Nayab Singh Saini: హ‌ర్యానా కొత్త CMగా న‌యాబ్ సింగ్ సైనీ.. ఎవరీయన?

Nayab Singh Saini: హ‌ర్యానా కొత్త CMగా న‌యాబ్ సింగ్ సైనీ.. ఎవరీయన?

హ‌ర్యానా కొత్త ముఖ్యమంత్రిగా న‌యాబ్ సింగ్ సైనీ(Nayab Singh Saini) బాధ్య‌త‌లు తీసుకున్నారు. మంగళవారం(మార్చి 12) సాయంత్రం 5 గంట‌ల‌కు ఆయన సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.  ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

మంగళవారం ఉదయం బీజేపీ సీనియర్ నేత, సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు సీట్ల పంపకంపై బీజేపీ, జననాయక్ జనతా పార్టీ (జెజెపి) సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు తలెత్తాయన్నా ఊహాగానాల మధ్య ఖ‌ట్టర్ .. సీఎం ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సి వచ్చింది.

90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటకు 46 సీట్లు అవసరం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ మార్క్ ను చేరుకోకపోవడంతో జేజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారికి 6 మంది స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. జేజేపీకి 10, కాంగ్రెస్‌కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఎవరీ నయాబ్ సింగ్ సైనీ..?

1970 జనవరి 25న అంబాలాలోని ఒక చిన్న గ్రామమైన మిజాపూర్ మజ్రాలో నయాబ్ సింగ్ సైనీ జన్మించారు. ఆయన ముజఫర్‌పూర్‌లో బి.ఆర్‌. అంబేద్కర్ బీహార్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ, చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుండి ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పట్టా పొందారు. 

సైనీ 2002లో బీజేపీ అంబాలా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యారు. అనంతరం 2005లో అంబాలా యువమోర్చా జిల్లా అధ్యక్షుడయ్యారు. బీజేపీ హర్యానా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా నియమితులయ్యారు. ఆపై 2012లో పదోన్నతి పొంది అంబాలా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 

రాజకీయ జీవితం 

  • 2014 : నరైన్‌గర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
  • 2016 : ఖట్టర్ మంత్రివర్గంలో మంత్రిగా చేరారు.
  • 2019: కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గంలో 3.85 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.
  • 2023: హర్యానా బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
  • 2024: ఇప్పుడు హర్యానా ముఖ్యమంత్రి.