గల్ఫ్‌‌ ఓటు దక్కేదెవరికో ?

గల్ఫ్‌‌ ఓటు దక్కేదెవరికో ?
  •     కరీంనగర్‌‌, నిజామాబాద్‌‌, ఆదిలాబాద్‌‌లో గల్ఫ్‌‌ ఓటరు ప్రభావం
  •     గల్ఫ్‌‌ పాలసీని పట్టించుకోని బీఆర్‌‌ఎస్‌‌ సర్కార్‌‌
  •     కార్మికుల వెల్ఫేర్‌‌ బోర్డు, బీమాకు సీఎం రేవంత్‌‌ హామీ
  •     తమకే కలిసొస్తుందని కాంగ్రెస్‌‌ లీడర్ల ఆశ

జగిత్యాల, వెలుగు : నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌‌ పార్లమెంట్‌‌ నియోజకవర్గాల గెలుపోటములపై గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబాల ప్రభావం తీవ్రంగా పడనుంది. దీంతో వారిని ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీల లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్‌‌ఎస్‌‌ హయాంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, కార్మికుల సంక్షేమాన్ని, భద్రతను బీజేపీ పట్టించుకోలేదని కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు. ఆ రెండు పార్టీలపై అసంతృప్తితో ఉన్న కార్మికులను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్‌‌ నేతలు ప్లాన్‌‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా గల్ఫ్‌‌ బాధితులకు నష్ట పరిహారాలు చెల్లిస్తూ దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారు.

8 శాతానికి పైగా ఓటు బ్యాంక్‌‌ వాళ్లదే..

విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం తెలంగాణకు చెందిన సుమారు 15 లక్షల మంది గల్ఫ్‌‌ దేశాల్లో ఉండగా,  వీరిలో 10 లక్షల మంది ఉత్తర తెలంగాణకు చెందిన వారేనని అంచనా. గత 20 ఏళ్లలో 30 లక్షల మంది గల్ఫ్‌‌ నుంచి వాపస్‌‌ వచ్చినట్లు అంచనాలు ఉన్నాయి. వీరి కుటుంబాలతో కలుపుకుంటే సుమారు కోటికి పైగా ఓటు బ్యాంకు ఉంటుందని గల్ఫ్‌‌ జేఏసీ లీడర్లు భావిస్తున్నారు. ఈ లెక్కన గల్ఫ్ ప్రభావిత నియోజకవర్గాల్లో 8 శాతం నుంచి 22 శాతంగా ఓటు బ్యాంక్‌‌ వీరిదే ఉన్నట్లు తెలుస్తోంది. 

గల్ఫ్‌‌ జేఏసీ నేతలు నిర్వహించిన సర్వేలో కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ పార్లమెంట్‌‌ పరిధిలో గల్ఫ్ ఓటు ప్రభావితం చేసే ప్రాంతాలను అసెంబ్లీ నియోజకర్గాల వారీగా ఏ-1, ఏ-2 కేటగిరిలుగా గుర్తించారు. 

గల్ఫ్‌‌ పాలసీని అమలు చేయని బీఆర్‌‌ఎస్‌‌

2008 ఏప్రిల్ 27న సికింద్రాబాద్‌‌లో నిర్వహించిన టీఆర్‌‌ఎస్‌‌ ఏడో ప్లీనరీలో ఎన్‌‌ఆర్‌‌ఐ సెల్‌‌ ఏర్పాటు చేసి రూ.500 కోట్లు కేటాయించాలని అప్పటి ప్రభుత్వాన్ని కేసీఆర్‌‌ డిమాండ్‌‌ చేశారు. గల్ఫ్‌‌ మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌‌గ్రేషియా, ఎన్‌‌ఆర్‌‌ఐ పిల్లలకు విద్య, ఉద్యోగ అవకాశం, గల్ఫ్‌‌లో చనిపోయిన వారి మృతదేహాలను తెప్పించేందుకు మానిటరింగ్‌‌ సెల్‌‌ ఏర్పాటు చేయాలని కోరారు. 

అనంతరం ఆయా హామీలు తాము అమలు చేస్తామని 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టారు. తర్వాత రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్‌‌ఎస్‌‌ గల్ఫ్‌‌ కార్మికులకు ఇచ్చిన హామీలను పట్టించుకోలేదు. దీంతో 24 గల్ఫ్‌‌ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి గల్ఫ్‌‌ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ పార్టీల తరఫున, ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. దీంతో బీఆర్‌‌ఎస్‌‌ ఓటు బ్యాంక్‌‌పై తీవ్ర ప్రభావం చూపింది.

‘గల్ఫ్’ఓటుపై కాంగ్రెస్‌‌ ఆశలు

కరీంనగర్‌‌, నిజామాబాద్‌‌, ఆదిలాబాద్‌‌ మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నడుస్తోంది. గల్ఫ్‌‌లో చనిపోయిన కార్మికుల ఫ్యామిలీలకు రూ. 5 లక్షలు ఇస్తామని గతంలో కాంగ్రెస్‌‌ ప్రకటించింది. ఇందులో భాగంగా ఎక్స్‌‌గ్రేషియా చెల్లింపును వేములవాడలో చేపట్టడం తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ లీడర్లు భావిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల ఫ్యామిలీలకు రూ.5 లక్షల ఎక్స్‌‌గ్రేషియా ఇచ్చే జీవో విడుదలపై కసరత్తు చేయాలని సీఎం సెక్రటరీ షానవాజ్‌‌ ఖాసీంకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కార్మికుల వెల్ఫేర్‌‌ బోర్డుకు సైతం హామీ ఇవ్వడంతో గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబాల ఓట్లు తమకు పడుతాయని ఆ పార్టీ లీడర్లు అంచనా వేస్తున్నారు.

గల్ఫ్‌‌ కార్మికుల ప్రధాన డిమాండ్లు

ప్రవాసీ భారతీయ బీమా యోజనలో సహజ మరణాన్ని కూడా చేర్చాలని గల్ఫ్‌‌ కార్మికులు డిమాండ్‌‌ చేస్తున్నారు. అలాగే విదేశీ మారకద్రవ్యం పంపే వారికి బంగ్లాదేశ్ ప్రభుత్వం మాదిరిగా ప్రోత్సాహకం ఇవ్వాలని, ఇమ్మిగ్రేషన్‌‌ యాక్ట్‌‌ 1983ను అప్‌‌డేట్‌‌ చేయాలని, గల్ఫ్ కార్మికులకు, వారి కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటీవల జగిత్యాల పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి గల్ఫ్ కార్మికులకు సామాజిక భద్రత, సంక్షేమం, కేంద్ర ప్రభుత్వం తరఫున సౌకర్యాల కల్పన, హక్కులపై బహిరంగ లేఖ రాశారు.