అమెరికా సర్కార్ షట్డౌన్... 7.5 లక్షల మంది ఉద్యోగులకు తాత్కాలిక సెలవు

అమెరికా సర్కార్ షట్డౌన్... 7.5 లక్షల మంది ఉద్యోగులకు తాత్కాలిక సెలవు
  • సెనేట్​లో వీగిపోయిన ఫెడరల్ ఫండింగ్ బిల్లు
  • ఎమర్జెన్సీ ఉద్యోగులకూ జీతాల్లేవ్​ 
  • మిలిటరీ, ఇతర అత్యవసర సేవలు మినహా మిగతా విభాగాలు క్లోజ్​

వాషింగ్టన్ డీసీ: అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. కీలకమైన ఫండింగ్ బిల్లు ఆమోదం పొందకుండా సెనేట్​లో ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ అడ్డుకోవడంతో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సర్కారు మూతపడింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత షట్ డౌన్ అమలులోకి వచ్చింది. దీంతో ఫెడరల్ సర్కారులో అత్యవసరమైన విభాగాలు తప్ప, మిగతా అత్యవసరం కాని విభాగాలన్నీ తాత్కాలికంగా మూతపడ్డాయి. 

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు సంబంధించిన సబ్సిడీలను పొడిగించే బిల్లును సెనేట్ లో రిపబ్లికన్లు అడ్డుకోవడంతో.. అందుకు ప్రతీకారంగా ఫెడరల్ ఫండింగ్ బిల్లుకు ఓకే చెప్పే ప్రసక్తే లేదని డెమోక్రాట్లు అడ్డుకున్నారు. దీంతో కీలకమైన ఫండింగ్ బిల్లు చట్టరూపం దాల్చకపోవడంతో బుధవారం నుంచి షట్ డౌన్ మొదలైంది. ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ అయితే గనక.. అత్యవసరం కాని ఉద్యోగులను శాశ్వతంగా ఇంటికి పంపుతానని, డెమోక్రాట్లు అనుకూలంగా ఉన్న పథకాలను సైతం పూర్తిగా రద్దు చేస్తానని మంగళవారం డెడ్ లైన్​కు ముందే ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితి ఎన్ని రోజులు కొనసాగుతుందన్న దానిపై సందిగ్ధం నెలకొంది.

ఆరేండ్ల తర్వాత మళ్లీ..  

ఫెడరల్ ప్రభుత్వానికి అవసరమైన నిధుల వినియోగం కోసం ఏటా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యేలోపు ఫండింగ్ లెజిస్లేషన్ ను కాంగ్రెస్ ఆమోదించాల్సి ఉంటుంది. గడువులోగా ఆమోదించకపోతే ఫెడరల్ సర్కారు తాత్కాలికంగా షట్ డౌన్ అవుతుంది. ట్రంప్ ఫస్ట్ టర్మ్​లో 2018లో అత్యధికంగా 5 వారాలు ఫెడరల్ ప్రభుత్వం క్లోజ్ అయింది. ఆరేండ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఆయన హయాంలోనే షట్ డౌన్ అయింది.

ఇవి పని చేస్తాయి.. 

ఫెడరల్ ప్రభుత్వ షట్ డౌన్ సమయంలో మిలిటరీ, ఇతర అత్యవసర సేవల ఉద్యోగులు విధుల్లోనే కొనసాగుతారు. కానీ వారికి షట్ డౌన్ ముగిసేవరకూ జీతభత్యాలు అందవు. మిలిటరీ, హాస్పిటల్స్, లా ఎన్ ఫోర్స్ మెంట్, ఎయిర్ ట్రాఫిక్ వంటి విభాగాలు పని చేస్తాయి. సామాజిక భద్రతా పథకాలకు చెల్లింపులు, మెడికేర్ స్కీం చెక్కుల వంటివి యథావిధిగా జరుగుతాయి. ఎఫ్ డీఏ కార్యకలాపాలు, వ్యవసాయ శాఖ, ఇమిగ్రేషన్ క్రాక్ డౌన్ వంటివి కూడా కొనసాగుతాయి. 

ఇవి ఆగిపోతాయి.. 

అత్యవసరం కాని విభాగాల ఉద్యోగులందరినీ తాత్కాలికంగా అన్ పెయిడ్ లీవ్​లో పంపిస్తారు. షట్ డౌన్ ముగిసిన తర్వాత వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటారు. కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనాల ప్రకారం.. షట్ డౌన్ సమయంలో 7.50 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులపై తాత్కాలికంగా ప్రభావం పడనుంది. అలాగే, ఫెడరల్ ప్రభుత్వ నిధులతో నడిచే ఫుడ్ అసిస్టెన్స్ పథకాలు, గవర్నమెంట్ ప్రీస్కూల్స్, స్టూడెంట్లకు లోన్ల మంజూరు వంటివి ఆగిపోతాయి. నేషనల్ పార్కులు, మ్యూజియాల వంటివి పూర్తిగా మూతపడతాయి.  

దీర్ఘకాలం కొనసాగితే.. ఎకానమీపై ఎఫెక్ట్ 

ఫెడరల్ సర్కారు కొద్దిరోజుల పాటు షట్ డౌన్ అయితే దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండదని ఎక్స్ పర్ట్ లు చెప్తున్నారు. ఒకవేళ ఈ షట్ డౌన్ సుదీర్ఘకాలం సాగితే గనక.. ఆర్థిక వృద్ధి మందగిస్తుందని, మార్కెట్లు పతనం కావడం, ప్రజా విశ్వాసం సన్నగిల్లడం వంటివి జరుగుతాయని అంటున్నారు.