జెడ్డా పౌరురాలిని ఇర్ఫాన్ పఠాన్ ఎలా పెళ్లాడారు.. ఏంటి వీరి ప్రేమ కథ?

జెడ్డా పౌరురాలిని ఇర్ఫాన్ పఠాన్ ఎలా పెళ్లాడారు.. ఏంటి వీరి ప్రేమ కథ?

భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సతీమణి సఫా బేగ్ పేరు గత రెండ్రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. పఠాన్.. తమ 8వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యతో కలిసి ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకోవడమే అందుకు కారణం. తొలిసారి భార్య ఫోటో షేర్ చేసిన భారత మాజీ క్రికెటర్.. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. మనసును హత్తుకునేలా తన గురించి చాలా చక్కగా వర్ణించారు. 

"చాలా పాత్రలను ఆమె ఒక్కరే పోషిస్తున్నారు. నాకు మూడ్ బూస్టర్‌గా, హాస్యనటిగా, సహచరిగా, స్నేహితురాలిగా.. నా పిల్లలకు తల్లిగా ఆమె పోషిస్తున్న ఇలాంటి పాత్రలు మరెన్నో ఉన్నాయి. ఈ అందమైన ప్రయాణంలో జీవితాంతం నేను నిన్ను నా భార్యగా ప్రేమిస్తుంటా... నా ఈ ప్రేమకు 8వ శుభాకాంక్షలు.." అని పఠాన్ రాసుకొచ్చారు. పఠాన్ ఇంత చక్కగా వర్ణించడంతో ఎవరీమె..? అని నెటిజెన్స్ ఆరా తీస్తున్నారు. సఫా బేగ్ గురించి లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సఫా బేగ్ ఎవరు..?

సఫా బేగ్.. ఫిబ్రవరి 28, 1994న సౌదీ అరేబియాలోని జెడ్డాలో జన్మించింది. తండ్రి మీర్జా ఫరూక్ బేగ్. గల్ఫ్ దేశాలలో ప్రసిద్ధ వ్యాపారవేత్త. ఆమెకు నలుగురు సోదరీమణులు కూడా ఉన్నారు. ఆమె జెడ్డాలోని ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్‌లో తన విద్యను అభ్యసించింది. జర్నలిజం రంగంలో డిగ్రీ చేసింది. మొదట ఓ పిఆర్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా పని చేసిన ఆమె, వివిధ గల్ఫ్‌ ఫ్యాషన్ మ్యాగజైన్‌లకు మోడల్‌గానూ నటించింది. సఫా బేగ్ ప్రఖ్యాత నెయిల్ ఆర్టిస్ట్ కూడానూ.

పరిచయం.. ప్రేమ 

ఇర్ఫాన్ పఠాన్, సఫా బేగ్‌ల ప్రేమ కథ దుబాయ్‌లో మొదలైంది. మొదట వీరిద్దరూ 2014లో దుబాయ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కలిశారు. అక్కడ ఏర్పడ్డ పరిచయం కాస్తా.. కొద్దిరోజుల్లోనే ప్రేమకు దారితీసింది. ఒకరికొకరు మనసులో మాటను చెప్పుకున్నారు. అనంతరం రెండేళ్లపాటు తమ ప్రేమ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఆపై ఫిబ్రవరి 2016లో వివాహం చేసుకున్నారు. వీరి నిఖా మక్కాలోని హరామ్ షరీఫ్‌లో జరిగింది. అతికొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు నడుమ వీరి వివాహం జరిగింది. ఈ జంటకు ఇమ్రాన్, సులేమాన్ అనే ఇద్దరు కుమారులు.

ప్రస్తుతం ఇర్ఫాన్ పఠాన్ కామెంటేటర్‌గా పనిచేస్తున్నారు. అలా అని మైదానంలోకి దిగడని కాదు. అబుదాబి టీ10 లీగ్, మాజీ దిగ్గజాలు తలపడే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ వంటి టోర్నీల్లో అప్పుడప్పుడు కనిపిస్తున్నారు.