నేను మంత్రిపదవి ఆశిస్తున్నా: విప్ బీర్ల ఐలయ్య

నేను మంత్రిపదవి ఆశిస్తున్నా:  విప్ బీర్ల ఐలయ్య
  • కేబినెట్ లో గొల్లకురుమలు లేరు
  • మీడియాతో చిట్ చాట్​లో విప్ బీర్ల ఐలయ్య

హైదరాబాద్, వెలుగు: తాను మంత్రిపదవిని ఆశిస్తున్నానని విప్  బీర్ల ఐలయ్య తెలిపారు. రాష్ర్ట జనాభాలో 50 లక్షలకు పైగా ఉన్న  గొల్లకురుమలు.. కేబినెట్ లో ఒక్కరూ లేరని ఆయన గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు గొల్లకురుమలు ఎంతో కృషి చేశారన్నారు. సోమవారం అసెంబ్లీలోని తన చాంబర్ లో మీడియాతో ఐలయ్య చిట్ చాట్  చేశారు. బర్లు, గొర్లు ఇచ్చామని కేసీఆర్ అంటే ఆయన్ని ఎన్నికల్లో చిత్తుగా ఓడించామన్నారు. నల్గొండ ఎంపీ పరిధిలో ఇద్దరు మంత్రులు ఉంటే, భువనగిరి ఎంపీ పరిధిలో ఒక్క మంత్రి కూడా లేరని, ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని, ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. 

కేబినెట్ లో గొల్లకురుమలు లేరని, తొలిసారి ఆ సామాజికవర్గం వారికి మంత్రిపదవి ఇవ్వాలన్నారు. ఏపీలో గొల్లకురుమలకు మూడు మంత్రిపదవులు ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మంత్రిపదవితో పాటు  ఒక ఎమ్మెల్సీ, ఒక సలహాదారు పోస్టు, ఐదు కార్పొరేషన్లు, పీసీసీ చీఫ్  పోస్ట్, పార్టీ వర్కింగ్  ప్రెసిడెంట్  పోస్టు ఇవ్వాలని ఐలయ్య కోరారు. బీఆర్ఎస్  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటామని, ప్రజాపాలన నచ్చి తమ పార్టీలో చేరుతున్నారని ఆయన చెప్పారు. విభజన అంశాలపై ఇద్దరు సీఎంలు చర్చలు జరపడం అభినందనీయమని, రానున్న రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం ఉందన్నారు. సర్కారు స్కీ మ్స్ కు కేంద్రం నుంచి నిధులు వస్తాయని, ఇన్ టైమ్ లో మ్యాచింగ్ గ్రాంట్ కూడా ప్రభుత్వం విడుదల చేస్తుందని ఐలయ్య వెల్లడించారు.