కాకరకాయ ఎవరెవరు తినొచ్చు..?

కాకరకాయ ఎవరెవరు తినొచ్చు..?

కాకర అంటే చాలు చేదని ఆమడ దూరం పరిగెడుతుంటారు చాలామంది. మరీ ముఖ్యంగా గర్బిణీలు కాకర తినడానికి అస్సలు ఇష్టపడరు. ప్రెగ్నెన్సీ టైంలో వాంతులు, వికారం లాంటి ఫీలింగ్స్​ ​ ఎక్కువగా ఉండటం వల్ల కాకర ఫ్లేవర్ అంతగా రుచించదు వాళ్లకి. కానీ, ప్రెగ్నెన్సీ టైంలో కాకర చాలా మేలు చేస్తుంది. డైలీ డైట్ లో కాకరని భాగం చేసుకోవడం వల్ల కాబోయే తల్లి, పుట్టబోయే బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు.

ప్రెగ్నెన్సీ టైంలో రోగనిరోధక శక్తి ఎంత ఎక్కువగా ఉంటే పుట్టబోయే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది. కాకరలో రోగనిరోధక శక్తినిచ్చే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే డైలీ డైట్ లో కాకరని భాగం చేసుకోవాలి. బ్యాక్టీరియా, వైరస్ ల నుంచి కూడా ఈ వెజిటెబుల్ గర్భిణీలను కాపాడగలదు.

ఆరోగ్యకరమైన బరువు పెరగడంలో..

ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్లు బరువు పెరగడం సహజం. కానీ, కొందరికి హార్మోన్స్​ బ్యాలెన్స్​ లేకపోవడం వల్ల విపరీతంగా బరువు పెరుగుతారు. అలాంటి వాళ్లు అధిక బరువుని అదుపు చేసుకోవడానికి డైలీ కాకర తినాలి. కాకరకాయలో ఉండే ఫైబర్ అనవసరమైన బరువు పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. దానికితోడు పోషకాలతో పాటు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.

షుగర్ కు దూరంగా..

ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే డయాబెటిస్ ను దూరం చేయడంలో కాకరకాయ కీలక పాత్ర పోషిస్తుంది. కాకరకాయలో ఉండే పాలీపెప్టైడ్ పి రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

ఫోలిక్ మందుతో సమానం

పుట్టబోయే బిడ్డలో నాడీ లోపాలను సరిచేయడం కోసం గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా అవసరం ఉంటుంది. అందుకే డాక్టర్లు ప్రతిరోజు ఫోలిక్ మందును వేసుకోవాలని చెబుతారు. కాకరకాయలో ఫోలిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. తరచూ దీనిని తింటే మందులతో పనిలేదు. అయితే కాకరకాయ శరీరానికి పడదు అనుకునేవాళ్లు మాత్రం దీనికి దూరంగా ఉంటేనే బెటర్. లేదంటే డాక్టర్ సలహాతో తీసుకోవడం మంచిది.