విశ్లేషణ: రావత్ మరణం దేశానికి నష్టం

విశ్లేషణ: రావత్ మరణం దేశానికి నష్టం

చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్(సీడీఎస్) జనరల్​ బిపిన్​ రావత్​ దుర్మరణం దేశం మొత్తాన్ని షాక్​కు గురిచేసింది. 2017 నుంచి ఇండియన్​ ఆర్మీ చీఫ్​గా.. 
ఆ తర్వాత సీడీఎస్​గా వివిధ హోదాల్లో పనిచేసిన జనరల్​ రావత్​కు మన దేశ సైనిక శక్తి సామర్థ్యాల గురించి క్షుణ్ణంగా తెలుసు. దేశంలోని అన్ని సాయుధ దళాలకు ఇప్పుడు ఆయనే హెడ్. ఆయన నేతృత్వంలో మన దేశం ఎన్నో కఠినమైన సైనిక సవాళ్లను ఎదుర్కొంది. రావత్​ కుటుంబంలో కూడా ఇది తీవ్ర విషాదాన్ని నింపింది. కానీ ఎన్ని అడ్డంకులు ఎదురైనా దేశాలు ముందుకు సాగాల్సి ఉంది. ప్రతికూలతలు, సవాళ్లను అధిగమిస్తూ ముందుకెళ్లాలి. ప్రస్తుతం హెలికాప్టర్​ ప్రమాదం గురించి దేశమంతటా తీవ్రమైన చర్చ జరుగుతోంది. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? లేదంటే మానవ తప్పిదం వల్లే జరిగిందా? అనేది పూర్తి విచారణ తర్వాతే వెల్లడవుతుంది. కానీ, ఆ విచారణలు దేశానికి ఎంతో విలువైన జనరల్​ రావత్​ను మాత్రం తిరిగి తీసుకురాలేవనేది నిజం.

దేశంలోని ఏ రాజకీయ నాయకుడికన్నా కూడా మన దేశ మిలిటరీ శక్తిసామర్థ్యాలపై పూర్తి అవగాహన ఉన్నది జనరల్​ బిపిన్​ రావత్​కు మాత్రమే. ఆ సామర్థ్యమే శత్రు దేశాల నుంచి ఎదురైన కఠిన సవాళ్ల నుంచి ఎన్నోసార్లు దేశాన్ని గట్టెక్కించింది. మరోవైపు ఆ సామర్థ్యమే శత్రు దేశాల నుంచి ఆయనకు ముప్పును కూడా తెచ్చిపెట్టింది. 1947 తర్వాత చైనా, పాకిస్తాన్​ నుంచి ప్రతి ఇండియన్​ జనరల్​ కూడా ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొన్నారు. 2020 మార్చి తర్వాత ఎక్కువ ప్రమాదకరమైన సవాళ్లు ఎదురైంది మాత్రం జనరల్​ రావత్​కే. 

రావత్​ పనిని ఎలా కొనసాగిస్తరు?
దాదాపు 40 ఏండ్ల క్రితం అప్పటి చైనా సుప్రీం లీడర్​ డెంగ్ షిపింగ్​ ‘‘నువ్వు సిద్ధమయ్యే వరకు, నీ సామర్థ్యాన్ని దాచుకో”అని ఒక మాట చెప్పారు. 2020 మార్చిలో చైనా తన సామర్థ్యాన్ని దాచుకోవాల్సిన పని లేదని నిర్ణయించుకుంది. ఇండియాతో నేరుగా యుద్ధానికి సిద్ధమైపోయింది. లడాఖ్​కు సమీపంలో లక్ష మందికిపైగా సైనిక బలగాలను మిస్సైళ్లు, రాకెట్లతో మోహరించి కయ్యానికి కాలుదువ్వింది. ఏ దేశమైనా శాంతియుతంగా, శత్రువులు లేకుండా ఉంటే ఆర్మీ ఆఫీసర్లకు ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. కానీ, 7 వేల కిలోమీటర్ల బార్డర్​ను చైనా, పాకిస్తాన్​తో పంచుకుంటున్న మనదేశానికి ప్రతి రోజూ అక్కడ యుద్ధ వాతావరణమే ఉంటుంది. అందువల్ల మనదేశం జనరల్స్​కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అందువల్లే జనరల్​రావత్​కు ఎక్కువ ప్రాముఖ్యత దక్కింది. కానీ, ఇప్పుడు రావత్ ఆకస్మిక మరణం వల్ల ఎంతో కీలకమైన, ప్రాముఖ్యత కలిగిన ఆయన ప్లేస్​ను ఎలా భర్తీ చేయగలమనే ప్రశ్న ఎదురవుతోంది. జనరల్​ రావత్​స్థానంలోకి మరో జనరల్​ రావచ్చు. జనరల్​ రావత్​ కోసం స్మారకాలను నిర్మించవచ్చు. అయితే జనరల్​ రావత్​ పనిని ఎలా కొనసాగించాలనే దానికి మనదేశం పరిష్కారాలను చూడాల్సి ఉంది.

జనరల్​ రావత్​ విజయాల్లో కొన్ని.. ఇండియన్​ జనరల్స్​ అందరూ కూడా చైనా, పాకిస్తాన్​ నుంచి ముప్పును ఎదుర్కొన్నారు. కొన్ని సమయాల్లో ఇతర దేశాల టెర్రరిస్టుల నుంచి కూడా వారికి సవాళ్లు ఎదురయ్యాయి. కానీ, జనరల్​ రావత్​ మనదేశానికి మొట్టమొదటి చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్(సీడీఎస్)​. దేశంలోని సాయుధ దళాలకు ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. మొత్తం ఇండియన్​ ఆర్మీని సమన్వయపరిచేది ఆయనే. పాకిస్తాన్, చైనా రెండింటితో ఒకేసారి యుద్ధం మొదలైతే ఎలా ఎదుర్కోవాలనేది రావత్​ ఎప్పటికప్పుడు నిర్ణయించుకోవాల్సి వచ్చేది.2020 మార్చి తర్వాత చైనా నుంచి ఎదురై ఎన్నో సవాళ్లను జనరల్​ రావత్​ సమర్థంగా ఎదుర్కొన్నారు. మనదేశం చైనా హిమాలయ ముప్పును ఎదుర్కోగలదా లేక ప్రభుత్వం యుద్ధాన్ని నివారించాలా అనే విషయాన్ని ప్రధానికి రావత్​ తెలియజేయాల్సి వచ్చింది. ఒకవేళ రెండు వైపుల నుంచి యుద్ధం వస్తే మనదేశం తప్పక పోరాడాలని, ఆ యుద్ధంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోకూడదని ప్రధానికి సలహా ఇచ్చారు. 
 

జనరల్​ రావత్​ ఇచ్చిన హామీ ఆధారంగా, కేంద్ర ప్రభుత్వం చైనాకు వ్యతిరేకంగా కఠిన  వైఖరిని తీసుకుంది. ఇండియా యుద్ధానికి సిద్ధపడుతుందని చైనా అస్సలు ఊహించలేదు. మంచుతో కప్పుకున్న హిమాలయ ప్రాంతాలకు వేలాది మంది సైనికులను తరలించడాన్ని ఇండియా మొదలుపెట్టడంతో చైనా షాక్​కు గురైంది. ఇది దేశానికి జనరల్​ రావత్​ చేసిన గొప్ప సేవల్లో ఒకటి. చైనా, పాకిస్తాన్‌తో ఇండియా పోరాడగలదని జనరల్‌ రావత్‌ కచ్చితంగా చెప్పారు. సినిమా హీరోలా తప్పుడు సలహాలు ఇచ్చి దేశాన్ని నాశనం చేయకుండా సరైన అడ్వయిజ్​ ఇచ్చారు. జనరల్ రావత్ సరిగ్గా అంచనా వేసి ముందుగా దౌత్యపరంగా ప్రయత్నించమని ప్రభుత్వానికి సూచించారు. దౌత్యం విఫలమైతే, అప్పుడు చైనాతో యుద్ధానికి మనదేశం సిద్ధం కావాలని చెప్పారు. దీని ద్వారా ఇండియా యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కానీ యుద్ధానికి సిద్ధంగా ఉందని చాటిచెప్పారు.

కొత్త పాలసీలు ఎట్లుంటయో?
మరోవైపు రావత్​ మరణంతో ఇప్పుడు మన పాలసీలు ఎలా ఉండబోతున్నాయనే విషయంపై శత్రు దేశాలు కూడా కొత్తగా అంచనాలు వేసుకోవాలి. ముఖ్యంగా, చైనా, పాకిస్తాన్​ కొత్తగా నియమితులయ్యే చీఫ్​ పనితీరు గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తాయి. సుమారు 2,500 ఏండ్ల క్రితం జీవించిన చైనాకు చెందిన గొప్ప ఫిలాసఫర్​ సన్​త్జు ‘‘వంద యుద్ధాలు చేసి వంద విజయాలు సాధించడం నైపుణ్యం కాదు.. యుద్ధం చేయకుండా శత్రువును లొంగదీసుకోవడమే అతి గొప్ప నైపుణ్యం”అని ఒక మాట చెప్పారు. దానిని చైనా నాయకత్వం నేటికీ అనుసరిస్తోంది. మనదేశాన్ని మానసికంగా దెబ్బతీయడానికి, తన సైనిక సామర్థ్యాన్ని చూపించి భయపెట్టడానికి చైనా ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ, జనరల్​ బిపిన్​ రావత్​ చైనా ఆటలను సాగనీయ లేదు. సైకాలజీలో చైనీయులను మించిపోయి మేం యుద్ధానికి సిద్ధం అంటూ సంకేతాలిచ్చి వారినే వెనక్కి పంపారు. నిజంగా రావత్​ చైనాతో యుద్ధానికి సిద్ధపడ్డారా? అని ఆలోచిస్తే.. అందుకు ఆయన సర్వసన్నద్ధంగా ఉన్నారనే జవాబే వస్తుంది. అది తెలుసు కాబట్టే చైనా వెనకడుగు వేసింది. ద గ్రేట్​ యూరోపియన్ చక్రవర్తి నెపోలియన్​ను 200 ఏండ్ల క్రితం యుద్ధానికి ఎలాంటి జనరల్స్ కావాలని ఒక ప్రశ్న అడిగారు. దానికి నెపోలియన్ ‘‘లక్కీ జనరల్స్”కావాలని సమాధానం ఇచ్చారు. జనరల్ రావత్ కూడా భరత మాతకు ఒక లక్కీ జనరల్.

రావత్​ మరణం దేశానికి నష్టమే..
ఎవరినైనా భర్తీ చేయడం అంత సులువు కాదు. అందులోనూ జనరల్​ బిపిన్​ రావత్​లాంటి వారిని రిప్లేస్​ చేయడం సాధ్యం కాదు. సుదీర్ఘ అనుభవం, లోతైన అవగాహన, జ్ఞానం జనరల్​ రావత్​ సొంతం. 2020 మార్చి తర్వాత యుద్ధాన్ని తలపించే పరిస్థితుల్లో బలగాలకు నాయకత్వం వహించారు. తన వ్యూహాలతో చైనా మొదటి బుల్లెట్​ పేల్చడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా చేశారు. చైనా, పాకిస్తాన్​ నుంచి ఎదురయ్యే సవాళ్ల గురించి ఏ రోజుకు ఆ రోజు రావత్​ బేరీజు వేసే వారు. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకునేవారు. ఇప్పుడు ఆ నాలెడ్జ్​ మొత్తం పోయింది. కొత్త చీఫ్​ త్వరలోనే వస్తారు. కానీ 2020 మార్చి నుంచి జనరల్​ రావత్​ సంపాదించిన నాలెడ్జ్, అనుభవం ఆయనకు ఉండకపోవచ్చు. రావత్​ ఆకస్మిక మరణం ఆయన అనుభవాన్ని, నాలెడ్జ్​ను మరొకరికి పంచే అవకాశం లేకుండా పోయింది. - పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్