన సద్గతికి, దుర్గతికి కారణం మన మనస్సే, మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం, మన కర్మలే మన సుఖదుఃఖాలకు కారణమని గ్రహించాలి.
మనలో అనేక బలహీనతలుంటాయి... అలాగే లోకంలో అనేక ఆకర్షణలుంటాయి... ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి... హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసినా దానిని గురించి ఆలోచించం... ఇదే మాయ, శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజం, ఋషి రుణాలు తీర్చుకుంటూ ఈ దేహం శిధిలమవ్వక ముందే హృదయమందున్న దేవుడిని పట్టుకోవాలి... మానవుడు ఆనందమును అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి. అవి ఒకటి ప్రేమ, రెండుజ్ఞానం. ఈ రెండు ఉన్నప్పుడే ఏకత్వస్థితి వస్తుందని భవిష్య పురాణం ద్వారా తెలుస్తుంది.