తెలంగాణలో నెక్స్ట్​ సీఎం ఎవరు? .. మూడు పార్టీల్లోనూ ఇదే చర్చ

తెలంగాణలో నెక్స్ట్​ సీఎం ఎవరు? .. మూడు పార్టీల్లోనూ ఇదే చర్చ
  • మూడు ప్రధాన పార్టీల్లోనూ ఇదే చర్చ

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. సీఎం ఎవరనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మూడు ప్రధాన పార్టీల్లోనూ ఇదే చర్చ జోరుగా సాగుతున్నది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని, మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే కేటీఆర్‌‌కు కూడా పగ్గాలు అప్పగించే చాన్స్​ ఉందని ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్‌లో నాలుగైదు పేర్లు వినిపిస్తున్నా.. అధికారంలోకి వచ్చిన తర్వాత హైకమాండే నిర్ణయం తీసుకుంటుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

మరోవైపు ‘బీసీ సీఎం’ అని బీజేపీ ఇప్పటికే ప్రకటించగా.. ఎవరికి అవకాశం దక్కుతుందనే దానిపై చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పెద్దల నుంచి వస్తున్న ప్రకటనలతో ముఖ్య లీడర్లలో కాబోయే సీఎం ఎవరని నేతలు లెక్కలేసుకుంటున్నారు. ఇక బీఎస్పీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌‌‌‌ను ఆ పార్టీ అధినేత మాయవతి ఇప్పటికే ప్రకటించారు.

కేటీఆర్ సీఎం అంటే ఎలక్షన్లలో కష్టమైతదని..

కేటీఆర్ సీఎం అవుతారనే చర్చ రెండు, మూడేండ్లుగా జరుగుతున్నది. కానీ ఈ ప్రచారాన్ని కేసీఆర్ కొట్టిపారేస్తూ వచ్చారు. ఇదే సమయంలో పార్టీలో తన తర్వాత స్థానంగా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పజెప్పారు. తన తర్వాత కుమారుడే సీఎం అని చెప్పడానికే కేసీఆర్ ఈ సంకేతాలు పంపినట్లు ఆ పార్టీ లీడర్లు మీడియా చిట్​చాట్‌‌ సందర్భంగా చాలాసార్లు చెప్పారు. అప్పట్లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఇలానే కామెంట్లు చేశారు. టీఆర్ఎస్‌‌ను బీఆర్ఎస్‌‌గా మార్చి, జాతీయ రాజకీయాల్లోకి తాను వెళ్లి.. ఇక్కడ  కేటీఆర్‌‌‌‌ను సీఎం చేయాలని కేసీఆర్ భావించినట్లు ప్రచారం జరిగింది.

ఇటీవల రాష్ట్ర పర్యటనలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. కేటీఆర్‌‌‌‌ను ముఖ్యమంత్రిని చేయాలని అనుకుంటున్నట్లు కేసీఆర్ తనతో చెప్పారని, తన ఆశీర్వాదం కూడా అడిగారని సంచలన ప్రకటన చేశారు. దీంతో పెద్ద దూమరం రేగింది. ఈ క్రమంలో ‘కేటీఆర్ సీఎం’ అనే ప్రచారం జనాల్లోకి వెళ్తే ఎన్నికల్లో ఇంకింత ఇబ్బంది అవుతుందని ఇంటిలిజెన్స్, పార్టీ ఇంటర్నల్​ ఫీడ్ బ్యాక్‌‌లో తేలింది. దీంతో కేటీఆర్ కూడా మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి 
అవుతారని ప్రకటించారు.

కాంగ్రెస్.. గెలిచినంక మిగతా ముచ్చట

తానే సీఎం అంటూ గతంలో మాదిరి కాంగ్రెస్ నేతలెవరూ ప్రస్తుతం బహిరంగ ప్రకటనలు చేయడం లేదు. ఎన్నికల్లో గెలుపు కోసం క్యాడర్‌‌‌‌లో, నియోజకవర్గాల్లో జోష్​ నింపేందుకు ఇద్దరు, ముగ్గురు లీడర్లు తమ నియోజకవర్గ సన్నిహితుల దగ్గర మాత్రం తానే సీఎం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పుకుంటున్నట్లు తెలిసింది. పార్టీ గెలిచిన తర్వాత, సీఎం ఎవరు అనేది ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే, అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌‌ గాంధీ నిర్ణయిస్తారని సీనియర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పదవిపై ఎవరూ మాట్లాడటం లేదు.

మరోవైపు అధికారంలోకి వస్తే ఏ వర్గానికి సీఎం పదవి వస్తుందనేది కూడా ఆసక్తిగా మారింది. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, భట్టి విక్రమార్కలతో పాటు మరికొందరి లీడర్ల పేర్లు కాంగ్రెస్‌‌లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకవేళ బీసీ లీడర్లకు అవకాశం ఇస్తే.. ఎవరికి ముఖ్యమంత్రి పదవి వరిస్తుందోననే చర్చ కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో జరుగుతున్నది.

బీజేపీ ‘బీసీ సీఎం’ జపం

బీజేపీని గెలిపిస్తే బీసీని తెలంగాణ ముఖ్య మంత్రిని చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌‌షా ఇటీవల ప్రకటిం చారు. దీంతో బీజేపీ పవర్‌‌‌‌లోకి వస్తే ముఖ్య మంత్రి ఎవరన్న చర్చ జరుగుతున్నది. రేసులో బండి సంజయ్, కె.లక్ష్మణ్‌‌, ఈటల రాజేందర్ ఉంటారని నేతలు చెప్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌‌లో నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో మాట్లాడిన ప్రధాని మోదీ.. ముఖ్యమైన బీసీ లీడర్లంతా ఓట్లు సంపాదించి పార్టీని గెలుపుదిశగా తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.

మరోవైపు పార్టీలో ముందు నుంచీ సంస్థా గతంగా పనిచేస్తున్న సీనియర్ బీసీలకే అవకా శం దక్కుతుందని.. ఇతర పార్టీల నుంచి వచ్చి నోళ్లకు చాన్స్ దొరకదని బీజేపీ లీడర్లు చెప్తుం డటం గమనార్హం. బీజేపీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి ముందుగా ప్రకటించిడం చాలా అరుదు. ఇది కాస్తా మిగతా పార్టీలను ఇరకాటంలో పడేసింది.