
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో టీమిండియా టూర్ రద్దయిన నేపథ్యంలో.. తమతో వైట్ బాల్ సిరీస్ ఆడాలని బీసీసీఐని శ్రీలంక బోర్డు కోరింది. ఒకవేళ ఇది కార్యరూపం దాల్చితే టెస్ట్, టీ20లకు దూరమైన స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలోకి దిగే చాన్స్ ఉంది. అయితే దీనిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ‘లంక బోర్డు నుంచి ఓ అభ్యర్థన వచ్చింది. దానిపై మేం నిర్ణయం తీసుకోలేదు. ఆసియా కప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నాం. నిర్ణయం తీసుకునే ముందు ప్లేయర్లు, కోచ్‌లతో సంప్రదింపులు జరపాలి’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా లార్డ్స్ టెస్ట్ కోసం లండన్‌లో ఉన్నాడు.
మ్యాచ్ సందర్భంగా చీఫ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సిరీస్‌కు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆగస్టు 17 నుంచి 31 వరకు మూడు టీ20లు, మూడు వన్డేలు జరుగుతాయి. మరోవైపు ఆసియా కప్‌పై రాబోయే రెండు రోజుల్లో కీలక నిర్ణయం వెలువడే చాన్స్ ఉంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌తో సంబంధాలు మరింత దెబ్బతిన్న నేపథ్యంలో ఆతిథ్య బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే ఆసియా కప్ సెప్టెంబర్ 10 నుంచి 28 వరకు జరిగే అవకాశం ఉంది.