వేములవాడ/జగిత్యాల రూరల్, వెలుగు: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మరణం పట్ల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మరణం తెలంగాణకు తీరని లోటని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ పాటను ప్రభుత్వం రాష్ట్ర గేయంగా గుర్తించిందని చెప్పారు. ఈ విషాద సమయంలో అందెశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జగిత్యాల తహసీల్ చౌరస్తాలో నిర్వహించిన ర్యాలీలో జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.
సిరిసిల్లలో కొవ్వొత్తులతో ర్యాలీ
సిరిసిల్ల టౌన్, వెలుగు: తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ అకాల మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యాయుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సిరిసిల్లలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అందెశ్రీ తన రచనల ద్వారా తెలంగాణ ఉద్యమంలో ఎంతో మందిని చైతన్యపరిచారన్నారు. తన గేయం, గళం, కలంతో ఉద్యమాన్ని ఉత్తేజితం చేశారన్నారు. కార్యక్రమంలో టీచర్ జేఏసీ చైర్మన్ మోతిలాల్, సభ్యులు శ్రీనివాస్, విజయకుమార్, రఘోత్తం, గంగరాం, సుధాకర్ రెడ్డి, అడ్వకేట్ సాయి కుమార్, శర్మన్ నాయక్
పాల్గొన్నారు
