కల్వకుంట్ల ఫ్యామిలీకి రేవంత్ ఫోబియా : విప్ ఆది శ్రీనివాస్

కల్వకుంట్ల ఫ్యామిలీకి రేవంత్ ఫోబియా : విప్ ఆది శ్రీనివాస్
  • సీఎం అంటే కేసీఆర్‌‌‌‌‌‌‌‌, కేటీఆర్‌‌‌‌‌‌‌‌, హరీశ్‌‌‌‌, కవిత వణుకుతున్నరు: విప్ ఆది శ్రీనివాస్ 

న్యూఢిల్లీ, వెలుగు: కల్వకుంట్ల కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి ఫోబియా పట్టుకుందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సీఎం పేరు చెబితేనే.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత చలి జ్వరంతో వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. రేవంత్‌‌‌‌కే కేసీఆర్ ఫోబియా పట్టుకుందని కేటీఆర్ ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డికి ప్రజా సంక్షేమం గురించి ఆలోచించడానికే సమయం సరిపోవడం లేదన్నారు.

బీసీ రిజర్వేషన్లపై రేవంత్‌‌‌‌కు ఎంత చిత్తశుద్ధి ఉందో.. తెలంగాణలో ఏ బీసీ బిడ్డను అడిగినా చెబుతారన్నారు. మూడ్రోజుల పాటు బీసీ బిల్లు ఆమోదం కోసం కేంద్రంతో సీఎం నేతృత్వంలో చేసిన పోరుబాట ఉద్యమం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. 

కానీ.. కేటీఆర్ మాత్రం తప్పంతా తెలంగాణ ప్రభుత్వానిదే అన్నట్టు మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అడ్డుపడుతున్నారని కనిపిస్తోన్నా.. బీజేపీని పల్లెత్తు మాట అనకపోవడం దేనికి నిదర్శమని ప్రశ్నించారు. మోదీ, షా అంటే కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు ఎందుకంత ప్రేమో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ సహచర ఒప్పందానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలని ప్రశ్నించారు. 

ఫస్ట్ ఫ్యామిలీ పంచాయితీని చక్కదిద్దుకొని, ఆ తర్వాత కేటీఆర్ బయటి వాళ్ల గురించి మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. బీసీలపై బీఆర్ఎస్‌‌‌‌కు నిజంగా ప్రేమ ఉంటే జంతర్ మంతర్‌‌‌‌‌‌‌‌లో ధర్నాకు మద్దతు తెలిపే వారన్నారు. ఇప్పుడు మోదీ బీసీ రిజర్వేషన్లను అమలు చేయకపోతే.. రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకొని బీసీలకు న్యాయం చేస్తామన్నారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ చెబితే.. బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తోందని కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పదేండల్లో బీసీలకు ఏమీ చేయడం చేతకాని బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్‌‌‌‌ను విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందన్నారు.