పెద్ద లీడర్లలో కొందరే విన్నర్లు.. మంత్రుల్లో11 మంది ఓడిన్రు.. 11 మంది గెలిచిన్రు 

పెద్ద లీడర్లలో కొందరే విన్నర్లు.. మంత్రుల్లో11 మంది ఓడిన్రు.. 11 మంది గెలిచిన్రు 

పెద్ద లీడర్లలో కొందరే విన్నర్లు

బొమ్మై, డీకే, సిద్ధరామయ్య ఘనవిజయం 

కుమారస్వామి గెలుపు.. కొడుకు ఓటమి 

మాజీ సీఎం శెట్టర్ పరాజయం

మంత్రుల్లో11 మంది ఓడిన్రు.. 11 మంది గెలిచిన్రు 

కర్నాటకలో ప్రముఖుల జాతకాలు తారుమారు  

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బడా లీడర్లలో పలువురికి విజయం దక్కగా.. మరికొందరికి మాత్రం భంగపాటు ఎదురైంది. బీజేపీ నుంచి సీనియర్ నేతలు సీఎం బసవరాజ్ బొమ్మై, అరగ జ్ఞానేంద్ర, తదితరులు విజయం సాధించగా.. 11 మంది మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ సైతం ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ భారీ మెజార్టీతో గెలుపొందారు. జేడీఎస్ నుంచి కుమారస్వామి గెలవగా, ఆయన కొడుకు నిఖిల్ ఓడిపోయారు. కొత్త పార్టీ పెట్టి బరిలోకి దిగిన గాలి జనార్దన్ రెడ్డి గెలవగా, ఆయన భార్య ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు గెలవగా.. మరికొందరు ప్రముఖుల జాతకాలు తారుమారు అయ్యాయి.  

బొమ్మై.. వరుసగా నాలుగోసారి 

కర్నాటక సీఎం, బీజేపీ సీనియర్ నేత బసవరాజ్ బొమ్మై వరుసగా నాలుగోసారి షిగ్గావ్ నియోజకవర్గం నుంచి గెలిచారు. కాంగ్రెస్ కు చెందిన తన సమీప ప్రత్యర్థి యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్ పై 35,341 ఓట్ల మెజార్టీతో బొమ్మై గెలుపొందారు. బొమ్మైకి 99,073 ఓట్లు రాగా, పఠాన్ కు 63,732 ఓట్లు వచ్చాయి. జేడీఎస్ అభ్యర్థి శశిధర్ యెలిగర్ 13,794 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యడియూరప్ప కొడుకు బీవై విజయేంద్ర శికారిపుర నుంచి స్వతంత్ర అభ్యర్థి ఎస్పీ నాగరాజగౌడపై 11,008 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తీర్థహళ్లి నుంచి హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర, మల్లేశ్వరం నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి సీఎన్ అశ్వత్థ్ నారాయణ్, నారాగుండ్ నుంచి పీడబ్ల్యూడీ మంత్రి సీసీ పాటిల్, పద్మనాభ నగర్ నుంచి రెవెన్యూ మినిస్టర్ ఆర్.అశోక గెలిచారు. అశోక కనకపుర నుంచి కూడా పోటీ చేయగా.. అక్కడ మాత్రం ఆయన ఓడిపోయారు. 

లక్ష్మణ్ సావడికి 76 వేల ఓట్ల మెజారిటీ  

ఎన్నికలకు ముందే బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్  సావడి.. అథని నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి మహేశ్ కుమథళ్లిపై 76,122 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మాజీ డిప్యూటీ సీఎం, కేపీసీసీ మాజీ చీఫ్ ​జి.పరమేశ్వర కొరటగెరె నుంచి 14,347 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామలింగారెడ్డి బీటీఎం లేఅవుట్ నుంచి, మరో వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఖండ్రే భల్కీ నుంచి గెలిచారు. కాంగ్రెస్‌ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గే చిత్తాపూర్ స్థానం నుంచి వరుసగా మూడోసారి గెలుపొందారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, ఏడు సార్లు ఎంపీ అయిన కేహెచ్ మునియప్ప తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి దావనహళ్లి నుంచి విజయం సాధించారు.  

శెట్టర్ కు పరాభవం 

ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ సీఎం, లింగాయత్ వర్గం నేత జగదీశ్ శెట్టర్ కు ఈ ఎన్నికల్లో పరాభవం ఎదురైంది. హుబ్లీ- ధార్వాడ్ సెంట్రల్ నుంచి బరిలోకిన ఆయన.. బీజేపీ అభ్యర్థి మహేశ్ టెంగినకై చేతిలో 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

కుమారస్వామి గెలుపు..కొడుకు నిఖిల్ ఓటమి 

జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి చెన్నపట్న నియోజకవర్గం నుంచి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి యోగేశ్వరపై 15,915 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. అయితే, రామనగర సీటులో బరిలోకి దిగిన కుమారస్వామి కొడుకు, హీరో నిఖిల్ కుమారస్వామి గౌడ మాత్రం ఓడిపోయారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్13,459 ఓట్ల తేడాతో గెలిచారు. జేడీఎస్ నుంచి కుమారస్వామి సోదరుడు హెచ్ డీ రేవణ్ణ హోలెనరసిపుర నుంచి 3,152 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

సిద్దు 9వ సారి, డీకే 8వ సారి.. 

మాజీ సీఎం సిద్ధరామయ్య.. వరుణ నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు. బీజేపీకి చెందిన తన సమీప ప్రత్యర్థి, హౌసింగ్ మినిస్టర్ సోమణ్ణపై 46 వేల ఓట్ల మార్జిన్ తో గెలుపొందారు. సిద్దూకు మొత్తం 1,19,430 ఓట్లు రాగా, సోమణ్ణకు 73,424 ఓట్లు వచ్చాయి. సిద్దూ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఇది 9వ సారి. ఇక కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ వరుసగా 8వ సారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన 1,21,595 భారీ మెజారిటీతో గెలిచారు. డీకేకు మొత్తం 1,42,156 ఓట్లు వచ్చాయి. కనకపుర నుంచి డీకే గెలవడం ఇది వరుసగా నాలుగోసారి.

11 మంది మంత్రులు, స్పీకర్ ఓడిన్రు 

అసెంబ్లీ ఎన్నికల్లో 11 మంది మంత్రులు ఓడిపోగా, మరో 11 మంది మంత్రులు గెలిచారు. ఎన్నికల్లో ఓటమిపాలైన మంత్రుల్లో ఇరిగేషన్ మినిస్టర్ గోవింద్ కరజోల, రవాణా శాఖ మంత్రి శ్రీరాములు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ మంత్రి సోమణ్ణ, న్యాయ శాఖ మంత్రి జేసీ మధు స్వామి, ఇండస్ట్రీస్ మినిస్టర్ మురుగేశ్, వ్యవసాయ మంత్రి బీసీ పాటిల్, హెల్త్ మినిస్టర్ సుధాకర్, చిన్న తరహా పరిశ్రమల మంత్రి ఎంటీబీ నాగరాజ్, స్పోర్ట్స్ మినిస్టర్ కేసీ నారాయణగౌడ, విద్యా శాఖ మంత్రి నాగేశ్, టెక్స్ టైల్ మినిస్టర్ శంకర్ పాటిల్ ఉన్నారు. అలాగే, అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కగేరి సైతం సిర్సి సీట్లో ఓడిపోయారు.