
- షట్ డౌన్ నేపథ్యంలో ట్రంప్ సర్కారు నిర్ణయం
- వైట్ హౌస్ బడ్జెట్ ఆఫీస్ డైరెక్టర్ ట్వీట్
వాషింగ్టన్: అమెరికాలో షట్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఫెడరల్ ఉద్యోగుల సామూహిక తొలగింపు (మాస్ ఫైరింగ్స్) లు చేపడుతున్నట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ద్రవ్య బిల్లులకు ఓకే చెప్పేలా డెమోక్రాట్లపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వం వద్ద మరో మార్గంలేకపోయిందని వైట్ హౌస్ బడ్జెట్ ఆఫీసు అధికారులు తెలిపారు. శుక్రవారం నుంచే తొలగింపుల ప్రక్రియ మొదలైందని బడ్జెట్ ఆఫీస్ డైరెక్టర్ రస్ వాట్ ట్వీట్ చేశారు. అయితే, ఏయే విభాగాల ఉద్యోగులను తొలగించారు, ఎంతమందికి ఉధ్వాసన పలికారనే వివరాలను ఆయన వెల్లడించలేదు.
తొలగింపుల వార్తలను బడ్జెట్ ఆఫీస్ అధికార ప్రతినిధి కూడా నిర్ధారించారు. అయితే, ఇతర వివరాలను ఆయన కూడా బయటపెట్టలేదు. కాగా, షట్ డౌన్ కారణంగా అన్ పెయిడ్ లీవ్ పై పంపించిన ఫెడరల్ ఉద్యోగులకు ఈ కాలానికి (లీవ్) వేతనాలు చెల్లించబోమని ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. డెమోక్రాట్ నేతలు బిల్లులకు ఆమోదం తెలపకపోతే అత్యవసరం కాని ఉద్యోగులను తొలగిస్తానని కూడా ఇటీవల హెచ్చరించారు. అయినా డెమోక్రాట్లు దిగిరాకపోవడంతో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ షురూ చేసినట్లు అధికారులు తెలిపారు.