కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్‌‌ రిపేర్‌‌ ఖర్చులు భరించిందెవరు?

కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్‌‌ రిపేర్‌‌ ఖర్చులు భరించిందెవరు?

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు:  మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లతో తమకు సంబంధం లేదని కాంట్రాక్ట్‌‌ సంస్థ ఎల్‌‌‌‌అండ్‌‌‌‌టీ తేల్చిచెప్పిన నేపథ్యంలో.. గతంలో కన్నెపల్లి పంప్​హౌస్‌‌ రిపేర్ల ఖర్చు ఎవరు భరించారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ల ఖర్చును ఎల్‌‌‌‌అండ్‌‌‌‌టీ కంపెనీయే భరిస్తుందని అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇంజినీరింగ్ ఆఫీసర్లు, బీఆర్ఎస్ సర్కారు పెద్దలు చెప్పారు. గతేడాది కన్నెపల్లి పంప్​హౌస్ విషయంలోనూ ఇలానే చెప్పారు. అప్పట్లో కన్నెపల్లి పంప్​హౌస్ రిపేర్లు, కొత్త మోటార్ల కొనుగోలుకు రూ.1,200 కోట్లకు పైగా ఖర్చుచేశారు. ఈ మొత్తాన్ని కాంట్రాక్ట్ సంస్థ మేఘా ఇంజినీరింగ్ కంపెనీ భరిస్తుందని చెప్పారు. కానీ లోలోపల ఏం జరిగిందో ఎవరికీ తెలియరాలేదు. 

తీరా మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లను భరించాల్సింది తాము కాదని ఎల్​అండ్​టీ సంస్థ తేల్చిచెప్పడంతో.. అప్పటి కన్నెపల్లి పంప్​హౌస్ రిపేర్లను మేఘా సంస్థ భరించిందా? లేదంటే మేఘా పేరుతో సర్కారే ఖర్చుపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

పంప్‌‌హౌస్ రిపేర్లపై ఎన్నో అనుమానాలు

గోదావరి వరదల వల్ల గతేడాది జులై 14న కన్నెపల్లి, అన్నారం పంప్​హౌస్​లు నీటమునిగాయి. వీటిలో కీలకమైన కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్‌‌కు ఎక్కువ నష్టం జరిగింది. వరదల నుంచి పంప్​హౌస్​ రక్షణ కోసం కట్టిన‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ వాల్‌‌‌‌ కూలిపోయి మోటర్ల మీద పడింది. మొదట్లో దీన్ని చిన్న ప్రమాదంగా చూపేందుకు సర్కారు ప్రయత్నించింది. కేవలం రూ.25 కోట్ల నష్టం మాత్రమే జరిగిందని, ఆ మొత్తాన్ని కూడా కాంట్రాక్ట్‌‌ ‌‌సంస్థే భరిస్తుందని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌‌‌‌ కుమార్‌‌ ‌‌ప్రకటించారు. ఆ తర్వాత డీ వాటరింగ్ చేశారు. నీళ్లు తగ్గాకగానీ ప్రమాద తీవ్రత ఆఫీసర్లకు తెలియలేదు. మొత్తం 17 మోటార్లు దెబ్బతినగా, ఆరు మోటార్లు తుక్కుతుక్కయ్యాయి. కంట్రోల్‌‌ రూం పూర్తిగా నీటమునగడంతో కంట్రోల్‌‌ ప్యానెల్స్‌‌‌‌, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రిక్ పరికరాలు పనికిరాకుండా పోయాయి. దీంతో నష్టం రూ.వెయ్యి కోట్లు దాటినట్లు ఆఫీసర్లు ప్రకటించారు. 

పంప్​హౌస్​ల నిర్మాణంలో మేఘా కంపెనీ​నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని, కీలకమైన కాంక్రీట్ గోడను నాసిరకంగా కట్టడం వల్ల మూడేండ్లకే పగిలిపోయిందని రిటైర్డ్ ఇంజినీర్లు, ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కన్నెపల్లి పంప్​హౌస్ రిపేర్ల ఖర్చంతా కాంట్రాక్ట్ సంస్థే భరిస్తుందని, ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదని అప్పటి సర్కారు పెద్దలు, ఇంజనీరింగ్ ఆఫీసర్లు ప్రకటించారు. మొత్తం మీద కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్‌‌ డీవాటరింగ్, ఖరాబైన 17 మోటార్లలో 11 మోటార్ల రిపేర్లు, స్కాడా సిస్టమ్‌‌‌‌, కంట్రోల్‌‌‌‌ ప్యానెళ్లు, ఆటోమేటెడ్‌‌‌‌ అడ్వాన్స్‌‌డ్‌‌ ‌‌ఎయిర్‌‌ ‌‌కండీషన్‌‌ సిస్టమ్‌‌‌‌, ఇతరత్రా రిపేర్‌‌‌‌ వర్క్‌‌‌‌ల కోసం రూ.1,200 కోట్లకుపైగా ఖర్చు చేశారు. 6 మోటర్లకు కొత్తగా ఆర్డర్ ఇచ్చారు. ఈ పనులన్నింటినీ నాన్‌‌‌‌ ఈపీసీ కింద చేపట్టడం, పంప్‌‌‌‌హౌస్‌‌ ప్రారంభించి అప్పటికే రెండేళ్లు గడిచిపోవడంతో ఖర్చును మేఘా కంపెనీ భరించిందా? లేదంటే అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఇప్పటిలాగే అబద్ధాలు చెప్పిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మేడిగడ్డపై అన్నీ అబద్ధాలే

అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో 22న ప్రాజెక్టు ఇంజినీర్లు, ఎల్​అండ్​టీ సంస్థ ప్రతినిధులు కలిసి పరిశీలించారు. బ్యారేజీ ఇప్పటికీ ఎల్​అండ్​టీ ఆధీనంలోనే ఉన్నందున పునరుద్ధరణ పనుల పూర్తి బాధ్యత ఆ సంస్థే తీసుకుంటుందని అదే రోజు మేడిగడ్డ ఈఈ తిరుపతి రావు ప్రకటించారు. బ్యారేజీలోని ఏడో బ్లాక్​ను తామే పునరుద్ధరిస్తామని ఎల్​అండ్​టీ సంస్థ పేరుతో నవంబర్ ​4న మీడియాకు ఒక ప్రకటన రిలీజ్ ​చేశారు. కానీ రెండేండ్ల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్​ఈ ఏడాది మార్చి 15కే ముగిసినందున మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లతో తమకెలాంటి సంబంధం లేదని తాజాగా ఎల్​అండ్​టీ ప్రతినిధులు తేల్చిచెప్పారు. 

దీంతో అసలు నవంబర్​4 నాటి ప్రకటన ఎల్​అండ్​టీ సంస్థనే ఇచ్చిందా? ప్రభుత్వమే కావాలని ఎల్​అండ్​టీ పేరుతో ప్రెస్ రీలీజ్​ను ప్రచారంలోకి తెచ్చిందా అనే డౌట్స్ వ్యక్తమయ్యాయి. అప్పటి ప్రభుత్వంలో కీలక మంత్రులుగా ఉన్న కేటీఆర్, హరీశ్​రావు సైతం మేడిగడ్డకు జరిగిన నష్టం చాలా చిన్నదని, ఆ రిపేర్లను కూడా కాంట్రాక్ట్​సంస్థే ఫ్రీగా చేస్తుందని, సర్కారు మీద పైసా భారం పడదని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పలుమార్లు చెప్పారు. కానీ ఇవన్నీ అబద్ధాలు అని తేలడంతో మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు అయ్యే సుమారు రూ.600 కోట్ల భారం ప్రజల మీద పడనుంది. ఇది దీనికే పరిమితమా? లేదంటే కన్నెపల్లి పంప్​హౌస్ రిపేర్ల కోసం పెట్టిన రూ.1,200 కోట్ల ఖర్చు భారం కూడా జనంపైనే పడిందా? అనేది తేలాల్సి ఉంది.