హిమాచల్ ప్రదేశ్ కాబోయే సీఎం ఎవరు ?

హిమాచల్ ప్రదేశ్ కాబోయే సీఎం ఎవరు ?

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ విజయఢంకా మోగించిన నేపథ్యంలో ఆ రాష్ట్రానికి కాబోయే సీఎం ఎవరనే దానిపై సర్వత్రా చర్చ మొదలైంది.  ఈక్రమంలో ప్రధానంగా ముగ్గురి పేర్లు తెరపైకి వస్తున్నాయి.  ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న పేరు ప్రతిభా సింగ్.. రెండో స్థానంలో ఉన్న పేరు సుఖ్విందర్ సింగ్ సుఖూ.. మూడో స్థానంలో ఉన్న పేరు ముకేశ్ అగ్నిహోత్రి !!  ఈ లిస్టు ఇంతటితో ముగిసేలా లేదు. సీఎం సీటు అంటే ఎవరికి మాత్రం మోజు ఉండదు. అందుకే..  హిమాచల్ పీసీసీ మాజీ చీఫ్ కుల్దీప్ సింగ్ రాథోర్, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆశా కుమారి, మాజీ హిమాచల్ పీసీసీ చీఫ్ కౌల్ సింగ్ ఠాకూర్ లు కూడా సీఎం సీటు కోసం పోటీపడుతున్నారు. రాష్ట్రంలోని  మొత్తం 68 అసెంబ్లీ సీట్లకుగానూ 40  స్థానాల్లో గెలిచి విజయపతాక ఎగురవేసిన కాంగ్రెస్  పార్టీకి ఇప్పుడు సీఎం ఎంపిక పెద్ద సవాల్ గా మారింది. ఆశావహుల జాబితాలో ఉన్నవారిలో ఎవరిని కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా ఎంపిక చేస్తుంది ? మిగతా వారికి ఏ విధంగా న్యాయం చేస్తుంది ? అనేది ఆసక్తికరంగా మారింది. 

వీరభద్ర సింగ్ సతీమణే ప్రతిభా సింగ్

హిమాచల్ ప్రదేశ్ దివంగత సీఎం వీరభద్ర సింగ్ సతీమణే ప్రతిభా సింగ్. ఈమె ప్రస్తుతం హిమాచల్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ప్రతిభా సింగ్ నేతృత్వం వల్లే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని పార్టీలోని ఓ వర్గం బలంగా వాదిస్తోంది. వాస్తవానికి ప్రతిభా సింగ్ కంటే ముందు (కొన్ని నెలల క్రితం వరకు)  హిమాచల్ కాంగ్రెస్ చీఫ్ గా కుల్దీప్ సింగ్ రాథోర్ వ్యవహరించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం అకస్మాత్తుగా ఆయనను అధ్యక్ష స్థానం నుంచి తప్పించి.. ప్రతిభాసింగ్ కు పార్టీ చీఫ్ పదవిని కట్టబెట్టింది. అయితేనేం తాను కూడా సీఎం రేసులో ఉన్నానని కుల్దీప్ సింగ్ రాథోర్  చెప్పుకుంటున్నారు.  కుల్దీప్  ను అధ్యక్ష పదవిలోనే కొనసాగించని అధిష్ఠానం.. సీఎం సీటును మాత్రం ఎలా అప్పగిస్తుందని పలువురు కాంగ్రెస్  నాయకులు అభిప్రాయపడుతున్నారు.  ఈ లెక్కన కుల్దీప్ కంటే ప్రతిభా సింగ్ కే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు.  

ప్రతిభా సింగ్ ప్రస్తుతం..

ప్రతిభా సింగ్ ప్రస్తుతం హిమాచల్ లోని మండి లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. దివంగత సీఎం, తన భర్త వీరభద్ర సింగ్ మరణంతో ఖాళీ అయిన మండి లోక్ సభ  స్థానం నుంచి ఆమె పోటీ చేసి గెలిచారు. దీంతో ఈసారి శాసన సభ ఎన్నికల్లో ప్రతిభా సింగ్ పోటీ చేయలేదు.  అయితే ప్రతిభా సింగ్ కుమారుడు విక్రమాదిత్య షిమ్లా రూరల్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు.  అసెంబ్లీ స్థానం నుంచి గెలవనప్పటికీ..  మెజారిటీ ఎమ్మెల్యేలంతా ప్రతిభా సింగ్ వెంటే ఉన్నారని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు హిమాచల్ కాంగ్రెస్ కు పెద్దదిక్కుగా వెలుగు వెలిగిన దివంగత సీఎం వీరభద్రసింగ్ సతీమణికి మద్దతు పలికేందుకే  పార్టీ ఎమ్మెల్యేలు మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నాయి.  ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీ ప్రతిభా సింగ్ తో లోక్ సభకు రాజీనామా చేయించి.. హిమాచల్  సీఎంగా ప్రమాణం చేయించే చాన్స్ ఉంటుంది. 

సుఖ్విందర్ సింగ్ సుఖూ  ఎవరు ?

ఇక సీఎం సీటుకు పోటీపడుతున్న  సుఖ్విందర్ సింగ్ సుఖూ హిమాచల్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు.  ఈయన రాష్ట్రంలోని నాదౌన్ స్థానం నుంచి గెలిచారు. గతంలో రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్షనేతగా వ్యవహరించిన ముకేశ్ అగ్నిహోత్రి కూడా సీఎం రేసులో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఈయన హరోలీ స్థానం నుంచి  విజయం సాధించారు.  అసెంబ్లీ నుంచి ఎన్నికవడంతో పాటు గతంలో పార్టీకి చేసిన సేవల ఆధారంగా సీఎం సీటుకు తమ పేర్లను అధిష్టానం పరిశీలిస్తుందని వీరిద్దరు ఆశలు పెట్టుకున్నారు. ముకేశ్ అగ్నిహోత్రి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా,  సుఖ్విందర్ సింగ్ సుఖూ  హిమాచల్ లో రాజకీయ ఆధిపత్యం కలిగిన ఠాకూర్ వర్గానికి చెందినవారు.  ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆశా కుమారి, మాజీ హిమాచల్ పీసీసీ చీఫ్ కౌల్ సింగ్ ఠాకూర్ లు కూడా సీఎం రేసులో ఉన్నారు.