డెల్టా వేరియంట్‌‌కూ టీకానే విరుగుడు

డెల్టా వేరియంట్‌‌కూ టీకానే విరుగుడు

లండన్​: కరోనా డెల్టా వేరియంట్​వ్యాప్తి పెరగడం, వ్యాక్సినేషన్​ నిదానంగా సాగుతుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) ఆందోళన వ్యక్తం చేసింది. చాలా దేశాల్లో టీకా కార్యక్రమం ఇంకా మొదలే కాలేదని, డెల్టా వేరియంట్​కు అడ్డుకట్ట వేయాలంటే టీకా కార్యక్రమంలో వేగం పెంచాలని సూచించింది. సెప్టెంబర్​ నాటికి అన్ని దేశాల్లోనూ కనీసం 10 శాతం మందికి వ్యాక్సిన్​ వేయాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్​వో చీఫ్​ టెడ్రోస్​ అధనోం ఘెబ్రియేసస్​ అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి 40 శాతం మందికి, వచ్చే ఏడాది మధ్య నాటికి 70 శాతం మందికి టీకాలు వేయాలన్నారు. అలాగైతేనే మహమ్మారికి బ్రేకులు వేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలుగుతామని చెప్పారు. కొన్ని దేశాలు ఇప్పటికే దాదాపు పెద్దలందరికీ టీకాలు వేస్తే.. కొన్ని దేశాల్లో కనీసం హెల్త్​ వర్కర్లు, పెద్దలు, ముప్పు ఎక్కువగా ఉన్నోళ్లకూ టీకాలు దొరకని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని దేశాలకు టీకాలు దొరకట్లేదంటే.. మిగతా దేశాలకూ ముప్పేనని ఆయన హెచ్చరించారు. ఆ ముప్పును తప్పించాలంటే అన్ని దేశాలకూ సమానంగా వ్యాక్సిన్లను పంపిణీ చేయాలని సూచించారు. యూఎన్​ లెక్కల ప్రకారం చాలా పేద దేశాల్లో కనీసం ఒక్క శాతం మందికి కూడా వ్యాక్సిన్​ అందలేదు. పెద్ద దేశాల్లో మాత్రం 60 శాతానికి పైగా వ్యాక్సినేషన్​ జరిగింది. యూఎన్​ ఏర్పాటు చేసిన కొవ్యాక్స్​ గ్రూప్​ ద్వారా ఇప్పటిదాకా అన్ని దేశాలకు 8.1 కోట్ల డోసుల వ్యాక్సిన్​ను పంపిణీ చేశారు. 

డెల్టాతో ముందుంది పెనుముప్పు

డెల్టా కరోనాతో మున్ముందు మరింత ముప్పు పొంచి ఉందని డబ్ల్యూహెచ్​వో హెచ్చరించింది. ఇప్పటికే 96 దేశాల్లో ఆ రకం కరోనా ఉందని చెప్పింది. వీక్లీ కరోనా నివేదికలో ఆ వివరాలను వెల్లడించింది. చాలా దేశాలకు వైరస్​ జీన్లను సీక్వెన్స్​ చేసే టెక్నాలజీ లేదని, దీంతో ఆయా దేశాల్లోనూ డెల్టా ఉండే చాన్స్​ ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా ప్రారంభంలో పెట్టుకున్న రూల్స్​, సౌలతులతోనే డెల్టానూ కంట్రోల్​ చేయొచ్చని సూచించింది. అయితే, వేరియంట్లు పెరిగే కొద్దీ ఎక్కువ కాలం పాటు ఆ రూల్స్​ను ఫాలో కావాల్సి ఉంటుందని పేర్కొంది. పోయిన వారంలో బ్రెజిల్​లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయని చెప్పింది. 5,21,298 మంది దాని బారిన పడ్డారంది. ఆ తర్వాత మన దేశంలో 3,51,218 కేసులు వచ్చినట్టు పేర్కొంది. మరణాలు 45 శాతం తగ్గాయని చెప్పింది. మొత్తంగా పోయిన వారం మన దేశంలో 9,038 మంది చనిపోయారని 
వెల్లడించింది. 

కొవిషీల్డ్​కు ఓకే చెప్పిన 9 ఈయూ దేశాలు

న్యూఢిల్లీ: కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికీ 9 యూరోపియన్ దేశాలు ఓకే చెప్పాయి. ఆస్ట్రియా, జర్మనీ, స్లొవేనియా, గ్రీస్, ఐస్​ల్యాండ్, ఐర్లాండ్, స్పెయిన్, ఎస్టోనియా, స్విట్జర్లాండ్ దేశాలు కొవిషీల్డ్ తీసుకున్న ప్రయాణికులకు అనుమతులు క్లియర్ చేశాయి. ఈయూ దేశాలకు వెళ్లే వారికి జులై 1 నుంచి వ్యాక్సిన్ పాస్‌‌‌‌పోర్ట్ పేరుతో ‘గ్రీన్‌‌‌‌ పాస్’ను తప్పనిసరి చేశారు. గ్రీన్ పాస్ కింద యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) 4 రకాల వ్యాక్సిన్లనే ఆమోదించింది. ఇండియాలో ఉత్పత్తి అవుతున్న కొవిషీల్డ్, కొవ్యాగ్జిన్ ను మాత్రం ఆ జాబితాలో చేర్చలేదు. అయితే వ్యాక్సేవ్రియా పేరుతో వచ్చిన అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను గుర్తించిన ఈఎంఏ.. కొవిషీల్డ్ పేరుతో సీరం తయారుచేస్తున్న అదే వ్యాక్సిన్ ను ఆమోదించలేదు. దీంతో ఆయా దేశాలకు వెళ్లే ఇండియన్లకు సమస్యలు తప్పవని భావించిన కేంద్రం.. ఈ విషయాన్ని ఈయూ దేశాలకు వివరించింది. అలాగే ఇండియాలో తయారైన టీకాలనూ గుర్తించాల్సిందేనంటూ తేల్చి చెప్పింది. లేకుంటే ఇండియాకు వచ్చే ఈయూ ప్రయాణికులకు కూడా ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. దీంతో దిగొచ్చిన 9 ఈయూ దేశాలు కొవిషీల్డ్‌‌‌‌ను గుర్తిస్తున్నట్టు తాజాగా ప్రకటించాయి.