TSPSC - పేపర్ లీకేజీ లో ఆమె పాత్ర ఏంటి?

TSPSC - పేపర్  లీకేజీ లో  ఆమె పాత్ర ఏంటి?

TSPSC పేపర్  లీకేజీ ఘటనలో కీలక నిందితురాలు రాథోడ్‌ రేణుక (Renuka) గురించి ఆరా తీసే కొద్దీ ఆశ్చర్యకర విషయాలు బయటకు వస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా గంఢీడ్‌ మండలానికి చెందిన రేణుక వనపర్తి ఎస్సీ గురుకుల విద్యాలయంలో హిందీ పండిట్‌గా పనిచేస్తుంది.  ఆమె భర్త ఢాక్యానాయక్‌ వికారాబాద్‌ జిల్లా పరిగిలోని డీఆర్‌డీఏలో పనిచేస్తున్నారు. అయితే రేణుక ఈ ఏడాదిలలో ఏకంగా 12 సెలవులు పెట్టింది. ఇందులో మార్చి నెలలోనే 6 సెలవులు పెట్టింది.  మార్చి నెలలో 4, 5 తేదీల్లో తమ బంధువు మృతి చెందాడని సెలవు పెట్టిన రేణుక... ఆ తేదీల్లో పేపర్ అమ్మిన అభ్యర్థులను రేణుక దంపతులు ఇంట్లో ప్రిపేర్ చేయించారు. అటు  రేణుక సర్టిఫికెట్ల విషయంలోనూ పలు అనుమానాలు నెలకొన్నాయి.  రేణుకపై శాఖా పరమైన చర్యల కోసం గురుకుల సెక్రటరీ రోనాల్డ్ రోజ్కు గురుకుల ప్రిన్సిపాల్ లెటర్ రాశారు. 

మరోవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసును సిట్‌కు బదిలీ చేస్తూ హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు  ఈ  కేసులో 9 మంది నిందితులకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.  పోలీసులు  8 మంది నిందితులను చర్లపల్లి జైలుకు,  మరో నిందితురాలు రేణుకను చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు.