Celina Jaitly: భర్తపై గృహహింస కేసు.. రూ. 50 కోట్లు డిమాండ్ చేస్తున్న మంచు విష్ణు హీరోయిన్

Celina Jaitly: భర్తపై గృహహింస కేసు.. రూ. 50 కోట్లు డిమాండ్ చేస్తున్న మంచు విష్ణు హీరోయిన్

బాలీవుడ్ న‌టి, మాజీ మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ రన్నరప్..సెలీనా జైట్లీ (Celina Jaitly) పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో మంచు విష్ణు హీరోగా నటించిన సూర్యం మూవీలో హీరోయిన్గా నటించింది. ఆ మూవీ పెద్దగా ఆడకపోవడంతో బాలీవుడ్లో బిజీ నటిగా మారిపోయింది. ఇపుడు ఈ మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. తన భర్త, ఆస్ట్రియన్ హోటల్ వ్యవస్థాపకుడు పీటర్ హాగ్ అకృత్యాలకు తట్టుకోలేక సెలీనా విడాకులకు సిద్ధమైంది. మంగళవారం (2025 నవంబర్ 25న) తాను విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా సెలీనా ధృవీకరించింది.

ఈ క్రమంలో భర్త పీటర్‌ హాగ్‌పై గృహహింస కేసు పెట్టింది. తన భర్త  తనను తాను గొప్పగా భావించే నార్సిసిస్ట్ అని (తనను తాను ఎక్కువగా ఊహించుకోవడం) పిల్లల పట్ల ప్రేమలేదని సెలీనా తన పిటిషన్‌లో ఆరోపించింది. అందువల్ల తన భర్తపై గృహహింస, క్రూరత్వం, శారీరక, లైంగిక, మోసపూరిత చర్యలకు పాల్పడినందుకు గాను కేసు పెట్టినట్లు వెల్లడైంది. 

అంతేకాకుండా అతని వల్ల కోల్పోయిన జీవితం బదులుగా భరణం డిమాండ్ చేసింది. పీటర్‌ నుంచి నెలకు రూ.10 లక్షల భరణంతో పాటు రూ.50 కోట్లు పరిహారం ఇప్పించాలని తన పిటిషనల్ పేర్కొంది. అలాగే, పీటర్‌ కస్టడీలో ఉన్న తన పిల్లలను కలిసేందుకు కూడా అతడు అవకాశం ఇవ్వడం లేదని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం (2025 నవంబర్ 21న) పిటిషన్ దాఖలు చేసింది. 

ఇవాళ మంగళవారం (నవంబర్ 25న) ముంబైలోని ఓ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ముందుకు సెలీనా దాఖలు చేసిన పిటిషన్‌ వచ్చింది. దీన్ని పరిశీలించిన అనంతరం పీటర్‌ హాగ్‌కు నోటీసులు జారీ చేయనున్నారు. ఈ పిటిషన్ సమగ్ర విచారణను వచ్చే నెల డిసెంబరు 12న  తదుపరి విచారణ చేపట్టనుంది కోర్టు. ఈ క్రమంలో సెలీనా డిమాండ్ పై కోర్ట్ ఏ విధంగా తీర్పు వెల్లడించనుందో అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.

ఇకపోతే, ఈ జంట జూలై 23, 2011న ఆస్ట్రియాలోని 1,000 సంవత్సరాల పురాతనమైన ఆశ్రమంలో వివాహం చేసుకున్నారు. వీరికి 2012లో ఇద్దరు కవల అబ్బాయిలకు తల్లిదండ్రులు అయ్యారు. కొన్నేళ్ల తర్వాత 2017లో, జైట్లీ మరో కవలలకు జన్మనిచ్చింది. అయితే, అనారోగ్య కారణాలతో వారిలో ఒకరు ఒకరు గుండె లోపం కారణంగా ప్రాణాలు కోల్పోయారు.