కెరీర్ మీద ఫోకస్ పెట్టాలంటే పచ్చళ్లు కొనక్కర్లేదు.. మానుషి చిల్లర్ గురించి ఈ మూడు ముక్కలు తెలిస్తే చాలు !

కెరీర్ మీద ఫోకస్ పెట్టాలంటే పచ్చళ్లు కొనక్కర్లేదు.. మానుషి చిల్లర్ గురించి ఈ మూడు ముక్కలు తెలిస్తే చాలు !

మొదటి అటెంప్ట్​లోనే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేస్తే.. స్టడీల్లో టాపర్ అంటారు​. అటు చదువును, ఇటు అందాల పోటీలను సమంగా పూర్తి చేయగలిగితే.. బ్యూటీ విత్ బ్రెయిన్​ అంటారు. స్టూడెంట్​గా ఉన్నప్పుడే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధిస్తే.. ఇంతకంటే ఏం కావాలి? ఎవరికైనా అనిపిస్తుంది. కానీ, ‘‘ఇప్పుడే నా కెరీర్ మొదలైంది. కొత్త విషయాలు నేర్చుకుంటూ, స్కిల్స్​ను మెరుగుపరుచుకునే పనిలో బిజీగా ఉన్నా’’నంటోంది ఈ పాతికేండ్ల అమ్మాయి. తనెవరో కాదు.. గతంలో మిస్ వరల్డ్ టైటిల్ గెలిచి, పలు సినిమాల్లో అలరించిన హీరోయిన్ మానుషి చిల్లర్​. ప్రస్తుతం ‘టెహ్రాన్​’ సినిమాలో ఒక పాత్ర పోషించిన మానుషి, ఇన్​స్పైరింగ్​​ జర్నీ ఇది.

హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని బన్మోలి గ్రామంలో పుట్టింది. తండ్రి మిత్రాబసు చిల్లర్, తల్లి నీలమ్​.. ఇద్దరూ డాక్టర్లే. మానుషి న్యూఢిల్లీలోని సెయింట్​ థామస్​ స్కూల్లో చదివింది. ఇంటర్మీడియెట్​లో నూటికి 96 శాతం సాధించింది. మొదటి అటెంప్ట్​లోనే నీట్ ఎగ్జామ్ క్లియర్ చేసి ఎంబీబీఎస్​ పూర్తి చేసింది. తన మాతృభాష హర్యాన్వీతోపాటు హిందీ, ఇంగ్లిష్​ అనర్గళంగా మాట్లాడుతుంది. అంతేకాదు.. మానుషి కూచిపూడి డాన్సర్​ కూడా. బ్యూటీ పీజెంట్ పోటీల్లో పాల్గొని కిరీటాలను సొంతం చేసుకుంది.

మొదట 2016లో మిస్​ ఇండియా ఆర్గనైజేషన్​ ఎయిమ్స్​ స్టూడెంట్స్​కి నిర్వహించిన క్యాంపస్ ప్రిన్సెస్​ పోటీల్లో ఫైనలిస్ట్​గా నిలిచింది. తర్వాత మరుసటి ఏడాది హర్యానాలో జరిగిన ఫెమినా మిస్​ ఇండియా పోటీల్లో పాల్గొని విన్నర్​గా నిలిచింది. అదే ఏట ఇండియాను రిప్రెజెంట్ చేస్తూ 54వ మిస్ వరల్డ్ పోటీల్లో​ పార్టిసిపేట్​ చేసిన మానుషి విజేతగా నిలిచింది.

మోడల్​గా బాటా, బిగ్ బజార్, ప్యాంటీన్, అడిదాస్, ఆడి క్యు5, పానాసోనిక్ వంటి ఎన్నో బ్రాండ్స్​ను ప్రమోట్​ చేసింది. సింగింగ్, అడ్వెంచర్ యాక్టివిటీలు, పెయింటింగ్ కూడా చేస్తుంది. మల్టీ టాలెంటెడ్​ మానుషి పలు ఇంటర్వ్యూల్లో తన గురించి చెప్పిన సంగతులు ఆమె మాటల్లోనే... 

ఆ రోజే లైఫ్​ మారిపోయింది:

నేను చండీగర్​లో ఉన్నప్పుడు బ్యూటీ కాంపిటీషన్​ ఆడిషన్స్ గురించి విన్నాను. నాకు అందులో పార్టిసిపేట్ చేయాలనిపించింది. నిజానికి అప్పట్లో నా ఫోకస్ అంతా స్టడీ మీదే. కానీ, లైఫ్​లో ఒక్కసారైనా అందులో పార్టిసిపేట్ చేయాలనుకున్నా. అందుకే ఆడిషన్స్​లో నేను పార్టిసిపేట్ చేస్తానని మా పేరెంట్స్​తో చెప్పా. వాళ్ల ఎంకరేజ్​మెంట్​తోనే ఆడిషన్​కి వెళ్లా. ఆ రోజే నా లైఫ్​ మారిపోయింది. మిగతా స్టూడెంట్స్ నిద్రలేవకముందే నేను వర్కవుట్స్ మొదలుపెట్టేదాన్ని. తర్వాత వాళ్లతోపాటే క్లాసులకు వెళ్లేదాన్ని.

నేను ప్రిపేర్ అవుతున్న టైంలో నా బెస్ట్ నేను ఇవ్వాలి. క్లాసులు కూడా వీలైనంతవరకు ఎగ్గొట్టకూడదు అనుకునేదాన్ని. క్లాసులు అయిపోయాక స్టూడెంట్స్ అంతా చదువుకోవడానికి వెళ్తే, నేను మళ్లీ వర్కవుట్స్ చేయడానికి వెళ్లొచ్చి, రాత్రిపూట చదువుకునేదాన్ని. మిగతా స్టూడెంట్స్​కి నేను చేసే పనులు క్రేజీగా, ఫన్నీగా అనిపించేవి. ఒకవైపు చదువు, వర్కవుట్స్, మరోవైపు పీజెంట్ ప్రిపరేషన్స్​తో నా కాలేజీ డేస్​ బిజీగా గడిచాయి. 

మొదటి సినిమాలో ప్రిన్సెస్​గా:

2022లో విడుదలైన అక్షయ్ కుమార్ సినిమా ‘సామ్రాట్ పృథ్వీరాజ్’లో నటించింది. అదే తన డెబ్యూ మూవీ. తర్వాత ఎన్నో ఆడిషన్స్, ట్రయల్స్ అయ్యాక ఆ సినిమాలో ‘పృథ్వీరాజ్​ భార్య’ పాత్రలో నటించే అవకాశం దక్కింది. అందులో ఆమె ప్రిన్సెస్​ పాత్ర పోషించింది. మరుసటి సంవత్సరం ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’ సినిమాలో నటించింది. ఆ తర్వాత టాలీవుడ్​కి వచ్చిన మానుషి, వరుణ్​ తేజ్ నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్​’లో వింగ్​ కమాండర్​గా కనిపించింది. ఈ ఏడాది హిందీలో వెంటవెంటనే రిలీజ్ అయిన ‘మాలిక్’, ‘టెహ్రాన్​’ సినిమాల్లోనూ నటించింది. 

సోషల్ వర్క్​లోనూ ఇన్​స్పిరేషన్​:

2018, మేలో వరల్డ్ మెనుస్ట్రువల్ హైజీన్ డే సందర్భంగా ఢిల్లీలో వందలమంది మహిళలతో కలిసి మూడు కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఫిట్​ ఇండియా క్యాంపెయిన్​లో పాల్గొంది. అంతేకాదు.. హర్యానా గవర్నమెంట్​ నిర్వహించిన ‘ఎనీమియా’ క్యాంపెయిన్​కి బ్రాండ్ అంబాసిడర్​గా ఉంది.

కరోనా టైంలో యూనిసెఫ్​తో కలిసి అవేర్​నెస్ క్యాంపెయిన్​లు చేసింది. వీటన్నింటితోపాటు ఎంట్రప్రెన్యూర్​గానూ తను సత్తా చాటుతోంది. ఇప్పటికే సోమా వెల్ నెస్​కి కో– ఫౌండర్​గా మానుషి.. ద్వీప్ అనే బ్రాండ్​ను గతేడాది ప్రారంభించింది.

ఇండియా టు వరల్డ్:

నేను మిస్​ ఇండియా పోటీలకు వెళ్లినప్పుడే మిస్​ వరల్డ్ కావాలనుకున్నా. అంతకంటే ముందు ప్రతి కంటెస్టెంట్​ టైటిల్ గెలవడానికి ఎంతో ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటారు. మిస్​ ఇండియా పోటీల్లో పాల్గొన్న మేమంతా ఒకే దేశం వాళ్లమయినా ప్రాంతాలు వేరు కాబట్టి కాంపిటీషన్​ గట్టిగా ఉండేది. ఎవరి బలాలు వాళ్లకు ఉండేవి.

ప్రతి ఒక్కరూ సొంత అభిప్రాయాలను కలిగి ఉండాలి. అవసరం అయినప్పుడు వాటిని సరైన పద్ధతిలో చెప్పగలగడం నేర్చుకోవాలి. అప్పుడే మనకు గుర్తింపు వస్తుందనే విషయం తెలుసుకున్నా. ఒక స్టూడెంట్​గా నేను అది సాధించడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. టైటిల్ గెలిచి తిరిగి వచ్చాక నా చదువు కంటిన్యూ చేశా. 

అప్పుడే యాక్టర్​ అవ్వాలని:

మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన తర్వాతే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా. కానీ, యాక్టింగ్ అంటే మామూలు విషయం కాదు. ఎంతో క్రమశిక్షణతో నేర్చుకోవాల్సిన స్కిల్. నేను ఈజీగా భావోద్వేగాలను వ్యక్తపరిచే అమ్మాయిని కాదు. దాంతో యాక్టింగ్ చేయడం నాకు చాలెంజింగ్​గా అనిపించింది. మిస్​ వరల్డ్ వంటి ఒక పెద్ద ప్లాట్​ఫాం నుంచి వస్తున్నప్పుడు ఎక్కువగా అంచనాలు ఉండడం సహజమే. ఎంతోమంది పాల్గొన్న ఆ పోటీల్లో చాలామంది మహిళలకు గ్లోబల్ రికగ్నిషన్​ రాదు. ఈ పోటీల్లోనే కాదు.. యాక్టింగ్​లోనూ అంతే.

అంచనాలు ఉండడం ఒక విధంగా ప్రోత్సాహంలా అనిపించినప్పటికీ రిజల్ట్ బాలేకపోతే అదేవిధంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానివల్ల చాలా ఒత్తిడికి గురవుతాం. నేనైతే ప్రస్తుతం నటనలో నాకు తెలియని విషయాలు నేర్చుకునే పనిలో ఉన్నాను. యాక్టర్​గా నా స్కిల్స్ మెరుగుపరుకుంటున్నా. బాగా కష్టపడి నేను అనుకున్నది సాధించాలి. అందుకోసం నా కళకు నన్ను నేను అంకితం చేసుకోవాలి. నటిగా ఎంతో ఎత్తుకు ఎదగాలనుకుంటున్నా. 

అందరూ గుర్తించాలని:

యోగా, మెడిటేషన్, చదవడం వంటివి నా మైండ్​ని బ్యాలెన్స్​డ్​గా ఉంచుతాయి. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో క్లోజ్​గా ఉండడం నాకు మానసిక బలాన్నిస్తుంది. మా ఇంట్లో డిన్నర్ చేసే టైంలో ఫ్యామిలీ అంతా కబుర్లు చెప్పుకుంటాం. అయితే, ఎప్పుడూ చదువు, ఫైనాన్స్, బిజినెస్ వంటి వాటి గురించే తప్ప వేరేవి ఉండేవి కాదు. వ్యక్తులు, వ్యక్తిత్వాల గురించి చర్చించేవాళ్లం కాదు. అలాంటి కుటుంబ వాతావరణంలో పెరగడం నా అదృష్టం.

ఎవరైనా ఏదైనా చెప్తుంటే ఓపికగా వినడం నాకు అలవాటు. ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవడం ఇంపార్టెంట్ అని భావిస్తా. నాకు ముఖ్యంగా చదువుకునే రోజుల్లో మంచి స్కోర్ చేయాలనుండేది. అంటే అది, నన్ను అందరూ గుర్తించాలనే తాపత్రయం కావొచ్చు. నన్ను ప్రత్యేకంగా ప్రపంచానికి పరిచయం చేసుకోవాలనే ఆలోచన ఉండేది.

అందుకే బ్యూటీ పీజెంట్ పోటీలకు వెళ్లాలనుకున్నా. నా మైండ్​సెట్ ఎప్పుడూ ఏదో సాధించాలనే తపనతో ఉండేది. మన లక్ష్యం 200 అయినప్పుడే జీవితంలో 100 మార్కులు వస్తాయని నమ్ముతా.